తిరుపతి: అవినీతి చంద్రబాబు కోసం కంచాల మోతనా? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. తిరుపతి మీడియా సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మాట్లాడారు.
ఎవరి కోసం మోత కార్యక్రమం?:
టీడీపీ వారు ఏదో కంచాల మోత మోగించారు. నేను మూడు ప్రశ్నలు సంధిస్తున్నాను.
1. లంచాలు తీసుకుని కంచాలు కొడతారా?
2. బకాసురుడి బావమరిదిలు శ్రీకృష్ణుడి వేషం వేస్తారా?
3. అవినీతికి పాల్పడి సిగ్గు పడాల్సిన వారంతా సింగారం చేసుకుని బయటకు వచ్చి కంచాలు మోగిస్తారా?
ఇది టీడీపీ నాయకత్వం, కార్యకర్తలు తెలుసుకోవాలి. 2014 నుంచి 2019 వరకు, 5 ఏళ్లపాటు మోగించిన అవినీతి ఏదైతే ఉందో.. ఆ అవినీతి మోత వల్లనే చంద్రబాబుగారి ఇంట్లో ఈగల మోత.. జైల్లో దోమల మోత అన్నట్లుగా ఉంది. అందుకే ఆయన ఈరోజు ఈ పరిస్థితికి దిగజారాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అరెస్టు చేసింది సీఐడీ. ఇది నిర్వివాదాంశం. ఆ కేసును, అరెస్టును, రిమాండ్‌ను క్వాష్ చేయడానికి సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, వారికి రిలీఫ్ దొరకలేదు. అన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టే, చంద్రబాబుగారు ఈరోజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇది ఆయన తెలుసుకోవాలి.
కంచాలు ఎవరి కోసం మోగించారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమా? రాష్ట్రం కోసమా? దేశం కోసమా? విజిళ్లు ఊదారు. హారన్లు మోగించారు. ఎవరి కోసం అవన్నీ..
వాటన్నింటి కోసమా ఈ కార్యక్రమం?:
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు చేసిన పని ఏమిటి?
నిరుద్యోగుల కంచాల్లో అన్నం పెట్టి, బడుగు, బలహీనవర్గాలకు చెందాల్సిన డబ్బును తినేసి, దోచుకుని, అలా అడ్డంగా తిన్నదానికి గుర్తుగా.. జన్మభూమి కమిటీలు మొదలు రా«జధాని కుంభకోణాల వరకు ప్రతి విషయంలో కూడా 5 ఏళ్ల పాటు అడ్డంగా తినేసిన బకాసురలంతా కూడా కంచాలు మోగిస్తారా?
జగన్‌గారి ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలో నిరుపేదలకు దాదాపు రూ. 2.35 లక్షల కోట్లు వివిధ సంక్షేమ పథకాల కింద అందిస్తే.. చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో నిరుపేదలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా.. కేంద్రం నిధులు కానీ, రాష్ట్ర నిధులు కానీ ఉఫ్‌మని ఊదేసినందుకు గుర్తుగా.. ఈ కార్యక్రమం చేశారా?
అవినీతి చేసి బస్సులో పడుకున్నాను అని డ్రామాలు అడినందుకు గుర్తుగా కంచాలు మోగించారా?
ఏ మొహం పెట్టుకుని..:
ఏ మొహం పెట్టుకుని అవినీతికి పాల్పడి, చట్టబద్దంగా అరెస్టు అయిన ఒక వ్యక్తి న్యాయస్థానాన్ని, చట్టాన్ని ఎలా అపహాస్యం చేస్తారు?
అవినీతి అక్రమం. అరెస్టు సక్రమం. అలాంటప్పుడు అవినీతి సక్రమం. అరెస్టు అక్రమం అంటున్న టీడీపీ వాళ్లను ఏమనాలి?
నిజంగా మీకు చట్టం అంటే గౌరవం ఉందా? రాజ్యాంగం మీద కానీ, చట్టం మీద కానీ నమ్మకం లేనటువంటి సంఘవిద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారంటే.. వారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే.
చంద్రబాబు అవినీతికి, ఆయన చేసిన స్కిల్‌స్కామ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా కేసును నిర్థారించి నలుగురిని అరెస్టు చేసిన విషయం మర్చిపోవద్దు.
అక్కడ కదా మోగించాల్సింది..:
2 వారాలుగా లోకేశ్‌బాబు ఢిల్లీలో దాక్కున్నాడు. ఒకవేళ చంద్రబాబు అరెస్టు అక్రమమని భావిస్తే.. ఈడీ చేసిన నాలుగు అరెస్టులు అక్రమమని భావిస్తే.. ఈడీ ఆఫీస్ ఎదుట నిలబడి కంచాలు కొడితే బాగుండేది. ఇక్కడ రాష్ట్రంలో అందరినీ కంచాలు కొట్టమనడంలో అర్థం ఏముంది?
నలుగురిని అరెస్టు చేసింది కేంద్ర సంస్థలు మాత్రమే. అలాంటప్పుడు రాష్ట్రపతిగారి దగ్గర, ప్రధానిగారి దగ్గర, హోం మంత్రిగారి దగ్గర, వారి కార్యాలయాల ముందు నిలబడి.. తమకున్న నలుగురు ఎంపీలు.. (ముగ్గురు లోక్‌సభ సభ్యులు. ఒకరు రాజ్యసభ సభ్యుడు).. ఇంకా ఈరోజు టీడీపీకి తొత్తులుగా పని చేస్తున్న వారందరినీ.. పురంధేశ్వరి కానీ, సీపీఐ నారాయణ కానీ, రామకృష్ణకానీ, రేవంత్‌రెడ్డి కానీ, సుజనాచౌదరి కానీ, సీఎం రమేశ్ కానీ, సత్యకుమార్ కానీ, జయప్రకాశ్‌నారాయణ æకానీ.. వారందరినీ పక్కన నిలబెట్టుకుని, ఢిల్లీలో కంచాలు కొట్టిస్తే బాగుండేది.
భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ, రూ.118 కోట్ల చంద్రబాబు అవినీతిని గుర్తు పట్టింది. అది అవినీతి సొమ్మే అని నిర్థారించి, షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అది కేంద్ర ఆర్థిక శాఖ కిందకు వస్తుంది కాబట్టి.. పైవాటన్నింటితో పాటు, ఆర్థిక శాఖ కార్యాలయం ఎదుట కూడా కంచాలు, గ్లాస్‌లు, గిన్నెలు మోగిస్తే బాగుండేది.
ఇదే నా సవాల్:
అసలు మీరు ఏం చెప్పదల్చుకున్నారు రాష్ట్ర ప్రజలకు? మీరు అవినీతిపరులు కాదని చెప్పుకోదల్చుకున్నారా? అలా అయితే మీరు దర్యాప్తు సంస్థల ముందు నిలబడండి. స్టేలు కోరవద్దు. విచారణకు మీరు రెడీ కావాలి. సీఐడీ దర్యాప్తుకు సహకరించాలి. స్టే తెచ్చుకోకుండా విచారణ పూరై్తతే మీరు నీతిమంతులా? అవినీతిమంతులా అన్నది తేలిపోతుంది.
ఈ విషయం మీకూ తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు నిజంగా నీతిమంతులైతే ఈ సవాల్ స్వీకరించి.. 10 కేసుల్లో మీరు ఎక్కడైతే స్టేలు తెచ్చుకున్నారో.. ఆ స్టేలు ఎత్తివేయాలని కోర్టులను కోరాలి.
మీరు నీతిమంతులు అనుకుంటే, ఇలాంటి పనులు చేయొద్దు. చట్టం, మీద నమ్మకం పెట్టుకొండి. న్యాయవ్యవస్థ ఏం చెప్పిందో అది పాటించండి.
అవినీతికి పాల్పడిన వారు ఈ ప్రదర్శనలు, అర్థనగ్న ప్రదర్శనలు, జలదీక్షలు ఎందుకు చేస్తున్నారు? వాటి వల్ల ఏమిటి ప్రయోజనం?
అవినీతిమయంగా మారిన తెలుగుదేశం పార్టీలో నీతివంతులు ఎవరైనా ఉంటే.. వాటిలో భాగస్వామ్యం కావొద్దు.
ప్రజలకు ఏం చెబుతారు?:
మొన్నటి వరకు చంద్రబాబు, ఆయన కుమారుడు ఏమన్నారు? మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.. ఇప్పుడు అన్ని ఆధారాలతో కేసులు పెట్టి, అరెస్టు చేస్తే.. మీరు ప్రజలకు ఏం చెప్పుకుంటారో చెçప్పుకొండి.
తండ్రి అరెస్టు కాగానే ప్రవాసంలోకి వెళ్లిన కొడుకుని ఎవరైనా ధైర్యవంతుడు అంటారా? లేక ఉత్తర కుమారుడు అంటారా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి.
అదే జర్నలిజమ్ అంటే..:
రెండు రోజుల పాటు తిరుపతి జిల్లా 7 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గం నుంచి సెపరేట్‌గా కార్యకర్తలను ఆహ్వానించాం. కేవలం కార్యకర్తలే కాకుండా, అభిమానులు సమావేశానికి వచ్చినా, వారిని కూడా ఆహ్వానించాం. పార్టీ బలోపేతం చేయడానికి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం.
పార్టీనీ క్షేత్రస్థాయిలో పటిష్టం చేసి 2024లో పార్టీని విజయపథంలో నడిపించాలన్న పార్టీ అధ్యక్షుడు సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఈ సమావేశాలు నిర్వహించాం. సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అయినా కార్యకర్తల్లో అసంతృప్తి లేదు. వారిలో నిరుత్సాహం లేదు. వారు చాలా మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎల్లో మీడియా ఇది గుర్తించాలి. రాంగ్ రిపోర్టింగ్ సరికాదు. ఉన్నది ఉన్నట్లు రిపోర్ట్ చేయాలి. అదే జర్నలిజమ్ అంటే..
అందుకే ఈ సమీక్షలు:
మా పార్టీ అధ్యక్షులు జగన్‌గారు, కొన్ని మార్పులు, చేర్పులు చేయాలనుకున్న మాట వాస్తవం. దానికి ఇది సమయం, సందర్భం కాదు. ఇంకా టైమ్ ఉంది. ఇప్పుడు జరిగే సమీక్షలు, సమావేశాలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి.. ఎవరిపట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉందో.. ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో.. వాటిని ప్రజా ప్రతినిధులు ఏమేర తీర్చారో తెలుసుకోవడం కోసమే ఈ సమీక్షా సమావేశాలు.
అది విచారణలో తేలుతుంది:
హెరిటేజ్‌లో కుంభకోణం గురించి మేము మొదటి నుంచి చెబుతున్నాం. అది ఏమిటి? ఎలా జరిగింది? ఎవరు దోషులు? అనేది విచారణలో తప్పకుండా తేలుతుంది? కొందరు వ్యక్తులను విచారించిన తర్వాత, ఆధారాలను క్రాస్‌చెక్ చేసుకున్న తర్వాత ఒక నిర్థారణకు వస్తాం.
అదే చంద్రబాబు స్కిల్‌నెస్:
ప్రాజెక్టు చేయకుండానే నిధులు మింగేశారనేదే కదా ఇప్పుడు. స్కిల్‌స్కామ్‌లో ఏమీ చేయకుండానే, ప్రాజెక్టు కార్యరూపం దాల్చక ముందే ఆ పేరుతో నిధులు కైంకర్యం చేశారు. అదే చంద్రబాబు స్కిల్‌నెస్.
నిజంగా వారి గుండె పగిలిందా?:
పాదయాత్ర అనేది ఎవరైనా చేయొచ్చు. ఓదార్పు దేనికి? ఎవరిని ఓదారుస్తారు? చంద్రబాబు అరెస్టు తర్వాత ఎంత మంది చనిపోయారు?
ఆయన అరెస్టు తర్వాత చనిపోయిన వారంతా.. గుండె పగిలి చనిపోయారని మీరు చెబితే.. నా దగ్గర సమాధానం లేదు.
ఆనాడు మహానేత వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే.. చాలా మంది గుండె పగిలి చనిపోయారు. అదే ఈరోజు చంద్రబాబు అరెస్టుతోనే నిజంగా ఎవరైనా చనిపోయారా? అనేది మీకే తెలుసు.
అవినీతి చేసిన వారి మీద, అన్ని ఆధారాలు దొరికిన తర్వాత కేసులు పెట్టడం చట్టబద్ధమైన చర్య. ఆధారాలు లేకపోతే కోర్టులు కేసుల కొట్టేస్తాయి. ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. అరెస్టు జరిగింది.
సీఎంగారు ఎక్కణ్నుంచైనా..:
సీఎంగారు ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించవచ్చు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీసర్లు రిపోర్టు చేస్తారు. సీఎంగారు విజయదశమి నుంచి విశాఖకు ఫిష్ట్ కావాలని నిర్ణయించారు. గతంలో ఆయనే ప్రకటించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుందని. అది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు గతంలో ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు.
ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాం:
ముందస్తు ఎన్నికల ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్పాం. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరుగుతాయి. మళ్లీ మా పార్టీదే ఘన విజయం. గతంలో కంటే ఇంకా ఎక్కువ సీట్లు పొందుతాం. సీఎంగారు మరోసారి సుపరిపాలన అందిస్తారు.
బాబు అవినీతి బయటకు తీయాలి:
చంద్రబాబుగారికి దాదాపు 6 లక్షల కోట్ల ఆస్తి ఉంది. వివిధ దేశాల్లో సింగపూర్, మలేషియా, లక్సెంబర్గ్ వరకు ఆయన ఆస్తులు కూడబెట్టుకున్నాడు. తన 14 ఏళ్ల పాలనలో ఎంత అవినీతికి పాల్పడ్డాడు? ఎంత సొమ్ము విదేశాల్లో దాచుకున్నాడు? అనేది బయటకు తీయాలి.
హోదా కోసం పోరాడుతూనే ఉంటాం:
ఎప్పుడు ఎన్నికలు జరిగినా, సొంతంగా పోటీ చేస్తాం. ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. ఒంటరిగానే పోటీ చేస్తాం. ఇదే విషయాన్ని సీఎంగారు స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం.
ప్రత్యేక హోదా అన్న అంశం మరుగున పడలేదు. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో, మా పార్టీ తరపున నేనే ఆ విషయాన్ని స్వయంగా ప్రస్తావించాను. ఇంకా విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కూడా కోరాం. ప్రత్యేక హోదా వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం.