సింగయ్య మరణంపై చంద్రబాబు రాజకీయం

మూడు రోజుల్లో కట్టుకథలను అల్లి తప్పుడు కేసులు

కుట్రలపై ఆధారాలతో సహా కూటమి సర్కార్‌ను నిలదీసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నిజమైనదేనా?

ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించుకున్నారా?

జిల్లా ఎస్పీ స్టేట్‌మెంట్‌ను ఎవరు మరోలా మార్పించారు?

పంచనామా, ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాలకు భిన్నం ఎలా కేసులు నమోదు చేశారు?

ప్రశ్నించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

తాడేపల్లి: కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు తాజాగా సత్తెనపల్లిలో జరిగిన సింగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ వైయస్ జగన్‌పై కుట్రలకు పాల్పడుతున్నాడని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై పోలీసులు మూడు రోజుల్లోనే తమ మాటను మార్చడం వెనుక చంద్రబాబు పన్నిన కుతంత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా, వైయస్ జగన్‌కు భారీగా ప్రజాధరణ వస్తుండటంను జీర్ణించుకోలేక తప్పుడు కేసులతో దిగజారుడు రాజకీయంకు చంద్రబాబు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సింగయ్య మృతికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా దుర్మార్గంగా వ్యవహరించిందో అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని పత్రికాముఖంగా బయటపెట్టి ఈ ప్రభుత్వ నీచాన్ని ప్రజలకు చూపిస్తున్నామని అన్నారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

సత్తెనపల్లిలో సింగయ్య అనే వైయస్ఆర్‌సీపీ కార్యకర్త మరణంపై ప్రజల్లోకి అబద్దపు ప్రచారం, ఎల్లో మీడియా అండతో విషప్రచారం చేయడం ద్వారా చంద్రబాబు రాజకీయాల్లో ఎంతగా దిగజారిపోవచ్చో నిరూపిస్తున్నారు. సింగయ్య మరణం, దానిపై కూటమి ప్రభుత్వ కుట్రలను అన్ని ఆధారాలతో సహా ప్రజలకు చూపిస్తున్నాం. సత్తెనపల్లిలో వైయస్ జగన్ పర్యటనలో ఎక్కడా ఆయనకు కనీస భద్రత కల్పించలేదు. కనీసం పోలీస్ ఎస్కార్ట్, రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేయలేదు. పైగా జనం వైయస్ జగన్ పర్యటనల్లో పాల్గొనకుండా పోలీసుల ద్వారా అనేక ఆంక్షలు కల్పించారు. అసలు ఆయన రాష్ట్రంలో ఎక్కడా పర్యటించకుండా ఉండాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగానే సత్తెనపల్లిలో సింగయ్య మరణంపై కట్టుకథలతో కూడిన ఒక తప్పుడు ప్రచారంకు తెగబడ్డారు. 

సింగయ్యను ఢీ కొట్టినది కాన్వాయి వాహనం కాదు 

ఈ నెల 18న సింగయ్య సత్తెనపల్లిలో రోడ్డు ప్రయాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదేరోజు పల్నాడు ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ టాటా సఫారీ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీ కొట్టడం వల్ల సింగయ్య గాయపడి, మృతి చెందాడాని వెల్లడించారు. ఈ వాహనం కాన్వాయికి చెందినది కాదని, కాన్వాయి కోసం అనుమతులు తీసుకున్న జాబితాలో కూడా ఈ వాహనం లేదని ఎస్పీ చాలా స్పష్టంగా వివరించారు. కారు ఢీ కొన్న సందర్భంగా సింగయ్యకు గాయాలయ్యాయి, ఆయనను పోలీసులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామని కూడా చెప్పారు. ఆరోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఎలా సింగయ్యను ఆసుపత్రికి తరలిస్తున్నారు, ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఈ సందర్భంలో ప్రత్యక్షసాక్షిగా ఉన్న పార్టీ కార్యకర్త వీరయ్య, హైకోర్ట్ న్యాయవాది బరిగెల కోటేష్‌ లు వెంటనే స్పందించారు. అక్కడే మీడియాతో కూడా వారు మాట్లాడారు. 'ప్రమాదంలో గాయపడిన సింగయ్యను చూసి మేము అతనికి మంచినీళ్ళు తాగించాం, వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ఆటోను పిలుస్తామని అక్కడే వున్న ఏఎస్ఐకి చెప్పామని' వారు మీడియా వారికి తెలిపారు. అప్పటికే తాము అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చామని ఏఎస్ఐ రాజశేఖర్‌ తమకు  చెప్పారని, అంబులెన్స్‌ వచ్చేందుకు 35 నిమిషాల సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిద్దరూ మీడియాకు వెల్లడించారు. ఈ లోగా సింగయ్యను ఫుట్‌పాత్‌ పై పడుకోబెట్టారని, సింగయ్య కాలుమీద కాలు వేసుకుని పడుకునే అక్కడ ఉన్న వారితో మాట్లాడారని చెప్పారు. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలకు చూపిస్తున్నాం. ప్రమాదం తరువాత సింగయ్య మంచినీరు తాగుతున్న దృశ్యం, ఆయనను ఆటోలో ఎక్కించేందుకు చేసిన ప్రయత్నం, తరువాత అంబులెన్స్‌లో ఎక్కిస్తున్న దృశ్యం, అలాగే ఆయన కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతున్న దశ్యంకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా అందరికీ చూపిస్తున్నాం. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన సమాచారంకు అనుగుణంగానే జిల్లా ఎస్పీ కూడా అదే రోజు మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ ఘటనలో పోలీసులు సదరు టాటా సఫారీ వాహనంను సీజ్ చేయడంతో పాటు, దానిని డ్రైవ్ చేసిన డ్రైవర్‌కు 41ఏ నోటీస్ ఇచ్చి, అతడిని విడిచిపెట్టారు. ఈ ఘటన గురించి జిల్లా ఎస్పీ ఏం మాట్లాడారో, సదరు టాటా సఫారీ వాహనంను కూడా చూపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు చూపిస్తున్నాము. 

మూడు రోజుల్లోనే మాట మార్చేశారు

ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత కుట్రపూరితంగా ఒక వీడియోను ఎల్లో మీడియా వైరల్ చేసింది. ఆ వీడియోలో సింగయ్య ఏకంగా వైయస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయి వాహనం కింద పడినట్లు, ఎవరూ ఆయనను పట్టించుకోకుండా వదిలేసినట్లు, తరువాత సింగయ్య చనిపోయినట్లుగా ఆ వీడియోను వైరల్ చేశారు. ఈ వీడియోను ఆధారం చేసుకుని 21వ తేదీన జిల్లా ఎస్పీతో మళ్లీ మీడియాతో వేరే విధంగా మాట్లాడించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ద్వారా నిర్ధారించుకుని, దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎక్కడైనా ఈ విధానాన్ని ప్రభుత్వం అనుసరించిందా? ఈ వీడియో బయటకు రాగానే పోలీసులతో దానికి అనుగుణంగా కేసులు బనాయించారు. ఈ వీడియోలో కూడా చాలా అస్పష్టత ఉంది. సింగయ్యను అదే కారు ఢీ కొట్టినట్లు, ఆయనపైకి దూసుకువెళ్ళినట్లు, ఆయన పై నుంచి వెళ్ళిపోయిన విజువల్స్, లేదా ఆ కారు కింద నుంచి అతడిని బయటకు తీసుకువచ్చిన విజువల్స్‌ ఏమాత్రం లేవు. దాదాపు 3500 కేజీలకు పైగా బరువున్న ఆ వాహనం పై నుంచి దూసుకువెడితే, సింగయ్య శరీరంపై చిన్న గాయాలే అవుతాయా? అలాంటప్పుడ సింగయ్య శరీరంపై చిన్న గాయాలే ఉన్నట్లు పోలీసుల పంచనామాలో ఎలా నమోదయ్యింది? అంటే నిజంగా వైయస్ జగన్ ప్రయాణించిన కారు సింగయ్యను ఢీకొట్టిందా అంటే, పోలీసుల వద్ద ఉన్న రిపోర్టే అది నిజం కాదు అని చూపిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను నిజం అని ఎలా నిర్ధారించారు. ఇది పూర్తిగా చంద్రబాబు కుట్రపూరితంగా ఇచ్చిన ఆదేశాల మేరకే దీనిపై పోలీసులు అది నిజం కాదు అని తెలిసి కూడా, విధిలేక కేసులు నమోదు చేశారు.  

గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారో మరిచిపోయారు

కందుకూరులో 8 మంది, గుంటూరులో ఆరుగురు చంద్రబాబు పర్యటనల్లో చనిపోయారు. ఆ రోజు చంద్రబాబు, ఇప్పుడు హోమంత్రిగా ఉన్న వి.అనితలు ఏం మాట్లాడారో కూడా ఆ వీడియోలను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఆ రెండు ఘటనల్లోనూ పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు మాట్లాడారు. అనిత మాట్లాడుతూ బుర్ర, బుద్ది లేదు, రాజకీయాలు ఇంత దిగజారి చేస్తారా అంటూ ఆనాటి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడు వారిరు వైయస్ జగన్ పర్యటనలో దుర్ఘటన జరిగితే ఎలా మాట్లాడుతున్నారో చూస్తే, ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి. మాజీ సీఎం వైయస్ జగన్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? సత్తెనపల్లితో పాటు గతంలో వైయస్ జగన్ పర్యటనలకు కూడా కనీసం పోలీస్ భద్రత కల్పించడం లేదు. పైగా ఆయన ఎక్కడా పర్యటనలు చేయకూడదనే కుట్రతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సింగయ్య కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా నిలబడింది. కందుకూరి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోలేదు. గుంటూరులో సింగరాయకొండకు చెందిన వ్యక్తి చనిపోతే, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి, నేటికీ వారిని పట్టించుకోవడం లేదు. చంద్రబాబుకు మానవత్వం లేదు. 

రాష్ట్రంలో గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నదే టీడీపీ నేతలు 

గుంటూరులో డ్రగ్స్‌పై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్‌లోనూ చంద్రబాబు అనేక అబద్దాలతో తన సహజ స్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు. అక్కడ కూడా వైయస్‌ఆర్‌సీపీపైనే విషం చిమ్మారు. ఈ రాష్ట్రానికి నాలుగుసార్లు సీఎంగా చంద్రబాబు పాలించారు. కేవలం వైయస్ఆర్‌సీపీ అయిదేళ్ళే పాలించింది. దానిలో రెండేళ్ళు కరోనాలో పోతే, మిగిలిన మూడు సంవత్సరాల్లో గంజాయిని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ లభిస్తున్నాయి. గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. గుంటూరు కాజా టోల్‌ప్లాజా వద్ద, గుంటూరు హోటల్‌లో తాజాగా గంజాయి పట్టుబడింది. కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతోందంటే, దీనికి ఎవరు అండగా ఉన్నారు? అలాగే రాష్ట్రంలో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. గంజాయి సాగును ప్రోత్సహిస్తోందే తెలుగుదేశం నాయకులు. అందుకే గంజాయి సాగును, మార్కెటింగ్‌ను అడ్డుకోలేకపోతున్నారు. తమ చేతకానితనంను కప్పిపుచ్చుకునేందుకే వైయస్ఆర్‌సీపీపై నిందలు  మోపుతున్నారు. 

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన నారా లోకేష్

యర్రగుంటపాలెంలో విద్యావ్యవస్థ దయనీయమైన స్థితిలో ఉంది. చంద్రబాబు తనయుడు అయిన లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో డొల్లతనం కనిపిస్తోంది. యర్రగుంటపాలెం నియెజకవర్గంలో దాదాపు 426 మంది ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో వచ్చింది కేవలం వంద మంది మాత్రమే. ఎందుకు ఇన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయని చూస్తే, స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీకి ముడుపులు ఇచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఆయనకు ముడుపులు సమర్పించలేక టీచర్లు ఎవరూ యర్రగుంటపాలెం నియోజకవర్గంలోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు.

Back to Top