ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ నేతల సంతాపం

 హైద‌రాబాద్‌: ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు నేతలు గౌతమ్‌రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త‌న ప్రియ మిత్రుడు మేక‌పాటి గౌతం రెడ్డి ఇక లేర‌న్న వార్త‌ దిగ్భ్రాంతికి గురిచేసిందని ష‌ర్మిల అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ష‌ర్మిల‌ ట్వీట్ చేశారు.

గౌతమ్‌రెడ్డి చనిపోయారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయ‌న‌ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌న్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కేటీఆర్ సానుభూతి తెలిపారు.

గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత మరణం కలచివేసిందని ఆయ‌న ట్వీట్ చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గౌతమ్‌రెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మేకపాటి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.  

మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమని.. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top