తాడేపల్లి: ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక, డీబీటీ పద్ధతిలో అవినీతికి ఆస్కారం లేకుండా నగదును లబ్దిదారులకు అందేలా చూశామని వెల్లడించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశారు సీఎం వైయస్ జగన్ అని ప్రశంసలు కురిపించారు.. గెలుపు పై పూర్తి ధీమాతో ఉన్నాం.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తాం.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది. 2019 జులై 29వ తేదీన టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మద్దతిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలోనే టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చింది? అని నిలదీసిన విషయం తెలిసిందే.. యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?. ఇదంతా వైయస్ఆర్ సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని చంద్రబాబు కుట్ర. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా చివరకు విజయం మాత్రం వైయస్ఆర్‌సీపీదే అని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.