ఏపీలో శాంతిభద్రతల త‌క్ష‌ణం పున‌రుద్ధ‌రించండి 

తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి డిమాండ్‌

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను త‌క్ష‌ణం పున‌రుద్ధరించేలా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ‌, అలాగే పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల‌ని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. లోక్‌స‌భ‌లో సోమ‌వారం ప్ర‌త్యేక అధికర‌ణ 377 కింద తిరుప‌తి ఎంపీ ఈ విష‌యాన్ని లేవ‌నెత్తారు. ఎంపీ మాట్లాడుతూ.. త‌మ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భ‌ద్ర‌త అత్యంత ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు. జెడ్ సెక్యూరిటీ భ‌ద్ర‌త‌కు అర్హులైన‌ప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌గిన ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని స‌భ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు జెడ్ సెక్యూరిటీకి బ‌దులు 4+4 సెక్యూరిటీ   మాత్రమే కేటాయించార‌ని ఆయ‌న అన్నారు.

 2019, 2024లో త‌మ నాయ‌కుడు జ‌గ‌న్‌పై దాడులు జరిగిన విష‌యాన్ని ఎంపీ ప్ర‌స్తావించారు. ఇప్ప‌టికైనా వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌గిన భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఏపీ ప్ర‌భుత్వానికి త‌గిన ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

అలాగే వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీల‌ను చ‌ట్టాన్ని అమ‌లు చేసే సంస్థ‌లు అడ్డుకుంటున్నాయ‌ని గురుమూర్తి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మ ఎంపీలు, మాజీ ఎంపీల‌పై అన్యాయంగా కేసులు న‌మోదు చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.  త‌మ ఎంపీలు, మాజీ ఎంపీల‌పై దాడులు ప్ర‌జాస్వామ్యంపై దాడిని సూచిస్తున్నాయ‌ని ఎంపీ తెలిపారు.  

ఏపీలో త‌క్ష‌ణం శాంతిభ‌ద్ర‌త‌ల‌ను పున‌రుద్ధరించాల‌ని, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన పాల‌న‌ను నెల‌కొల్పాల‌ని ఆయ‌న కోరారు. అలాగే పౌరులంద‌రి భ‌ద్ర‌త‌ను కాపాడాల‌న్నారు. విభిన్న‌ రాజ‌కీయ విశ్వాసాల‌ను క‌లిగిన నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడుల్ని అరిక‌ట్టాల‌న్నారు. ఈ మేర‌కు హోం, పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌లు చ‌ట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హృదయపూర్వకంగా డాక్ట‌ర్ గురుమూర్తి అభ్య‌ర్థించారు.

Back to Top