న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ ప్రకటించారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసిన విద్యుత్ చార్జీల కింద 6 వేల కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ ప్రభుత్వం బకాయిపడింది. ఏపీకి బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం ఏళ్ళ తరబడి జాప్యం చేస్తూ వస్తోంది. విద్యుత్ చార్జీల బకాయిల చెల్లించేలా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం పలుదఫాలు తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వాటా కింద విడుదల చేసే కేంద్ర పన్నుల నుంచి మినహాయించి తమకు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర విద్యుత్, ఆర్థిక శాఖలు పరిగణలోకి తీసుకున్నాయా.. తీసుకుంటే ఈ బకాయిల చెల్లింపు ఎప్పటిలోగా జరుగుతుందని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్‌ను వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి జవాబిస్తూ రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్ళాయి. ఫలితంగా కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయవలసిందిగా ఏపీని ఆదేశించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసిన విద్యుత్ నిమిత్తం కొంతకాలం సక్రమంగానే చార్జిలను చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం తదనంతరం చెల్లింపులను నిలిపివేసింది. ఫలితంగా తెలంగాణ చెల్లించవలసిన విద్యుత్ చార్జిల బకాయిలు 6 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయి. బకాయిల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల అధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. కేంద్రం ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా చేసినందున తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని కేంద్రమంత్రి చెప్పారు. ఒక రాష్ట్రం బకాయిలు చెల్లించకుండా మొండికేసిన సందర్భంలో బకాయిల చెల్లింపు కోసం కేంద్రం అనుసరించాల్సిన విధివిధానాలపై న్యాయ మంత్రిత్వ శాఖతోను, ఆర్థిక మంత్రిత్వ శాఖతోను చర్చలు జరుపుతున్నాం. రాష్ట్ర పన్నులలో వాటా కింద తెలంగాణకు ఇచ్చే నిధుల నుంచి ఈ బకాయిల మొత్తాన్ని మినహాయించ వలసిందిగా రిజర్వు బ్యాంక్‌ను కోరే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ తెలిపారు.