తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ ఉపకారం చేయొద్దని, వాళ్లకు ఉపకారం చేస్తే, పాముకు పాలు పోసినట్లే అని బహిరంగంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆ పదవికి అనర్హుడని, దీనిపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌రెడ్డి వెల్లడించారు. సీఎం స్థాయిలో అలా హేట్ స్పీచ్ చేయడం ఏ మాత్రం సరి కాదన్న ఆయన, చంద్రబాబు మీద హేట్ స్పీచ్ సెక్షన్లతో కేసు నమోదు చేసి, అనర్హత వేటు వేయొచ్చని స్పష్టం చేశారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని చెప్పారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయం చూడాలని, దూరవిద్యలో చదువుకునే విద్యార్థులకు న్యాయం చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీ కూటమికి చెంపపెట్టు అని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల్లో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతకు అది నిదర్శనమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో సతీష్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: చంద్రబాబుపై పబ్లిక్ లిటిగేషన్ కేసు పెడతాం: వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పనులు చేయబోమని సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు చెప్పడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పిన మాటలను చంద్రబాబు తప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్–14, ఆర్టికల్–21 ను ఆయన ఉల్లంఘించారు. రాగద్వేషాలను ప్రేరేపించారు. అందుకే చంద్రబాబుపై హేట్ స్పీచ్ సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయొచ్చు. కాబట్టి ఆయన కూడా శిక్షార్హుడు అవుతాడు. అందుకే చంద్రబాబు మీద అనర్హత వేటు వేసేలా న్యాయస్థానాల్లో పోరాడతాం. పబ్లిక్ లిటిగేషన్ కింద కేసు పెట్టి పోరాడతాం. ముందుగా గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేస్తాం. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీపై నిర్లక్ష్యం: రెండు తెలుగు రాష్ట్రాలకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడిగా ఉంది. ఈ యూనివర్సిటీ నుంచి ఏటా 35 వేల మంది వరకు రకరకాల కోర్సులు చేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ వారికి అడ్మిషన్లు ఇవ్వబోమని స్పష్టంగా చెప్పినా కూటమి ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయంగా విద్యార్థులకు ఎలాంటి మార్గాలు చూపలేదు. పైగా ఏపీకి చెందిన ఉద్యోగులకు జీతాలు చెల్లించక పోయినా వారి సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. భవిష్యత్తులో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలు చేసే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. అందుకే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయం చూడాలి. దూరవిద్యలో చదువుకునే విద్యార్థులకు న్యాయం చేయాలి. టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు కూటమికి చెంపపెట్టు: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి పాలనపై ప్రజలు, ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా, ఎన్నికల ముందు ఉద్యోగులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా కూటమి ప్రభుత్వం చేదు ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. దీంతో గెలిచిన అభ్యర్థినే తమ అభ్యర్థిగా కూటమి నాయకులు చెప్పుకోవడం కన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉండదు. ఈ ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. 9 నెలలుగా పీఆర్సీ కమిషన్ వేయడానికి కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోడం చూస్తే ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోందని ఎస్‌వీ సతీష్‌రెడ్డి గుర్తు చేశారు.