టీడీపీ అరాచకాలపై కోర్టులకు వెళ్తాం

వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ స్పష్టీకరణ

అధికారమదంతో ఇష్టానుసారం దాడులు చేస్తారా?

కొట్టి చంపడం, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు ధ్వంసం చేయడం దారుణం

తిరువూరులో పోలీసులు వారిస్తున్నా ఎంపీపీ ఇంటిని కూల్చి కొలికపూడి అరాచకం

రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు మౌనం

చంద్రబాబు నేతృత్వంలో బుల్డోజర్ల పాలన: మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌

తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అరాచకాలపై కోర్టులకు వెళ్తామని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పాల్పడుతున్న అల్లర్లు, దాడులు చిన్నాచితకవి కాదని, కొట్టి చంపడం, కొట్టడం వ్యక్తిగత దూషణలకు పాల్పడి, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమన్నారు. అధికార మదంతో ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీలు మరిచి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ తో కలిసి నందిగం సురేష్‌ మీడియాతో మాట్లాడారు. 

ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధింపుల కోసం కాదు: నందిగం సురేష్‌
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం 12వ తేదీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం దాకా టీడీపీ నేతలు చేసిన అరాచకాలు కోకొల్లలు అని నందిగం సురేష్‌ మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు జగన్‌ మోహన్‌ రెడ్డి గారు పరిపాలన చేశారని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకోవడానికా? ప్రజలకు మేలు చేయడానికా? అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 5 నుంచి 6 శాతం ఓటింగ్‌ మారితే అధికారం తమ చేతిలో ఉండేదన్నారు. ప్రస్తుతం  ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా క్షణాల్లో సోషల్‌ మీడియాలో వచ్చేస్తోందన్నారు. కానీ, అవేవీ టీడీపీ నేతలకు కనపడటం లేదన్నారు. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ అరాచకాలు చేస్తున్నారని, భారీ ర్యాలీతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా ఎంపీపీ ఇంటిని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేయాల్సిన పనిని ఎమ్మెల్యేలు చేయడం ఎంత వరకు సబబు అని నందిగం సురేష్‌ ప్రశ్నించారు. తప్పు ఉంటే అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్లే దానికి పరిష్కారం చూస్తారన్నారు. తగుదునమ్మా అని ర్యాలీగా కొంత మందిని తీసుకెళ్లి ఇళ్లు పడగొట్టే స్థితికి చేరుతున్నారంటే మనం ఎటు పోతున్నామో అర్థం చేసుకోవాలన్నారు. 

హామీలను పక్కదారి పట్టించేందుకు గొడవలు
ఇచ్చిన హామీలను ఎలాగూ అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి, గొడవలు పెట్టి, భయపెట్టాలని చూస్తున్నారన్నారని నందిగం సురేష్‌ అన్నారు. పెన్షన్‌ రూ.7 వేలు అని చెప్పి చాలా చోట్ల రూ.6,500 అలా రకరకాలుగా పంచారన్నారు. పెన్షన్‌ తీసుకున్న వాళ్లు ఏ విధంగా మాట్లాడుకున్నారో సోషల్‌ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్‌ లను మీడియాకు నందిగం సురేష్‌ చూపించారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఓట్లు వేసిన వారిపైన, ప్రతిపక్షాలపైన కక్ష తీర్చుకోవాలని చూస్తోందన్నారు. ఇష్టానుసారంగా పోదాం అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాల జగన్‌ మోహన్‌ రెడ్డి గారి పాలనలో ఎవరిపైనైనా దాడులు చేశారా? ఎవరి ఇళ్లు అయినా పగలగొట్టారా? అని ప్రశ్నించారు. నెల రోజులు కాకముందే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కొడదాం, భయపెడదాం, టార్చర్‌ చేద్దాం, వైయస్సార్‌ సీపీ వాళ్లు ఎవరైనా వదిలిపెట్టేది లేదు, అంతు చూస్తామనడం సరైంది కాదన్నారు. మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాలన్నారు. నిన్న కూడా ఓ మినిస్టర్‌ భార్య పోలీసులపై ప్రవర్తించిన తీరు గమనించాలన్నారు. ఏరోజైనా వైయస్ఆర్‌ సీపీ హయాంలో ఇలాంటి ధోరణిలో బెదిరించారా? అని ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గంలో నిన్నగాక మొన్న వైయస్ఆర్‌ విగ్రహాన్ని తగలబెట్టారని, ఇలాంటివి సరికాదన్నారు. అల్లరచిల్లరగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, హేయమైన పద్ధతుల్లో కాకుండా రాష్ట్రాన్ని పాలించాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే తట్టుకోలేరన్నారు. ఎర్రబుక్కు రాసుకున్నాం కాబట్టి ఎవరినైనా బాధపెడతామంటే అందుకు చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. మహా అయితే కేసులు పెట్టగలరని, రాష్ట్ర ప్రజలు మీరు చేస్తున్న పనులు గమనిస్తూనే ఉన్నారన్నారు. 5 ఏళ్ల తర్వాత ఇవన్నీ రిఫ్లెక్ట్‌ అవుతాయని స్పష్టం చేశారు. ఇలాంటి దుశ్చర్యలపై కోర్టులకు వెళ్తామని నందిగం సురేష్‌ స్పష్టం చేశారు. ఎవరైతే అధికారం చేతపట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో వాళ్లందరిపైనా ప్రయివేటు కేసులకు కూడా వెళ్తామని హెచ్చరించారు. 

కొలికపూడి మనిషిలా ప్రవర్తించలేదు: మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌
చంద్రబాబు నేతృత్వంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ మండిపడ్డారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ ఒక మనిషిలాగా ప్రవర్తించలేదని, కార్లలో భారీ ర్యాలీగా వెళ్లి పోలీసులు ఆపుతున్నా ఇళ్లను బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక శక్తిగా మార్చారని మండిపడ్డారు. మభ్యపెట్టి హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను భయపెడుతున్నారన్నారు. అధికార మదంతో ఒక ఎంపీపీ ఇంటిని ఎమ్మెల్యే కొలికపూడి కూలగొట్టడం దారుణమన్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తారని కానీ అరాచకాలు చేస్తారని కాదన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే ఈ పాటికే అమ్మ ఒడి అందేదన్నారు. అమ్మ ఒడి, నిరుద్యోగభృతి గురించి ఎక్కడా ఇప్పుడు చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు. పెన్షన్లు ఇచ్చిన తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. ప్రోటోకాల్‌ పాటించలేదన్నారు. అబద్ధాలతో, రౌడీయిజంతో పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

Back to Top