తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, ఇతర నేతలు పాల్గొన్నారు. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులో అడుగేస్తూ.. ఆయన వెంట నడుస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, వైయస్ఆర్ కుటుంబ సభ్యులకు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ``వైయస్ఆర్ సీపీ 12 ఏళ్ల ప్రస్థానం గడిచింది. ప్రజల ఆశయాలను తన అజెండాగా మార్చుకున్న నాయకుడిని ప్రజలు ఎంతగా ఆదరిస్తారో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విషయంలో స్పష్టమైంది. ఆదర్శ పరిపాలన ఎలా ఉండాలో వైయస్ఆర్ దిశానిర్దేశం చేశారు. తండ్రి బాటలో అడుగులు వేసి ప్రజల్లో మమేకమైన నాయకుడు వైయస్ జగన్. వైయస్ఆర్ సీపీ 12 ఏళ్ల ప్రస్థానం, అంతకు ముందు 3 ఏళ్లు కలుపుకుంటే మొత్తం 15 ఏళ్లుగా ఒక నాయకుడు ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలి.. ఆ నాయకుడి నాయకత్వంలో ఒక పార్టీ ఆవిర్భవిస్తే ఎలా ఉంటుందో వైయస్ జగన్ చూపించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 ఏళ్ల ప్రస్థానం సాగింది. 12 ఏళ్లుగా సీఎం వైయస్ జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైయస్ జగన్. ప్రజల ఆశీస్సులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం వైయస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో వైయస్ఆర్ సీపీ ఓ రోల్ మోడల్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఓటమి ఉండదు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరు`` అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.