త్వ‌ర‌లో ఆర్జిత సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌

 టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

రూ.3,096 కోట్లతో టిటిడి బడ్జెట్‌కు ఆమోదం

తిరుప‌తి:  తిరుమల తిరుపతి దేవస్థానం 2022 - 23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ - 19 నిబంధ‌న‌లను స‌డ‌లించిన నేప‌థ్యంలో త్వ‌ర‌లో కోవిడ్‌కు ముందులాగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు పున‌రుద్ధ‌రించ‌డంతో పాటు, స‌ర్వ‌ ద‌ర్శ‌నం, శీఘ్ర ద‌ర్శ‌నం టికెట్ల సంఖ్య‌ను క్ర‌మంగా పెంచాల‌ని బోర్డు తీర్మానించిన‌ట్లు చెప్పారు.  

             తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం టిటిడి పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ ఆ వివరాలు తెలిపారు.

-     రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌ.శ్రీ వైఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు టిటిడి ఆధ్వ‌ర్యంలో రూ.230 కోట్ల‌తో శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్లల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి భ‌వ‌నాల‌ నిర్మాణానికి ఆమోదం. ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాలు రెండు సంవ‌త్స‌రాల్లోపు పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భూమిపూజ చేయించి టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం.

-   శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌యంకు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాల కోనుగోలుకు టిటిడి జెఈవో ఆధ్వ‌ర్యంలో నిపుణుల క‌మిటీ ఏర్పాటు.

-   శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌యం ప్రారంభించి 100 రోజుల‌లో 100 అప‌రేష‌న్లు నిర్వ‌హించాం.

-   తిరుప‌తిలో గ‌రుడ వార‌ధి నిర్మాణం కోసం ఏడాదిలో ద‌శ‌ల వారీగా టిటిడి వాటా నుండి రూ.150 కోట్లు చెల్లించి, వ‌చ్చే ఏడాది డిసెంబ‌రు నాటికి శ్రీ‌నివాస సేతు ఫ్లైఓవ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యం.

-   రూ.2.73 కోట్ల‌తో స్విమ్స్‌కు కంప్యూట‌ర్లు కోనుగోలు చేసి పూర్తి స్థాయిలో కంప్యూట‌రీక‌ర‌ణ‌కు ఆమోదం.

-    టిటిడి ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లకు కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో న‌గ‌దు ర‌హిత వైద్యం అందించ‌డానికి రూ.25 కోట్లు నిధి ఏర్పాటు.

-     తిరుచానూరు స‌మీపంలోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యంను బాలాజి జిల్లా క‌లెక్ట‌రెట్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వానికి టిటిడి నిబంధ‌న‌ల మేర‌కు లీజుకు ఇచ్చేందుకు నిర్ణ‌యం.  

-    తిరుమ‌ల మాతృశ్రీ త‌రిగొండ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో స్టీమ్ ద్వారా అన్న‌ప్ర‌సాదాల త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. టిటిడి గ్యాస్‌, డిజిల్ ద్వారా కేజి స్టీమ్ త‌యారీకి 4 రూపాయ‌ల 71 పైస‌లు ఖ‌ర్చు చేస్తోంది. NEDCAP వారు సోలార్ సిస్ట‌మ్ RESCO మోడ‌ల్ స్టీమ్‌ను కేజి 2 రూపాయ‌ల 54 పైస‌లతో 25 సంవ‌త్స‌రాల పాటు స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ఒప్పందం. త‌ద్వారా టిటిడికి దాదాపు రూ.19 కోట్లు ఆదాయం చేకూరుతుంది.

-   తిరుమ‌ల‌లో రాబోవు రోజుల్లో హోట‌ళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంట‌ర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడ‌ళ్ళ‌లో ఉచితంగా అన్న‌ప్ర‌సాదాలు అందించాల‌ని నిర్ణ‌యం. అత్యున్న‌త స్థాయి నుండి సామాన్య భ‌క్తుడి వ‌ర‌కు ఒకే ర‌క‌మైన ఆహారం అందించాల‌ని తీర్మానం. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఇబ్బంది ప‌డే వ్యాపారుల‌కు ఇత‌ర వ్యాపారాలు చేసుకోవ‌డానికి లైసెన్స్‌లు మంజూరు చేయాల‌ని తీర్మానం.

-   తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద సైన్స్‌సిటి నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎక‌రాల భూమిలో 50 ఎక‌రాలు వెన‌క్కు తీసుకుని ఆధ్యాత్మిక న‌గ‌రం నిర్మించాల‌ని నిర్ణ‌యం.ఈ ప‌నుల‌కు త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రితో శంకుస్థాప‌న‌.

-    తిరుమ‌ల నాద‌నీరాజ‌న మండ‌పం షెడ్డు స్థానంలో శాశ్వ‌త మండ‌పం నిర్మించాల‌ని నిర్ణ‌యం.

-    అన్న‌మ‌య్య మార్గం త్వ‌ర‌లో భ‌క్తుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి ఇప్పుడు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేయాల‌ని తీర్మానం. అట‌వీ శాఖ అనుమ‌తులు ల‌భించిన త‌రువాత పూర్తి స్థాయిలో అబివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని తీర్మానం.

-    రూ.3.60 కోట్ల‌తో టిటిడి ఆయుర్వేద ఫార్మ‌శీకి ప‌రిక‌రాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాల‌ని తీర్మానం.

-    శ్రీ‌వారి ఆల‌య మ‌హ‌ద్వారం, బంగారువాకిలి, గోపురంకు బంగారు తాప‌డం చేయించాల‌ని నిర్ణ‌యం.
గోపురాల బంగారు తాప‌డం విష‌యంపై ఆగ‌మ పండితుల‌తో చ‌ర్చించి క్రేన్ స‌హ‌యంతో తాప‌డం ప‌నులు పూర్తి చేయించే సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు ఆదేశం.

-    ముంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమి కేటాయింపు కోసం నెలాఖ‌రులోపు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిని క‌ల‌వాల‌ని నిర్ణ‌యం. ఈ  మేర‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ మిలింద్ న‌ర్వేక‌ర్‌కు స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లు అప్ప‌గింత‌. అలాగే ఇప్ప‌టికే కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుని స‌మాచార కేంద్రం నిర్మించాల‌ని తీర్మానం.

-    సామాన్య భ‌క్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధ‌ర‌లు పెంచిన‌ట్లు మీడియాలో జ‌రిగిన ప్ర‌చారం ఆవాస్త‌వం.

       ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సమావేశంలో ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి వాణి మోహ‌న్‌, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరిజవహర్ లాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ పోక‌ల ఆశోక్ కుమార్‌, శ్రీ స‌న‌త్‌కుమార్‌, శ్రీ మారుతీ ప్ర‌సాద్‌, శ్రీ కాట‌సాని రాం భూపాల్ రెడ్డి, శ్రీ మ‌ధుసూధ‌న్ యాద‌వ్‌, శ్రీ సంజీవ‌య్య‌, శ్రీ విశ్వనాథ్,  శ్రీ రాములు, శ్రీ విద్యాసాగర్, శ్రీమ‌తి మల్లీశ్వరి, శ్రీ శివకుమార్, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, చెన్నైస్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శ్రీ శేఖ‌ర్ రెడ్డి,  జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఉన్నారు.

        అనంత‌రం జ‌రిగిన ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వ‌హ‌క మండ‌లి స‌మావేశంలో శ్రీ‌నివాస వ్ర‌త విధానం పుస్త‌కాలు ముద్రించి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  

Back to Top