తాడేపల్లి: పొత్తులపై వైయస్ఆర్‌సీపీకి స్పష్టమైన విధానం ఉందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తుంటే రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడటం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. అవసరం అయితే పొత్తులు పెట్టుకోవడం, అవసరం తీరాక దూషణలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు. సచివాలయ ప్రాంగణంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాయన్నారు. ఆ తర్వాత మిత్రపక్షంపైనే ఆరోపణలు చేసి బయటకు వచి్చన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు చేస్తున్నది మోసమని అన్నారు. పొత్తులపై వైయస్ఆర్‌సీపీకి స్పష్టమైన విధానం ఉందన్నారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. పొత్తుల వెనుక రహస్యం.. చంద్రబాబు పొత్తుల కోసం వెళ్లారా? కేసుల విషయంలో ఎక్కడ ఇరుక్కుంటాననే భయంతో వెళ్లారా? ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయో తెలీదు. పొత్తులపై వైయస్ఆర్‌సీపీకి మొదటి నుంచి క్లారిటీ ఉంది. స్పష్టమైన విధానం ఉంది. ప్రజలకు పార్టీ అజెండా స్పష్టంగా తెలియజేయాలి. అప్పుడే ప్రజలు ఏ పార్టీ బాగుంటుంది, ఏ కూటమి బాగుంటుంది అనేది నిర్ణయించుకుంటారు. పొత్తులనేవి ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలి, అధికారం ఎలా చేతుల్లోకి తీసుకోవాలి అనేది ఉన్నంత వరకే ఉంటాయి. ప్రజలు మోసపోతారు. ఇందులో అత్యంత సిద్ధహస్తుడు, రికార్డులు బ్రేక్ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రి కావటానికి ఎంతమందినైనా లోబరుచుకొని, వారి దగ్గర రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తారు. దివంగత ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి తప్పించి పార్టీని చేతుల్లోకి తీసుకొన్నప్పటి నుంచి బాబు ప్రతి ఎన్నికల్లో ఇలాగే చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కొక్కటి చేస్తారు. దీనికి ఆయన నిర్వచనం ఎత్తులు, వ్యూహం అంటారు. ఇవి ప్రజాస్వామ్యానికి అవసరమని చెబుతాడు. నిజంగా ఈ విధానం రోగ లక్షణం. జనసేన అనేది బాబు కంట్రోల్‌లో నడుస్తుంది. 2019 ఎన్నికల్లో వ్యతిరేక ఓటు చీలాలనుకున్నారు కాబట్టి పక్కకు తప్పించారు. బీజేపీతో ఉండి వద్దనుకున్నాక నాలుగు విమర్శలు చేసి బాబు బయటకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు బాబు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎందుకు భయం? ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదని బాబు భావిస్తున్నప్పుడు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అనుకోవటం దేనికి? ఇద్దరు కలిస్తే 50 శాతం ఓట్లు ఉన్నట్లే కదా? ఇది సరిపోతుంది కాదా? వారు అనుకొన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు బదిలీ కాదు. కానీ, వైయస్ఆర్‌సీపీకి 80 శాతం ప్రజా మద్దతు ఉంది. వీరంతా కట్టకట్టుకొని వచ్చినా సీఎం వైయస్ జగన్‌కి సీట్లు పెరుగుతాయి. ఓటింగ్ పర్సంటేజీ పెరుగుతుంది. సీఎం వైయస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. రాష్ట్రం, కేంద్రం మధ్య ఉన్నవి సుహృద్భావ సంబంధాలే ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఉండాల్సిన సుహృద్భావ సంబంధాలు మాత్రమే ఉన్నాయి. బీజేపీకి, వైయస్ఆర్‌సీపీకి సంబంధం లేదు. సీఎం వైయస్ జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరేవీ లేవు. ప్రజలను తాకట్టుపెట్టి మరేదో సంపాదించాలని అనుకోరు. వైయస్ఆర్‌సీపీ గురించి కేంద్రానికి క్లారిటీ ఉంది. అందుకే కేంద్రంలో ఎవరు ఉన్నా సీఎం వైయస్ జగన్‌ను గౌరవిస్తారు. బాబు చివరికి వచ్చారు. బాబు అనుకున్న రీతిలో లోకేశ్ ఎదగలేదు. లోకేశ్‌ను ముందుకు తీసుకు వచ్చేందుకు ఇది ఆఖరి అవకాశం కాబట్టే బాబు ఇన్ని కుయుక్తులు పన్నుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.