గుమ్మనూరు జయరాంకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలి 

గుంతకల్లు నుంచి మళ్ళీ నేనే పోటీ చేస్తా

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి స‌వాల్‌

అనంతపురం: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటామ‌న్న టీడీపీ ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం వ్యాఖ్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. జ‌య‌రాంకు ద‌మ్ము ధైర్యం ఉంటే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌ళ్లీ పోటీ చేయాల‌ని, తాను వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేస్తాను అడ్డుకోమ‌ని స‌వాల్ విసిరారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. `గుమ్మనూరు జయరాం కు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలి. గుంతకల్లు నుంచి మళ్ళీ నేనే పోటీ చేస్తా. నన్ను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. గుమ్మనూరు జయరాం దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం. గుమ్మనూరు జయరాం కు ఐదేళ్లు మంత్రి పదవి ఇచ్చింది వైయ‌స్ఆర్‌సీపీనే. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటానంటే ఊరుకుంటామా?. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చరిత్ర అందరికీ తెలిసిందే. గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతల పేకాట, అక్రమ మద్యం, ఇసుక దందాలు అందరికీ తెలుసు. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు` అని మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి హెచ్చ‌రించారు. 

చంద్రబాబు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు వైయ‌స్ జగన్ ఫోబియా: అనంత వెంకటరామిరెడ్డి

చంద్ర‌బాబు, టీడీపీ కూట‌మి ఎమ్మెల్యేల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫోబియా ప‌ట్టుకుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అనంత‌పురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. `వైయ‌స్ఆర్‌సీపీని, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ని భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. వైయ‌స్ జగన్ తల నరుకుతామంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరింపు వ్యాఖ్యలు హేయం. గుమ్మనూరు జయరాం బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. రెడ్ బుక్ ద్వారా హింసా రాజకీయాలు చేస్తానంటున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై సుమోటోగా కేసు నమోదు చేయాలి. చంద్రబాబు సర్కార్ ఏడాది పాలనంతా రాజకీయ కక్ష సాధింపులే. చంద్రబాబు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు వైయ‌స్ జగన్ ఫోబియా పట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు` అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి త‌ప్పుప‌ట్టారు.

Back to Top