మహిళల సమక్షంలో రచ్చబండకు పవన్ సిద్ధ‌మా..?

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఓపెన్ ఛాలెంజ్ 

ప‌వ‌న్‌కు రాష్ట్రం మీద కోప‌మా.. రాజ‌కీయ కోప‌మా..?

వ‌లంటీర్ వ్య‌వ‌స్థే అదృశ్యాల‌కు కార‌ణమ‌ని చెప్ప‌డానికి మీ ద‌గ్గ‌రున్న ఆధారాలేంటి..?

మ‌హిళా అదృశ్యాల్లో మొద‌టి 10 స్థానాల్లోని రాష్ట్రాల్లో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ఉందా..?

క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కుట్ర

దేశ స‌మ‌స్య‌ను తీసుకువ‌చ్చి ఏపీపై రుద్దాల‌ని ప‌వ‌న్ తాప‌త్ర‌యం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌త్త‌పుత్రుడే కాదు.. విష‌పుత్రుడు కూడా..

స‌చివాల‌యం: ఒక క్రిమినల్ కహానీ అల్లి మ‌హిళా ప‌క్ష‌పాతి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర అని మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌ను చూపించి దానిపై పవన్ అనేక వ‌క్రీక‌ర‌ణ‌లు చేస్తున్నార‌ని, మొద‌టి ప‌ది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల గురించి మాట్లాడ‌కుండా, తెలుగు రాష్ట్రాల సంబంధించిన మ‌హిళ‌ల అదృశ్యం గురించి మాట్లాడటం వెనుక ఉద్దేశాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. మ‌హిళల అదృశ్యంలో ఏపీ దేశంలో 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించటం లేదని ప్ర‌శ్నించారు. 6వ స్థానంలో ఉన్న తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడ‌టం లేదని ప్ర‌శ్నించారు. 

ఏపీని ఒక దోషిగా, అరాచ‌క ప‌రిస్థితి ఉన్న‌ట్టుగా చూపించే తాప‌త్ర‌యం ఎందుకుప‌డుతున్నార‌ని నిల‌దీశారు. ప‌ది రాష్ట్రాల్లో ఏపీ కంటే ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని, దేశంలోని స‌మ‌స్య‌ను పక్క‌న‌బెట్టి ఏపీ మాత్ర‌మే టార్గెట్ ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. వలంటీర్ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం అంటూ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్న వ్య‌వ‌స్థ‌పై ప‌వ‌న్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థే అదృశ్యాల‌కు కార‌ణం అని చెప్ప‌డానికి ప‌వ‌న్ ద‌గ్గ‌రున్న ఆధారాలేంటో చెప్పాల‌ని మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు ఇచ్చింద‌న్నారు. మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయా..? అని ప్ర‌శ్నించారు. స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

``ప్రేమ‌ వ్యవహారాల వల్లనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా..? తప్పిపోయిన వారిలో 78 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించాలని అనుకోవటం లేదు..? రిక‌వ‌రీలో హ‌య్య‌స్ట్ స్టేట్‌గా ఉన్న ఏపీ గురించి మాట్లాడ‌కుండా కేవ‌లం అనుకూల‌మైన కోణాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ దీనికి కార‌ణ‌మ‌ని కుట్ర పూరిత‌మైన ఆరోప‌ణ‌ను ప‌వ‌న్ చేశాడు. 

2014-19 వరకు టీడీపీ, జనసేన భాగస్వామ్య ప్రభుత్వమే. అప్పుడు ఎందుకు మహిళల గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు..? మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాల‌ని, వారి కుటుంబం సంతోషంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం మెజార్టీ ప‌థ‌కాల‌ను మ‌హిళ‌ల పేరు మీద‌నే అమ‌లు చేస్తుంది. ఆడ‌ప‌డుచుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ప్ర‌భుత్వ సాయం జ‌మ అవుతుంది. గౌరవంగా, హక్కుగా మహిళలు సంక్షేమ‌ పథకాలు పొందుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తుంటే వారిని అవమానిస్తారా..? ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌త్త‌పుత్రుడే కాదు.. విష‌పుత్రుడు కూడా.

చీరలు పంచుతామని పిలిచి మ‌హిళ‌ల చావులకు కారణం అయ్యారు. మహిళలకు ప‌వ‌న్‌, ఆయ‌న పార్ట్‌న‌ర్ చంద్ర‌బాబు ఇచ్చే గౌరవం ఇది. ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర. మ‌హిళ‌లు బాగుప‌డ‌టం ప‌వ‌న్‌, చంద్ర‌బాబుకు ఇష్టం లేద‌ని అర్థం అవుతుంది.  సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా..? మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది. కనుకే నోటీసులు ఇస్తున్నాం. ప‌వ‌న్‌కు, చంద్ర‌బాబుకు మ‌హిళ‌ల‌తో ఆడుకోవ‌డం తెలుసు.. కానీ, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌హిళ‌ల‌ను ఆదుకోవ‌డం తెలుసు. 

మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్. కోడ‌లు మ‌గ‌బిడ్డ‌ను కంటానంటే అత్త వ‌ద్దంటుందా అని ప‌వ‌న్‌ పార్ట్‌న‌ర్ మాట్లాడుతాడు.. ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అంటాడు. మీరు చేసే వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌శ్నించ‌కూడ‌దా..? మిమ్మ‌ల్ని ప్ర‌శ్నించ‌డ‌మే కాదు.. క‌న‌బ‌డితే, ఎదురుప‌డితే లాగి లెంప‌కాయ్ కొట్టాల‌ని మ‌హిళా క‌మిష‌న్‌కు అనిపిస్తుంది. కానీ, బాధ్య‌తాయుత‌మైన వ్య‌వ‌స్థ‌లో ఉన్నాం కాబ‌ట్టే నోటీసుల‌తో స‌రిపెట్టుకుంటున్నాం.  సినీ, రాజకీయ నాయకుల తీరుపై చర్చ జరగాలి. ప‌వ‌న్‌కు రాష్ట్రం మీద కోప‌మా.. రాజ‌కీయ కోప‌మా..? రాష్ట్రానికే కట్టప్పల్లా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రం పై దాడి. మహిళా కమిషన్‌కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉంటే పొగడకుండా ఎలా ఉంటాం. 

మ‌హిళ‌ల స‌మ‌క్షంలో ర‌చ్చ‌బండ పెడ‌దాం రండి. మీరు వ‌లంటీర్ల‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై మ‌హిళ‌లు ఏమ‌నుకుంటున్నారో మ‌న‌సుపెట్టి ఇప్ప‌టికైనా వినండి. మ‌హిళా అభివృద్ధి కోసం రాష్ట్రంలో య‌జ్ఞం జ‌రుగుతుంటే.. దాన్ని చెడ‌గొట్ట‌డానికి రాక్ష‌స‌మూక‌ల్లా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌హిళ‌ల ముందుకు వ‌చ్చే ధైర్యం ప‌వ‌న్‌కు లేదు. మ‌హిళ‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ స‌మాధానం చెప్ప‌గ‌లిగితే మ‌రోసారి మ‌హిళ‌ల అదృశ్యానికి, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు లింక్ పెట్టి మాట్లాడ‌లేరు`` అని వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు.

Back to Top