తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. అధికార మదంతో వైయస్ఆర్‌సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు తలపెట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈ వేడుకలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వేధింపులకు గురి చేస్తోంది. సీఎం సతీమణి భువనేశ్వరి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కుప్పంలో వైయస్ఆర్‌సీపీ సేవా కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇవాళ విజయవాడ వారధిపై వైయస్ జగన్ ఫ్లెక్సీలు, వైయస్ఆర్‌సీపీ జెండాలను బలవంతంగా తొలగిస్తున్నారు. పార్టీ పిలుపుమేరకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ శివారులో వారధిపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలను మంగళగిరి-తాడేపల్లి పురపాలక సంఘ సిబ్బంది బలవంతంగా తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు మేరకు ఫ్లెక్సీలు, జెండాలు తొలగిస్తున్నామని పురపాలక సిబ్బంది చెబుతున్నారు. తొలగింపును వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ ఫ్లెక్సీలకు అనుమతులు ఉన్నాయా...? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కోటిరెడ్డి, నాగార్జున,యార సాయి ప్రశాంత్ ప్రశ్నించారు. తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలకు అనుమతులు లేవని సిబ్బంది సమాధానం చెప్పగా ఆ ఫ్లెక్సీలను తొలగించకుండా వైయస్ జగన్ ఫ్లెక్సీలు తొలగిస్తే సహించమని, అవసరమైతే పురపాలక కార్యాలయం ముందు ధర్నాకు కూర్చుంటామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి.