చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దం

విజ‌య‌న‌గ‌రం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)  

విజయనగరం: ఇటీవ‌ల‌ సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని విజ‌య‌న‌గ‌రం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు సోమవారం ఆయ‌న పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ వారికి ప‌నులు చేయ‌నంటూ చంద్రబాబు చేసిన దిగ‌జారుడు వ్యాఖ్య‌లను వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని అన్నారు.  వెంట‌నే చంద్ర‌బాబు త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే...

ఇన్నాళ్లు వైయ‌స్ఆర్‌సీపీపై త‌న‌లో దాచుకున్న కుట్ర‌, విషాన్ని చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్టారు. అంద‌రికీ స‌మన్యాయం చేస్తాన‌ని ప్ర‌మాణం చేసిన వ్య‌క్తి ఇలా మాట్లాడ‌టం స‌బ‌బేనా?చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై డీసీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాలి.

వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందనివ్వకూడదని ముఖ్యమంత్రి స్థానంలో వున్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దమని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు.చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక తెలుగుదేశం పార్టీ వారికే ముఖ్యమంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు. సీఎంగా పదవీ స్వీకారం సందర్భంగా రాష్ట్ర ప్రజలను సమ దృష్టితో చూస్తానంటూ, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తన ప్రత్యర్థి పార్టీ వారికి సంక్షేమాన్ని అందించకూడదంటూ ఆయన చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి స్థానాన్నే దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోస‌మే చంద్ర‌బాబు తాప‌త్ర‌యం...

చంద్ర‌బాబు విజ‌న్ ఉన్న నాయ‌కుడు కాదు, విషం చిమ్మే నాయకుడు. ఆయ‌న నిజ‌స్వ‌రూపం జీడీ నెల్లూరు కార్య‌క‌ర్త‌ల స‌మావేశం సాక్షిగా బ‌య‌ట‌ప‌డింది. తాను సీఎం స్థానంలో ఉన్నాన‌న్న స్పృహ లేకుండా వైయ‌స్ఆర్‌సీపీ వారికి ప‌నులు చేయ‌న‌ని చెప్ప‌డం ద్వారా ఇన్నాళ్లు త‌నలో దాచుకున్న‌ ద్వేషం, కుళ్లును బ‌య‌టపెట్టుకున్నారు. ఇలాంటి వ్య‌క్తి సీఎంగా ప్ర‌మాణం చేసే సంద‌ర్భంలో చెప్పిన‌ట్టుగా నిష్ప‌క్ష‌పాతంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను స‌మానంగా చూస్తాడ‌ని అనుకోలేం.  పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ చేస్తాన‌ని చెప్పి తన కొడుకు లోకేష్ రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం ప‌నిచేస్తున్నాన‌ని చంద్ర‌బాబు ఒప్పుకున్నారు. మేం త‌లచుకుంటే వైయ‌స్ఆర్‌సీపీ వారు రోడ్డు మీద తిర‌గ‌లేర‌ని హోంమంత్రి అనిత చెప్ప‌డం చూస్తుంటే టీడీపీ కార్యక‌ర్త‌ల‌కు పసుపు బిళ్ల ఇచ్చి ప్ర‌భుత్వ ఆఫీసుల్లో ప‌నులు చేసి పెడ‌తామ‌ని చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌ల‌కు కొన‌సాగింపుగా ఉన్నాయి. రాజ్యాంగ‌బ‌ద్ద ప‌ద‌వుల్లో ఉన్న వ్య‌క్తులు పార్టీకి అనుకూలంగా ప‌నిచేస్తామ‌ని నిస్సిగ్గుగా చెప్ప‌డాన్ని ప్ర‌జాస్వామ్యవాదులు ఖండించాలి.  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తుంటే త‌ట్టుకోలేక‌పోతున్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండ‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతో మా పార్టీ నాయ‌కులపై అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధిస్తున్నారు.

వివక్షత లేకుండా పాలన అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ది....

గ‌త ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ  పాల‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కులం, మ‌తం, ప్రాంతం చూడ‌కుండా రాజ‌కీయాల‌కు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి ప‌థ‌కాలు అందించారు. చంద్ర‌బాబు మాత్రం వైయస్ఆర్‌సీపీ వారికి ప్ర‌త్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగాకానీ ప‌నిచేయన‌ని చెప్ప‌డం చూస్తుంటే ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా పాలిస్తున్నాడో అర్థమవుతోంది. 40 ఏళ్ల అనుభ‌వ‌జ్ఞుడిన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు మ‌రింత దిగ‌జారిపోయి పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ చూస్తార‌ని బహిరంగంగా చెప్ప‌డం ఇంకా సిగ్గుచేటు. 1995 కాలం నాటి ముఖ్య‌మంత్రిని చూస్తార‌ని చెప్ప‌డం చూస్తుంటే మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో సీఎం అయిన ఉదంతం ప్ర‌జ‌లకు గుర్తు చేస్తున్నారా? పేరుకే చంద్ర‌బాబు విజ‌న‌రీ. 9 నెల‌ల పాల‌న‌తోనే చంద్ర‌బాబు విఫ‌ల ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు పొంత‌నే ఉండ‌టం లేదు. 12 శాతం వృద్ధి రేటు న‌మోదు చేశానంటాడు.. కానీ వారం వారం మంగళవారం అప్పులు తెస్తాడు. చంద్ర‌బాబు చేత‌కానిత‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు ఎంత‌సేపటికీ గ‌త వైయస్ఆర్‌సీపీ  ప్ర‌భుత్వం మీద నెపం నెట్టాల‌ని చూస్తాడు త‌ప్పితే, ఎన్నిక‌ల హామీల అమ‌లుపై చిత్త‌శుద్దితో ప్ర‌య‌త్నించ‌డం లేదు. చంద్ర‌బాబు ఫెయిల్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అంబేడ్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని ప‌క్క‌న‌పెట్టి కొడుకు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు చేయ‌డ‌మే. క్లిష్ట ప‌రిస్థితుల్లో ప‌రిపాల‌న ఎలా చేయాలో తెలియ‌క‌పోతే గ‌త వైయ‌స్ జ‌గ‌న్‌ పాల‌న నుంచి స్ఫూర్తి పొందాలి. ఎన్నిక‌ల హామీల అమ‌లులో వారు చూపిన చిత్త‌శుద్ధి నుంచి ప్రేర‌ణ పొందాలని  మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సూచించారు. 
 

Back to Top