ప‌నులెన్ని..? ఖ‌ర్చులెంత‌..?

 అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ తాఖీదు

 ఐదేళ్లలో చేపట్టిన పనులు, వ్యయం వివరాలను పంపండి  

 తేదీలతో సహా జీవోల సమాచారమివ్వండి

 తొలుత అంచనా వ్యయమెంత?  

 తరువాత అంచనా వ్యయాలను ఎంతమేరకు పెంచేశారు?  

 పనులకు టెండర్లు పిలిచారా? లేదా?  

 టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారా?  

 మిగిలిన పనులు పూర్తి కావాలంటే ఇంకా ఎన్ని నిధులు కావాలి?  

 అన్ని వివరాలను తక్షణమే తెలియజేయండి   

 టీడీపీ సర్కారు చేసిన ఖర్చుల లెక్కలను తేల్చే పనిలో ఆర్థిక శాఖ

ముందస్తు సర్వేలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌) లేకుండానే కీలకమైన పనులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేయడం, అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఆయా పనులను అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, వారి నుంచి కమీషన్లు దండుకోవడం... ఐదేళ్లుగా జల వనరుల శాఖ నుంచి ఐటీ శాఖ దాకా.. అన్ని శాఖల్లోనూ ఇదే బాగోతం. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఐదేళ్లుగా జరిగిన దోపిడీ అంతా ఇంతా కాదు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయి, అతి త్వరలో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ లెక్కలన్నీ తేల్చేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ సన్నద్ధమైంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏయే పనులు మంజూరు చేశారు? వాటికి ఎంత వ్యయం చేశారు? తరువాత అంచనాల వ్యయాలను ఎంతకు పెంచేశారు? అనే వివరాలను తక్షణమే పంపాలంటూ అన్ని శాఖలకు ఆర్థిక శాఖ తాజాగా తాఖీదులు జారీ చేసింది. గతంలో మంజూరు చేసిన పనులకు ఎంత వ్యయం చేశారు? మిగిలిన పనులు పూర్తి చేయాలంటే ఎంకా ఎన్ని నిధులు అవసరమో తేల్చిచెప్పాలని కోరింది. ఈ మేరకు రెండు నమూనా పత్రాలను అన్ని శాఖలకు పంపించింది. 

టెండర్లు ఆహ్వానించారా? లేదా? 

ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పలు శాఖల్లో హడావుడిగా కొత్త పనులను మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలు కూడా ఇచ్చారు. ఆ జీవోల నెంబర్లను తేదీలతో సహా తెలియజేయాలని, ఎంత అంచనా వ్యయంతో ఆ పనులు మంజూరు చేశారో తెలపాలని ఆర్థిక శాఖ సూచించింది. ఎన్నికల ముందు మంజూరు చేసిన పనులకు టెండర్లను ఆహ్వానించారో లేదో పేర్కొనాలని, టెండర్లు ఆహ్వానిస్తే కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్నారో లేదో కూడా తెలియజేయాలని ఆర్థిక శాఖ వెల్లడించింది.  

పోలవరం ప్రాజెక్టు వివరాలివ్వండి 

ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను భారీగా పెంచేసింది. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనుల్లోనూ అంచనాల పెంపు బాగోతం కొనసాగింది. ఈ నేపథ్యంలో అసలు పోలవరాన్ని చేపట్టినప్పుడు ఆ ప్రాజెక్టుకు ఎంత అంచనా వ్యయంతో పరిపాలన అనుమతి మంజూరు చేశారు? ఏ నెంబర్‌ జీవోను ఏ తేదీన జారీ చేశారు? తరువాత అంచనా వ్యయాన్ని ఎంతమేరకు పెంచారు? అనే వివరాలను బయటపెట్టాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సాగునీటి ప్రాజెక్టులకు ఎంతమేర ఖర్చు చేశారు? మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరమో వివరించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 

‘ఉపాధి’ పనులు  ఎంతవరకొచ్చాయి? 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్‌ రోడ్లతోపాటు ముఖ్యమంత్రి విచక్షణాధికార నిధులతో చేపట్టిన పనుల మంజూరు వ్యయం ఎంత? తరువాత అంచనా వ్యయాలను ఎంతమేరకు పెంచారు? ఎంత వరకు పనులు చేశారు? అనే వివరాలను పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ఐటీ పేరుతో పలు ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులు ఎప్పుడు మంజూరు చేశారు? ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? పెంచిన అంచనా వ్యయాల సంగతేంటి? ఎన్ని నిధులు ఖర్చు చేశారు? అనే సమాచారాన్ని తెలపాలని సూచించింది. అన్ని శాఖల్లో చేపట్టిన పనుల వివరాలను జీవోలు, తేదీలతో సహా తక్షణమే పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడానికి 10 రోజుల ముందు ఈ వివరాలను కోరడం గమనార్హం.    

Back to Top