తాడేపల్లి: ఫార్మాస్యూటికల్స్ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో సన్‌ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ముఖ్యమంత్రితో చర్చించారు. పారిశ్రామిక ప్రగతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వారికి వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా నాణ్యమైన మానవనరులను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలనూ సీఎం వారికి వెల్లడించారు. సీఎం విజన్‌కు ముగ్దుడనయ్యాను.. : దిలీప్ షాంఘ్వీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని దిలీప్ షాంఘ్వీ అన్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్లమీద ఆయనకున్న అవగాహనకు తాను ముగ్దుడినయ్యాను అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది సీఎం విధానంగా స్పష్టమవుతోందన్నారు. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారన్నారు. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవనవరులను తయారు చేయడంద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ఆయన ముందడుగు వేస్తున్నారన్నారు. తమ కంపెనీ తరఫున తాము కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తామన్నారు. సన్ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పుతామన్నారు. తద్వారా మా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామని, కొత్త పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటు చేయడానికి అధికారులతో తమ సంప్రదింపులు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. పరిశ్రమలకు చక్కటి సహకారం, మద్దతును సీఎం ఇస్తామన్నారన్నారు. ఔషధ రంగంలో తమ ఆలోచనలను సీఎంతో పంచుకున్నామని, ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్‌పై మాట్లాడుకున్నామని, ఇక్కడ నుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది లక్ష్యాల్లో భాగమని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో సన్‌ఫార్మా కంపెనీ ప్రతినిధులు విజయ్ పారెఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ పాల్గొన్నారు.