అచ్చెన్నాయుడు పగటికలలు కంటున్నాడు

టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల

పట్టాభి కారు అద్దాల ధ్వంసం వెనక ఇన్సూరెన్స్‌ గొడవ ఉందా..?

దాడిపై కంప్లయింట్‌ ఎందుకు ఇవ్వడం లేదు..?

ఎస్‌ఈసీ పరామర్శ వెనక ఉన్న ఆంతర్యమేంటీ..?

టీడీపీ వారైతేనే వెళ్తారా..? ఏ పార్టీకి చెందినవారు మరణించినా వెళ్తారా..? 

చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, నిమ్మగడ్డ కుట్ర చేస్తున్నారు

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ విజయం

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: ప్రభుత్వంపై నిందలు వేయడానికి, ప్రజలను నమ్మించేందుకు ఎల్లో మీడియా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని, చంద్రబాబు, ఎల్లో మీడియా ఎన్ని కుయుక్తులు పన్నినా.. ప్రజలెవరూ నమ్మరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నాడని, టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్టు చేశారో.. ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు తెలియదా..? అని ప్రశ్నించారు. నిమ్మాడలో అన్న కుమారుడు అప్పలనాయుడుపై దౌర్జన్యం చేసింది అచ్చెన్నాయుడు కాదా..? చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబును అయినా అరెస్టు చేయాల్సిందేనని, చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘అచ్చెన్నాయుడు హోంమంత్రి అవుతాడంట.. పోలీసుల తాట తీస్తాడంట. ఈ రాష్ట్రానికి హోంమంత్రి, మంత్రులు అయ్యేది డిపార్టుమెంట్‌లో ఉన్నవారి తాటలు తీయడానికేనా..? చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అని, లోకేష్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, అచ్చెన్నాయుడు కాబోయే హోంమంత్రి అని, స్టేట్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్రానికి రాబోయే పంచాయతీ రాజ్‌ మంత్రి అని అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారు. అచ్చెయ్యా.. ఇది జరిగే పనికాదు. మీరు మళ్లీ తిరిగి అధికారంలోకి రావడం కల్ల.. 

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మీద హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా పట్టాభి కారు మీద దాడి చేశారని పెద్ద హడావుడి చేశారు. రెండు సార్లు పట్టాభి కారే ధ్వంసం అయ్యింది అంటే ఏదైనా ఇన్సూరెన్స్‌ గొడవ ఉందా..? ఎవరిపై దాడులు జరిగినా వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. జరిగిన దాడిపై ఫిర్యాదు ఇవ్వమంటే.. ఇవ్వకుండా పట్టాభి ఎందుకు తప్పించుకుంటున్నాడు. 

బాబు వచ్చేంత వరకు హాయిగా టీవీల్లో మాట్లాడుతున్న పట్టాభి.. చంద్రబాబు రాగానే పడుకొని యాక్షన్‌ చేస్తున్నాడు. సీనియర్‌ నటుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ను మరిపించేలా చంద్రబాబు యాక్ట్‌ చేశారు. ఒక చిన్న దాడి జరిగితే దానికి చంపేస్తారా అంటూ గంభీరంగా మాట్లాడుతున్నాడు.. నువ్వు చచ్చిన పామువు చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో టీడీపీ చావు తప్పి కన్ను లొట్టపోయింది.. మీ అబ్బాయిని ఓడించారు. నువ్వు రాజకీయంగా చచ్చిపోయావని గుర్తుపెట్టుకో చంద్రబాబూ..

తూర్పుగోదావరి జిల్లాలో గొల్లలగుంట సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన వారి భర్త అనుమానస్పద స్థితిలో చనిపోయారు. ఆ ఘటనపై విచారణ జరుగుతుంది.. వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం వెనక ఉన్న ఆంతర్యమేంటీ..? ఎన్నికల కమిషన్‌ విధిని నిమ్మగడ్డ మరిచిపోయారా..? టీడీపీకి చెందిన వారు చనిపోతేనే వెళ్తారా..? లేక ఏ పార్టీకి సంబంధించిన వారు చనిపోయినా వెళ్లి పలకరిస్తారా..? నిమ్మగడ్డ సమాధానం చెప్పాలి. 

చంద్రబాబు తరఫున వెళ్లారా..? లోకేష్‌కు పైలెట్‌గా వెళ్లారా..? సమాధానం చెప్పాలి. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించకుండా.. ఎన్నికల కమిషన్‌ ఒక తెలుగుదేశం పార్టీలా అవతరించి వెళ్లి పరామర్శించే కార్యక్రమాలు జరుగుతుంటే.. దీని వెనకున్న కుట్ర ఏంటో అర్థం కావడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అయినా ఏమీ చేయలేరూ.. ఇది ప్రజాస్వామ్యం.. అంతిమ విజయం ప్రజలదే’ అని అంబటి రాంబాబు చెప్పారు. 
 

Back to Top