ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్‌ డే

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎలీజా

అమ‌రావ‌తి: బీసీ వర్గానికి చెందిన సభాపతిపై టీడీపీ ఎమ్మెల్యేలు సభలో దాడి చేశారు. ఆయనపై చేయి చేసుకున్నార‌ని, ప్ర‌జాస్వామ్యంలో ఇవాళ బ్లాక్ డే అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు.  స్పీక‌ర్‌, ద‌ళిత ఎమ్మెల్యేపై దాడికి పాల్ప‌డిన టీడీపీ శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండు చేశారు.  శాసనసభలో స్పీకర్ పై టీడీపీ సభ్యుల దౌర్జన్యం,  అడ్డుకున్నందుకు ప్ర‌య‌త్నించిన వైయ‌స్ఆర్‌సీపీ దళిత ఎమ్మెల్యేలపై దాడి నేపథ్యంలో ప‌లువురు ఎమ్మెల్యేలు మీడియాతో  మాట్లాడారు. 

ఎలీజా ఏమ‌న్నారంటే..
- సభను సజావుగా సాగనివ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు. హక్కులు ఉన్నాయని చెప్పటమే తప్ప వారు సరైన ప్రజాస్వామ్య పద్ధతిలో సభా సాంప్రదాయాలను అనుసరించటం లేదు. 
చంద్రబాబు డైరెక్షన్‌ ప్రకారం ఏదో విధంగా సభలో అల్లరి చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. 
అసెంబ్లీలో ఇవాళ టీడీపీ సభ్యుల తీరు మితిమీరిపోయింది. స్పీకర్‌ గారి మీదకి దాడి చేయటానికి ప్రయత్నించి, టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి, ఆయన్ను చేతితో పొడవటం, దౌర్జన్యం చేసి స్పీకర్ ను అమానించడం జరిగింది. దాన్ని చూసి నేను స్పీకర్ పోడియం వద్దకు వెళితే.. టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, నా చేతిని పట్టుకుని నన్ను కూడా తోసేయటం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కిందకు లాగటం జరిగింది. సుధాకర్‌ బాబు మీదకి కూడా టీడీపీ సభ్యుడు దాడి చేయటం జరిగింది. స్పీకర్‌ గారిని కాపాడటం కోసం మేం వెళ్లాం. శాసనసభకు సభాపతిగా ఉన్న బీసీ నాయకుడిని ఈ రకంగా  అవమానించటం, మర్యాద ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. సభలో ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడటాన్ని ఖండిస్తున్నాం. మా పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌ మీద దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ ఎమ్మెల్యే ఎలీజా డిమాండు చేశారు.

Back to Top