విజయవాడ: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద మహానేత విగ్రహానికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2004 నుంచి 2009 వరకు నభూతో న భవిష్యత్ అనేలా వైయస్ఆర్ పరిపాలన జరిగిందన్నారు. వైయస్ఆర్ చనిపోయి 13 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేసుకున్నారు. వైయస్ అమలు చేసిన పథకాల్లో ఒక్కటి కూడా చంద్రబాబు కొనసాగించలేకపోయారని విమర్శించారు.
14 ఏళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు పాలన చూస్తే ఒక్క పథకం గుర్తుకు రాదని.. సీఎం వైయస్ జగన్ మళ్లీ వైయస్ఆర్ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ అంటే వైయస్సార్, అమ్మఒడి అంటే వైయస్ జగన్ గుర్తుకొస్తాయన్నారు. చంద్రబాబు అంటే కరువు కాటకాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. తనదైన శైలిలో ఉమ్మడి రాష్ట్రంలో మహానేత వైయస్ఆర్ అనేక కార్యక్రమాలు రూపొందించారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు చరిత్రలోనే నిలిచిపోయాయన్నారు. పాలన అంటే వైయస్సార్ ముందు వైయస్సార్ వెనుక అనేలా ఉందన్నారు. సమాజంలో వెనుకబడిన కులాలను సీఎం వైయస్ జగన్ ముందుకు తెచ్చారన్నారు. వైయస్ఆర్ ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఐఐఐటీలు, బందరు పోర్టు వంటివి వైయస్ఆర్ హయాంలో మన ప్రాంతానికి వచ్చాయన్నారు. రూపాయి డాక్టరుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి వైయస్ఆర్ కోట్లమంది మనసులను గెలుచుకున్నారన్నారు.
వైయస్ఆర్ ప్రజల గుండెచప్పుడు తెలుసుకున్న నేత అని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. వైద్య వృత్తిలో ఉండడం వల్ల ప్రజలకు వైద్యం ఎంత అవసరమో తెలుసుకున్న నాయకుడు అన్నారు. వైయస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమం, వైద్యం అప్పట్లో ఒక సంచలనం అని.. వైయస్ జగన్ తండ్రి కంటే పది అడుగులు ముందుకు వేసి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.