తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్’ అని పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వైయస్ జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని ఉద్ఘాటించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఏమన్నారంటే..: వైయస్ఆర్‌సీపీపై ప్రజల్లో నమ్మకం: వైయస్ఆర్‌సీపీ స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. 14 ఏళ్ల వైయస్ఆర్‌సీపీ ప్రయాణంలో మొదటి రోజు నుంచి.. ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి.. ప్రజల కష్టాలనువైయస్ఆర్‌సీపీ తమ కష్టాలుగా భావించి, ప్రజల తరపున వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 ఏళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తూనే వస్తున్నాం. కళ్లు మూసి తెరిచే సరికే ఇప్పటికే దాదాపు సంవత్సరం అయిపోయింది. మరో మూడు, నాలుగు సంవత్సరాల్లో మళ్లీ ఈసారి వచ్చేది వైయస్ఆర్‌సీపీనే. ఈరోజు వైయస్ఆర్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలోని ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలడు. ఏ పేద ఇంటికైనా వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సగర్వంగా, కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే అవకాశం ఉంది. ఆ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంటిలోని ప్రతి అక్క , ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వ, తాత, ప్రతి రైతు చక్కని చిరునవ్వుతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తను పలకరిస్తారు. ఎందుకంటే వైయస్ఆర్‌సీపీ ఎప్పుడైనా కూడా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి. పిల్లల సమస్యలు. ‘యువతపోరు’: ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య, యాదృచ్ఛికంగా విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించి, పిల్లలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి నిరసన కార్యక్రమం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఈ 10 నెలల కాలంలో, ఎన్నికల వేళ వాళ్లు చెప్పిన సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ గాలికెగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ.. ఏది చూసినా కూడా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు పిల్లలకు సంబంధించి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి, ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున, విద్యాదీవెన కింద ఏడాదికి నాలుగు క్వార్టర్లకు రూ.2800 కోట్లు కేటాయించాలి. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్‌లో రూ.1100 కోట్లు కేటాయించాలి. అంటే గత ఏడాది ఈ రెండింటికి సంబంధించి పిల్లల చదువుల కోసం మొత్తం రూ.3900 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటంటే కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. అంటే రూ.3200 కోట్లు బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. అదే విధంగా ఈ ఏడాది 2025–26కు సంబంధించి చూస్తే, విద్యాదీవెన కింద రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు. మొత్తం మరో రూ.3900 కోట్లు. అంటే ఈ మొత్తం, గత ఏడాది పెట్టిన బకాయి రూ.3200 కోట్లు. అన్నీ కలిపి మొత్తం దాదాపు రూ.7100 కోట్లు కేటాయించి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి, కేవలం రూ.2600 కోట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించి, పిల్లల చదువులతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే కార్యక్రమం పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి చేసే కార్యక్రమం కూడా, యాదృచ్ఛికంగా ఈరోజు జరుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పార్టీ నిరంతరం ప్రజలతోనే..: వైయస్ఆర్‌సీపీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై, వారికి అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ.. ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మీ అందరికి కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ శ్రీ వైయస్ జగన్ క్లుప్తంగా ప్రసంగించారు. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఇంకా పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.