శ్రీ సత్యసాయి జిల్లా: మతపరమైన విధ్వంసాలు ప్రజాస్వామ్యానికి చేటు అని వైయస్ఆర్‌సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జాన్ విజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని పోతుకుంట గ్రామంలో ఉన్న బెర్షబా చర్చి ధ్వంసం ఘటనను వైయస్ఆర్‌సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శి పుట్లూరు ప్రభాకర్‌తో కలిసి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జాన్ విజయ్ కుమార్, థామస్ రాజ్ కుమార్‌లు బెర్షబా చర్చిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా జాన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మతపరమైన విధ్వంసాలు పెరుగుతున్నాయనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం తప్పదని హెచ్చరించారు. మతపరమైన ఉద్రిక్తతలు, విధ్వంషాలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను తక్షణమే గుర్తించి శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య సామరస్యం, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంటూ, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వైయస్ఆర్‌సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం నాయకులు స్పష్టం చేశారు.