చంద్రబాబు వల్లే ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది

నీ కొడుకు నాయకత్వంపై అభిప్రాయ సేకరణ చేపట్టు బాబూ

సీఎం వైయస్‌ జగన్‌ పాలన మెచ్చి, నాయకత్వం నచ్చి వైయస్‌ఆర్‌ సీపీలో చేరాను

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని నమ్మి, పరిపాలనను మెచ్చి అనుచరులతో కలిసి  వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమక్షంలో రమేష్‌బాబు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. అనంతరం క్యాంపు ఆఫీస్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

‘మార్చి 10వ తేదీ ఐదు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను. ఆరోజే చెప్పాను ఉత్తరాంధ్ర వెనుకబడిందని మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు అది చేతల్లో చూపించాలి కానీ, మాటల్లో కాదు అని. 

ఒకే ప్రాంతం కాదు.. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలనే మంచి సంకల్పంతో ఉత్తరాంధ్రను పరిపాలన రాజధానిగా చేస్తానని సీఎం నిర్ణయం తీసుకుంటే దాన్ని విమర్శించి ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలి.. చంద్రబాబు తన రియలెస్టేట్‌ వ్యాపారం బ్రహ్మాండంగా జరగాలని, ఆయన మనుషులు.. ఆయన వర్గమే అభివృద్ధి చెందాలని చూస్తున్నాడు. 

ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మూడు రాజధానులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయమని, ఉత్తరాంధ్ర పరిపాలన రాజధానిగా వద్దని మాకు రోజూ చంద్రబాబు తాలూకా మనుషుల నుంచి మెసేజ్‌లు వచ్చేవి.

ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల మన్ననలు పొంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. లోకేష్, చంద్రబాబు చేసిన కార్యక్రమాలతో మూడోసారి మాకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు ఓడించినప్పటికీ బుద్ధి రాకుండా మాతో తప్పులు చేయించాలని అనుకున్నాడు.. ఇంకా ఆ పార్టీలో ఉండలేక రాజీనామా చేసి బయటకు వచ్చాను. 

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను వైయస్‌ఆర్‌ సీపీకి ఇచ్చారు. అది ఒక చరిత్ర. సీఎం వైయస్‌ జగన్‌ నవరత్నాలు చెప్పినట్లుగా అమలు చేసుకుంటూ పోతున్నారు. చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని నమ్మి, మెచ్చి పార్టీలో చేరాను. సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.60 వేల కోట్లు సంవత్సరకాలంలో ఖర్చు చేశారు. 

చంద్రబాబు చేసే కార్యక్రమాల వల్లే తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అవుతుంది. ఎంత మంది నీతో ఉన్నారనేది చంద్రబాబే గుర్తుచేసుకోవాలి. నీ కొడుకు లోకేష్‌ నాయకత్వంలో పనిచేయడానికి అభిప్రాయ సేకరణ పెడితే పది శాతం కూడా ఎవరూ ముందుకురారు’ అని పంచకర్ల రమేష్‌బాబు అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top