ఏపీలో నాలుగు సమీకృత పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు

రాజ్య‌స‌భ‌లో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి జ‌వాబు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి అభిమ్‌ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సమీకృత పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు (ఐపీహెచ్‌ఎల్‌) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబిస్తూ.. ఈ పథకం కింద దేశంలోని 730 జిల్లాల్లో వైద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు సమీకృత ప్రజారోగ్య లేబరేటరీలను నెలకొల్పుతున్నట్లు ఆమె చెప్పారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఐపీహెచ్‌ఎల్‌ ఏర్పాటుకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో, మరో మూడు ల్యాబ్‌ల ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.

జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో అంటువ్యాధులపై కచ్చితమైన సమాచారాన్ని అందించే సర్వైలెన్స్‌ వ్యవస్థ ఏర్పాటు ఐపీహెచ్‌ఎల్‌ ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఈ లాబ్‌ల ద్వారా అందే సమాచారం, డేటా ఆధారంగా ప్రజారోగ్యానికి ఏర్పడే ముప్పును ముందుగానే గుర్తించడం, సమర్దంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుందని కేంద్ర‌మంత్రి తెలిపారు. మైక్రోబయాలజీ, హెమటాలజీ, క్లినికల్‌ బయోకెమిస్ట్రీ, క్లినికల్‌ పాథాలజీ, సైటాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ వంటి సేవలను సమీకృతంగా ఈ లాబ్‌ల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

Back to Top