స్వదేశానికి సురక్షితంగా ఏపీ విద్యార్థులు

సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న అధికారులు

అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. యుద్ధభూమి నుంచి భారత గడ్డపై సురక్షితంగా అడుగుపెట్టిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. ఉక్రెయిన్‌ నుంచి రెండు విమానాల్లో ఇప్పటి వరకు 21 మంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. నిన్న రాత్రి ముంబై చేరుకున్న విమానంలో 10 మంది, ఉక్రెయిన్‌నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో 11 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుచేశారు. ఈ హెల్ప్‌డెస్క్‌ సభ్యులు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నామని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో విద్యార్థులు వారి సొంత ప్రాంతాలకు చేరుకోనున్నారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ..
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాయడంతో పాటు ఫోన్‌లోనూ మాట్లాడారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తోందని, విద్యార్థుల‌ను క్షేమంగా తీసుకురావాల‌ని కోరారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ నుంచి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో విద్యార్థుల కోసం టాస్క్‌ఫోర్స్‌తో పాటు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తూ వారి యోగ‌క్షేమాల‌ను తెలుసుకున్నారు. 

Back to Top