అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 

 

 

ఒంగోలు: స్థానిక గద్దలగుంట పారువేట కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు గద్దలగుంట పారువేటకు వచ్చారు. గద్దలగుంట ముఖ ద్వారంలో  డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవరావు నేతృత్వంలో ఏర్పాటైన పాటకచ్చేరికి బాలినేని, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గద్దలగుంటలోని నాగార్పమ్మతల్లి, అంకమ్మ తల్లి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, శ్రీకోదండ రామస్వామి ఆలయం, అంకమ్మ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా కోదండ రామస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన పాటకచ్చేరి కార్యక్రమానికి బాలినేని, మాగుంట ఇరువురు హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సంయుక్తంగా వాల్తేరు వీరయ్య సినిమా కేక్‌ను కట్‌ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి వేగం అవుతుందన్నారు. చిరంజీవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, ఆయన సినిమాలు సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నామన్నారు. 


ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో తమ కుటుంబానికి మంచి బంధం ఉందని అన్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీరయ్యగా చిరంజీవి అభిమానులు పేర్కొంటుండడం మరింత ఆనందంగా ఉందన్నారు. అనంతరం అక్కడ నుంచి గాంధీబొమ్మ సెంటర్‌లో 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ తాడి కృష్ణలత ఏర్పాటు చేసిన పాటకచ్చేరిలో ఇరువురు పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని, మాగుంటను వైఎస్సార్‌ సీపీ నాయకులు ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, కార్పొరేటర్‌ తాడి కృష్ణలత సత్కరించారు. రాజరాజేశ్వరస్వామి అమ్మవారు, గద్దలగుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇరువురు గద్దలగుంట నెహ్రూబొమ్మ సెంటర్‌లోని పాట కచ్చేరిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. 


మీ వాడిని.. ఎప్పుడూ అందుబాటులో ఉంటా

‘‘నేను మీ వాడిని... మీతో కలిసి పెరిగిన వాడ్ని..తిరిగిన వాడ్ని... నా బాల్యం అంతా గద్దలగుంటలోనే గడిచింది. ఇక్కడి ప్రజల ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. 

ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... గద్దలగుంటతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. ఇప్పటికే గద్దలగుంటలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని, మరో వారం రోజుల్లో రూ.10 లక్షలతో మహిళా భవన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 

32వ డివిజన్‌ కార్పొరేటర్‌ తాడి కృష్ణలత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో గద్దలగుంటలో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డిని కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు. బహుమతి ప్రధానోత్సవ సభకు కమిటి అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు సభా నిర్వాహకులుగా వ్యవహరించారు.  

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ, డాక్టర్‌ కొల్లా నాగేశ్వరరావు, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్‌బాబు, కాపు కళ్యాణ మండపం చైర్మన్‌ టీవి రంగారావు, విద్యుత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివరావు, కమిటీ సభ్యులు ఈదుపల్లి అంకబాబు, కాటా నాగేశ్వరరావు, ఈదుపల్లి కోటేశ్వరరావు, చిట్టెం వెంకటేశ్వర్లు, తోటకూర చైతన్య, మలిశెట్టి రాజేంద్రప్రసాద్, దండే వెంకటేశ్వర్లు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. 

Back to Top