మా ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని ఒప్పుకొని సిగ్గుప‌డు చంద్ర‌బాబూ..

14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేశాడా..?

స్వార్థపూరిత అంశాలపై పెట్టిన శ్రద్ధ శ్రీకాకుళం మీద ఒక్క శాతమైనా పెట్టాడా..?

14 ఏళ్లలో ఉద్దానం సమస్య పరిష్కారం గురించి ఏనాడైనా ఆలోచన చేశాడా..?

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 23 సంస్థల్లో ఒక్కటైనా శ్రీకాకుళంలో నెలకొల్పాడా..?

నేరేడు బ్యారేజీ సమస్యపై ఏనాడైనా ఒడిశా సీఎంతో సంప్రదింపులు జరిపాడా..?

బ్యాక్‌వర్డ్‌ క్లాసులను వాడుకోవడం తప్ప.. పరిపాలనలో ప్రాధాన్యత ఇచ్చాడా..?

ఎన్నికల ముందు బహుదా, వంశధార అనుసంధానం పేరుతో రూ.6 వేల కోట్ల దోపిడీకి స్కెచ్‌ వేశాడు 

మా ప్రభుత్వంపై ఆరోపణలు, నిందలు వేసే అర్హత, అవకాశం చంద్రబాబుకు లేదు 

రూ.700 కోట్లతో ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపుతున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

డిసెంబర్‌లో వంశధార ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జాతికి అంకితమిస్తారు

రూ.4 వేల కోట్లతో మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి

టెక్కలి ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పూర్తికి దాదాపు రూ.800 కోట్లు మంజూరు ఇచ్చాం

బుడగట్లపాలెం వద్ద రూ.400 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తున్నాం..

ఇది కాదా అభివృద్ధి అంటే.. బాబు దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటీ..?

చంద్రబాబు వ్యాఖ్యలపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైర్‌

శ్రీకాకుళం: ‘‘14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క ప్రాజెక్టు పూర్తిచేశానని చెప్పగలడా..? ఈ జిల్లాలో అతి ముఖ్యమైన ప్రాజెక్టు వంశధారను ఏనాడైనా చంద్రబాబు పట్టించుకున్నాడా..? స్వార్థపూరిత అంశాలపై ఉన్న శ్రద్ధలో ఒక్క శాతం శ్రీకాకుళం ప్రాంతంలోని ప్రాజెక్టు పట్ల పెట్టాడా..? దయచేసి విధ్వంసం అనే మాటను ఉపసంహరించుకొని, శ్రీకాకుళం ప్రాంతానికి ఏమీ చేయలేకపోయానని ఒప్పుకొని చంద్రబాబు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది’’ అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వంశధార ప్రాజెక్టును డిసెంబర్‌లోగా పూర్తిచేసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేయబోతున్నారని చెప్పారు. 

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇన్నేళ్లలో రూ.4 వేల కోట్ల అతిపెద్ద పెట్టుబడితో శ్రీకాకుళం ప్రాంతంలో పోర్టు నిర్మిస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే సొంతమన్నారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి రూ.700 కోట్లు ఖర్చు చేసి హీరమండలం నుంచి పైపులైన్‌ ద్వారా శుద్ధ జలాలను రప్పిస్తున్నారు ఇదీ వైయస్‌ జగన్‌ ఘనతే.. చంద్రబాబు నాయుడు ఏనాడైనా శ్రీకాకుళం ప్రాంతం గురించి, ఉద్దానం సమస్య పరిష్కారం గురించి ఆలోచన చేశాడా..? ఏ అర్హత ఉందని శ్రీకాకుళం గురించి మాట్లాడుతున్నాడని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు 63 శాతం పనులు పూర్తయ్యాయి. 14 సంవత్సరాల కాలంలో చంద్రబాబు కేవలం 22 శాతం పనులు మాత్రమే చేశాడు. అలాంటి వ్యక్తి ఈ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నాడు. వంశధార ప్రాజెక్టు రిజర్వాయర్‌లో 19 టీఎంసీ నింపడానికి అవసరమైన నేరేడు వద్ద కట్టాల్సిన బ్యారేజీకి ఒడిశాతో వివాదం ఉందని సీఎం వైయస్‌ జగన్‌ స్వయంగా ఒడిశా సీఎం వద్దకు వెళ్లి సంప్రదింపులు జరిపారు. తరువాత ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరో పిటీషన్‌ వేస్తే.. సమస్య పరిష్కారానికి సమయం పడుతుందేమోనని రూ.2 వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి గొట్టా బ్యారేజీ వద్దే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేసి సుమారు రూ.170 కోట్లను కేటాయించి టెండర్లు పిలిచి, పనులు ఖరారు చేసి మరో 3–4 నెలల్లో అది పూర్తిచేసి గొట్టా బ్యారేజీ నుంచే 19 టీఎంసీని లిఫ్ట్‌ చేసుకునేలా ఆలోచన చేసి పనులకు శ్రీకారం చుట్టిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. 

1955లో ప్రారంభమైన ప్రాజెక్టు ఒడిశాతో వివాదం ఉన్నందు వల్ల వదిలేస్తే.. 14 సంవత్సరాల్లో ఏనాడైనా ముఖ్యమంత్రిగా సంప్రదింపులకు వెళ్లాడా..? ట్రిబ్యునల్‌లో పరిష్కరించే చొరవ చూపాడా..? మా ప్రభుత్వంపై ఆరోపణలు, నిందలు వేసే అర్హత, అవకాశం చంద్రబాబుకు ఎక్కడుంది.

ఉద్దానం ప్రాంతం దేశంలోనే ప్రధానమైన సమస్యతో అట్టుడికిపోతోంది. గ్రౌండ్‌ వాటర్‌ తాగడం వల్లే కిడ్నీ వ్యాధులు వచ్చి చనిపోతున్నారని పరిశోధనలో తేలితే.. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నమే చంద్రబాబు చేయలేదు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్ఛాపురం, పలాస వెళ్లి సమావేశాలు పెట్టి వారి ఉపశమనం కోసం కొన్ని కార్యక్రమాలను ప్రకటించారు. ఉద్దానం ప్రాంతానికి రక్షిత మంచినీటిని అందించేందుకు హీరమండలం బ్యారేజీ నుంచి పైప్‌లైన్‌ ద్వారా ఉద్దానం ప్రాంతం మొత్తానికి తాగునీరు అందించేందుకు రూ.700 కోట్లతో పనులు చేపట్టారు. ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయి.. మరో కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నాం. 

ఒక ప్రభుత్వ కాలంలో, ఒక ప్రధానమైన సమస్యకి దశాబ్దాలుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఆలోచన కూడా చేయని పనిని.. ఒక టర్మ్‌లో అది కూడా 4 సంవత్సరాల్లోనే పూర్తి చేయడం అద్భుతం. శాశ్వతంగా కిడ్నీ సమస్యలు రాకుండా ఉండేలా శుద్ధ జలాలు, ఇప్పటికే వైద్యం చేయించుకుంటున్న వారు ఏ పనీ చేయలేరు కాబట్టి ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్‌ అందించడం, కిడ్నీ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూర్తిచేశాం.. ఆస్పత్రికి కూడా మరో నాలుగు నెలల్లో ప్రారంభించబోతున్నాం.. సీఎం వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత అవసరమైన డయాలసిస్‌ సెంటర్లు పెట్టి ఆదుకున్నారు. ఉద్దానం సమస్యపై ఈరోజు విమర్శించే ఒక్క వార్త కూడా లేదు. ఇది కదా నిజమైన ప్రభుత్వం. 

14 సంవత్సరాల్లో చంద్రబాబు ఇలా చేసిన ఒక్క సంఘటన అయినా ఉందా..? రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాంత ప్రజలు పడుతున్న సమస్యను గుర్తించి పరిష్కరించామని చంద్రబాబు చెప్పగలడా..? అలాంటి వ్యక్తి శ్రీకాకుళం వచ్చి ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉన్నట్టుగా చెబుతున్నాడు. 

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు 23 సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే.. 13 జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళంలో ఒక్క సంస్థ కూడా పెట్టని చంద్రబాబుకు ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉందా..? సమానంగా పంచినా 23 సంస్థల్లో జిల్లాకు రెండు రావాలి కదా..మరి శ్రీకాకుళంలో ఎందుకు స్థాపించలేదు. అలాంటి వ్యక్తి శ్రీకాకుళం మీద కపట ప్రేమ చూపిస్తున్నాడు. 

టెక్కలి ప్రాంతంలోని ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు మహానేత వైయస్‌ఆర్‌ మంజూరు ఇచ్చారు. చంద్రబాబు వచ్చిన తరువాత దాన్ని ఆపేశారు. ప్రస్తుతం మా ప్రభుత్వం భూసేకరణ కోసం, ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు చేయడం కోసం, ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం దాదాపు రూ.800 కోట్లు మంజూరు ఇచ్చింది. ఇప్పుడు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో 20 శాతం పనులు అప్పుడే పూర్తయ్యాయి. దీంట్లో చంద్రబాబు చేసిందేమీ లేదు. తోటపల్లి గురించి మాట్లాడుతున్నాడు.. 2004కు ముందు చంద్రబాబు కొబ్బరికాయ కొట్లాడు.. కానీ పైసా ఖర్చు చేయలేదు. 90 శాతం పనులు మహానేత వైయస్‌ఆర్‌ హయాంలోనే పూర్తయ్యాయి. 2014లో అధికారంలోకి వచ్చి 10 శాతం పనులు పూర్తి చేసి ఆ ప్రాజెక్టు నాదే అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. ఇలా ఆపాదించుకోవడం వల్ల ప్రయోజనం ఏంటో చంద్రబాబు చెప్పాలి. 

శ్రీకాకుళం ప్రాంతంలో రూ.4 వేల కోట్లతో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేస్తే అందరూ అవహేళన చేశారు. ఈరోజు విష్ణుచక్రం, మూలపేట గ్రామానికి వెళ్లి చూస్తే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో పెట్టుబడి పెట్టిన ప్రభుత్వం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం. పోర్టు నిర్మాణానికి మొదటి దశలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. బుడగట్లపాలెం వద్ద రూ.400 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తున్నాం. మంచినీళ్ల పేట వద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి లేదని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. బాబు ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఏంటీ..? బహుదా, వంశధార అనుసంధానం అని ఎన్నికల ముందు రూ.6 వేల కోట్లతో అంచనా వేశాడంట.. ఏ ఒక్క ఎకరం అయినా అదనంగా కలుస్తుందా..? కేవలం దోపిడీ కోసం రూ.6 వేల కోట్లతో చంద్రబాబు స్కెచ్‌ వేశాడు. అదృష్టవశాత్తు 2019లో ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీని ఎన్నుకున్నారు కాబట్టే చంద్రబాబు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. శ్రీకాకుళం ప్రాంతంపై చిత్తశుద్ధితో చంద్రబాబు పనిచేసిన ఒక్క సంఘటన కూడా లేదు.

బలహీనవర్గాలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చాడే తప్ప.. బలహీనవర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. మంత్రివర్గంలో ఏనాడైనా బ్యాక్‌వర్డ్‌ క్లాసులకు ప్రాధాన్యం ఇచ్చారా..? పరిపాలనలో ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా..? ఎలా బలహీనవర్గాలను ఆదుకున్నానని చెప్పలగవు చంద్రబాబూ..? రూ.150 కోట్లతో నాగావళి నది వద్ద బ్యూటిఫికేషన్‌ చేశానని చంద్రబాబు చెబుతున్నాడు.. అది ఎక్కడుందో ఎవరైనా చూపించగలరా..? దయచేసి చంద్రబాబు విధ్వంసం అనే మాటను ఉపసంహరించుకొని, శ్రీకాకుళం ప్రాంతానికి ఏదీ చేయలేదని ఒప్పుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 

Back to Top