తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేయడంలో భాగంగా అక్టోబరు 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు యుకె , యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అన్నమయ్య భవన్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు . ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దగ్గర చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి టీటీడీని ఆదేశించారన్నారు . ఈ మేరకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే శ్రీనివాస కల్యాణాలు, వైభవోత్సవాలు నిర్వహించామని తెలిపారు . ఈ ఏడాది జూన్, జులై లో అక్కడి తెలుగు సంఘాలు , ఏపీఎన్ఆర్ఐటీఎస్ సహకారంతో అమెరికా లోని 9 నగరాల్లో స్వామి వారి కల్యాణాలు నిర్వహించామన్నారు. యుకె , యూరప్ తెలుగు సంఘాల సహకారంతో అక్కడి భక్తుల కోరిక మేరకు స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించబోతున్నామని చైర్మన్ తెలిపారు.
అక్టోబరు 15న యుకె లోని బాసింగ్ స్టేక్ , 16న మాంచెస్టర్, 22న నార్తన్ ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్ , 23వ తేదీ ఐర్లాండ్ లోని డబ్లిన్ లో కల్యాణాలు జరుగుతాయన్నారు . అక్టోబరు 29న ఈయూ లోని జురిచ్ స్విట్జర్లాండ్ , 30వ తేదీ నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ , నవంబరు 5న జెర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ , 6న పారిస్ ఫ్రాన్స్ , 12న లండన్ 13న స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో స్వామివారి కల్యాణాలు నిర్వహించనున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు . పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ సభ్యులు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వెంకట్ మేడపాటి తదితరులు పాల్గొన్నారు.