బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని విస్మరించారు

కేంద్ర బడ్జెట్‌లో వ్య‌వ‌సాయానికి 4.25 శాతం మాత్రమే కేటాయింపులు

వైయస్‌ఆర్‌సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

విజయవాడ:  కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ విస్మరించారని వైయస్‌ఆర్‌సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. 2020–2021లో మొత్తం బడ్జెట్‌ రూ.30,42,230 కోట్లలో వ్యవసాయ రంగానికి రూ.1,54,775 కోట్లు అంటే బడ్జెట్‌లో 5.08 శాతం అయితే..2020–2021లో ఖర్చు పెట్టేది రూ.1,45,355 కోట్లు మాత్రమే అన్నారు. అంటే మొత్తం ఖర్చులో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో 4.21 శాతమే అన్నారు.  వ్యవసాయ రంగానికి  బడ్జెట్‌ మొత్తం ఖర్చు కేటాయింపు కంటే రూ.9,420 కోట్లు తక్కువ ఇచ్చారన్నారు. 2021–2022లో మొత్తం బడ్జెట్‌ రూ.34,83,236 కోట్లు కాగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు రూ.1,48,301 కోట్లు అంటే మొత్తం బడ్జెట్‌లో 4.25 శాతం మాత్రమే అన్నారు. గతేడాది కంటే ఈసారి రూ.6,474 కోట్లు తగ్గిందన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి 2020–2021లో రూ.75 వేల కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.65 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, రూ.10 వేల కోట్లు ఈ ఏడాది తగ్గిందన్నారు.

ఎరువుల సబ్సిడీ గతంలో కంటే రూ.2,742 కోట్లు తగ్గిందని, స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ రూ.1,707 కోట్ల తగ్గిందన్నారు. ఏపీలో 8 ఫిషింగ్‌ హార్బర్స్‌ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొదలుపెడితే కేవలం విశాఖ హార్బర్‌ ఒక్కటే బడ్జెట్‌లో ప్రకటించారని చెప్పారు. డీజిల్‌ అయిల్‌పై వేసిన వ్యవసాయ సెస్‌ ప్రధానంగా రైతులపైనే ప్రభావం చూపుతుందన్నారు.  మొత్తం బడ్జెట్‌ పెరిగితే వ్యవసాయ కేటాయింపులు ఈ ఏడాది 4.25 శాతం తగ్గడం చాలా బాధాకరమన్నారు. బడ్జెట్‌లో ఎక్కడా కూడా ఏపీపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవన్నారు. మొత్తం బడ్జెట్‌ రూ.34,83,,236 కోట్లు 23.24 శాతం రుణాలపై వడ్డీల చెల్లింపులకే ఖర్చు అవుతుందని..ఇదే అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై దృష్టి తప్ప వ్యవసాయంపై ఏమాత్రం కేంద్రం దృష్టి పెట్టలేదని ఎంవీఎస్‌ నాగిరెడ్డి విశ్లేషించారు.
 

Back to Top