రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించండి

గంట పాటు ప్రధాని మోదీతో వైయస్‌ జగన్‌ భేటీ

రాష్ట్ర సమస్యలే ప్రధాన ఎజెండాగా సాగిన చర్చ

ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కోరిన వైయస్‌ జగన్‌

ఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రధాని మోదీ నివాసానికి వెళ్లిన వైయస్‌ జగన్‌ మరోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గొప్ప విజయం సాధించిన వైయస్‌ జగన్‌కు మోదీ సైతం అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమస్యలే ప్రధాన ఎజెండాగా సుమారు గంట పాటు వైయస్‌ జగన్‌ మోడీతో చర్చించారు. ముందుగా ఈ నెల 30వ తేదీన జరిగే ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా మోదీని కోరారు. అనంతరం రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్‌ప్లాంట్, దుగరాజుపట్నం పోర్టు, కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులపై ప్రస్తావించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌ వెంట సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నందిగాం సురేష్, వైయస్‌ అవినాష్‌రెడ్డి, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top