ఉరి కాదు.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తెస్తున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌

టీడీపీ-బీజేపీల విధానం మత్స్యకారులకు అనుకూలమా లేక దళారులకు అనుకూలమా..?

  మత్స్యకారుల నోరు కొట్టి.. దళారులకు దోచిపెట్టాలన్నదే టీడీపీ-బీజేపీ వాదనా...?

  మత్స్యకారులకు రూ. 15 వేలు దక్కేలా చేస్తుంటే ప్రతిపక్షాల గగ్గోలు దేనికోసం..?

 నాడు బాబు మత్స్యకారుల బట్టలూడదీస్తానంటే.. మీ నోర్లు ఎందుకు పెగలలేదు..?

 మత్స్యకారుల సంక్షేమానికి ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా..?

 వంద హెక్టార్ల చెరువుల నిర్వహణ ఇంతకాలం పేరుకి సొసైటీలు..పెత్తనం దళారులదే..!

తాడేప‌ల్లి:  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటూ, వారికి మరింత మేలు చేకూరేలా నిర్ణయాలు చేస్తుంటే, టీడీపీ-బీజేపీ నేతలు ఉరి అంటూ.. గోబెల్స్ తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులతో  పాటు యావత్తు  బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ఇంతకాలం మత్స్యకార సొసైటీ సభ్యులకు కేవలం వెయ్యి రూపాయలు ఆదాయం మాత్రమే ఉన్న చెరువులకు సంబంధించి.. మత్స్యకారుల ఆదాయం రూ. 15 వేల వరకు పెరిగేలా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు. వంద హెక్టార్లు, ఆ పైన ఉన్న చెరువుల నిర్వహణ పేరుకు మాత్రమే మత్స్యకార సొసైటీల పరిధిలో ఉంటుందని, పెత్తనం అంతా దళారులదేనని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 217 జీవో ద్వారా, నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 27 చెరువులను బహిరంగ వేలం ద్వారా ఇస్తే ప్రతిపక్షాలు ఎందుకు రగడ సృష్టిస్తున్నాయని ప్రశ్నించారు. అంటే, ప్రతిపక్షాలు మత్స్యకారులకు అనుకూలమా.. లేక వ్యతిరేకమా అని మోపిదేవి సూటిగా ప్రశ్నించారు. 

  రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, దానికి ఉప కులాలుగా ఉన్న మత్స్యకార వర్గాలు, చెరువుల మీద ఆధారపడి జీవించే వ్యక్తుల యొక్క కుటుంబాలలో ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ కుటుంబాలకు అన్నివిధాలా న్యాయం చేయాలని నెల్లూరు జిల్లాను ఒక పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని, నూతన విధానం ద్వారా వచ్చే లాభ, నష్టాలను బేరీజు వేసుకుని అమలులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జీవో నంబరు.217ను తీసుకురావడం జరిగింది. నెల్లూరు జిల్లాను పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని 27 ట్యాంకులకు ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా వెళ్ళడం జరిగింది. దీనిమీద ఆ జిల్లాకు చెందిన కొందరు కోర్టులను ఆశ్రయిస్తే.. మత్స్యకార సొసైటీల సభ్యులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రతి ఒక్కరూ సమర్థించాల్సిందేనని.. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం కూడా స్పష్టమైన తీర్పును ఇచ్చింది.

 ఈ జీవోను తీసుకురావడానికి ప్రధానం కారణం ఏంటంటే..  వంద హెక్టార్లు, ఆ పైన ఉన్న అంటే సుమారుగా 250 ఎకరాలు సామర్థ్యం గల ట్యాంకులను ఇంతకాలం మత్స్యకార సొసైటీలు నిర్వహించడం అనేది క్షేత్రస్థాయిలో జరగటంలేదు. పేరుకు సొసైటీలు.. పెత్తనం చేసేది మాత్రం దళారులదే. ట్యాంక్స్‌లో వచ్చే ఫలసాయంలో షేర్‌ ఇచ్చే దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఇవన్నీ ఆలోచించి..  సొసైటీ సభ్యులకు కనీసం వెయ్యి రూపాయలు ఆదాయం కూడా రావడం లేదని గుర్తించి.. ఇకపై వారికి కనీసం రూ.15వేలు వరకు ఆదాయం వచ్చేలా 217 జీవోను తీసుకువచ్చి... ప్రయోగాత్మకంగా నెల్లూరు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింది 27 ట్యాంకులను లీజుకు ఇవ్వడం జరిగింది. 

  మత్స్యకారుల మేలు కోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చేస్తున్న మంచి పనిని కూడా ఆమోదించకుండా..  ప్రతిపక్ష పార్టీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. మత్స్యకారుల ఆదాయం పెంచటం కోసం చేస్తున్న ఈ పనిని విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకులు అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇంతకాలం వెయ్యి కూడా ఆదాయం రాని ప్రతి సొసైటీ సభ్యుడికి  రూ.15వేలు ఆదాయం వస్తే లాభామా? నష్టమో మీరే సమాధానం చెప్పాలి.

ఉరి కాదు.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు
 చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు మరికొంతమంది పెద్దలు ఈ విధానం ద్వారా మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని పదేపదే అంటున్నారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ మత్స్యకారుల గొంతుకు ఉరి బిగించేలా ఉందంటూ ఏవేవో పిచ్చి రాతలు రాశారు. మత్స్యకార సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెడుతున్నఈ పెద్దమనుషులు.. నాడు చంద్రబాబు (2015-17 సమయంలో) మత్స్యకార సామాజిక వర్గాన్ని అత్యంత హేయమైన పదాలతో కించపరిచేలా మాట్లాడినప్పుడు ఏమయ్యారు..?, ఎందుకు కనీసం ఖండించలేకపోయారు..?.  
- టీడీపీ హామీ ఇచ్చిన విధంగా,  తమకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులు, అంశాలు, డిమాండ్లు సాధించుకోవాడానికి విశాఖపట్నంలో చంద్రబాబును కలిస్తే, వారిని దారుణంగా అవమానపరిచే విధంగా .. ‘ఎక్కువ తక్కువగా మాట్లాడితే బట్టలూడదీస్తాను.. తోకలు కత్తిస్తా..’ అని సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం మీకు గుర్తు లేదా?
- ఆనాడు మత్స్యకార జాతిని అవమానపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడిన మాటలకు అప్పట్లో ఈ సామాజిక వర్గ నేతలకు కనీసం చీమ కుట్టినట్లు లేదు. ఇప్పుడు ప్రభుత్వం మంచి చేద్దామని ప్రయత్నిస్తుంటే అది మీకు చెడులా ఎందుకు కనిపిస్తోంది. ఆనాడు నోరు విప్పని మీరు ఇప్పుడు రాద్ధాంతం చేయడం ఎంతవరకూ సమంజసం..? దీన్ని మీరు ఏవిధంగా సమర్థిస్తారు...?

 ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ.. అన్ని కుల వృత్తుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా నిర్ణయాలు తీసుకుని, వారికి లబ్ది చేకూర్చేలా, అలాగే మత్స్య సంపదపై ఆధారపడి జీవించేవారికి గతంలో ఎన్నడూ లేనివిధంగా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 ముఖ్యమంత్రిగారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు పరుస్తూ.. అధికారంలోకి రాగానే లక్షా 20వేల మంది మత్స్యకారులకి మనిషికి రూ.10వేలు చొప్పున మత్స్యకార భరోసా ఇచ్చారు. మెకనైజ్‌డ్‌ బోట్లకు నెలకు 300 లీటర్ల డీజిల్‌కు రూ.9 సబ్సిడీ వారి ఖాతాల్లోనే నేరుగా జమ అయ్యాయి. గతంలో ఇలాంటివి ఏమీ లేవు. అందుకు పూర్తిగా భిన్నంగా ఈ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుడు వేటకు వెళ్లి చనిపోతే.. రూ.10 లక్షలు నష్టపరిహారంగా చెల్లించడం జరిగింది. రెండున్నరేళ్లలో రూ. 64మంది మృతి చెందినట్లు ధ్రువీకరణ కాగానే పరిహారం అందించిన పరిస్థితులు ఉన్నాయి.

 ఆక్వా కల్చర్‌ విషయానికి వస్తే ఆ సెక్టార్‌మీద ఆధారపడి జీవించేవారికి పవర్‌ టారిఫ్‌ కింద సబ్సిడీలు ఇస్తున్నాం. భారతదేశంలో గుజరాత్‌ తర్వాత సముద్ర తీరం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీనే. ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఫేజ్‌ వన్‌ కింద నాలుగు హార్బర్లు శాంక్షన్‌ అయ్యాయి. వాటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫేజ్‌ టూ కింద మిగతా జిల్లాల్లో హార్బర్ల నిర్మాణానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
- వీటితో పాటుగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే, ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే అనేక చర్యలు తీసుకోవడంతోపాటు.. మెరైన్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు ఏపీ మెరైన్‌ ఫిషరీ వర్శిటీ కోసం స్థలం కేటాయించడం జరిగింది. ఆక్వా కల్చర్‌ ద్వారా ఉత్పత్తిని ఇంకా పెంచుకునేందుకు ఆర్బీకే- హబ్స్‌ ద్వారా నాణ్యమైన సీడ్‌, ఫీడ్‌ను అందిస్తున్నాం. జీవో నెం.217ను పెద్ద భూతద్దంలో చూపిస్తూ ఆరోపణలు చేయడం తగదు. వంద హెక్టార్లు పైచిలుకు ఉన్న ట్యాంక్స్‌ను పైలట్ ప్రాజెక్టు కింద వేలానికి పెడితే ఆ కొద్దిపాటి అంశాన్ని మొత్తం మత్స్యకారులకే ఆపాదిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు.

  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల భవిష్యత్‌ కోసం, వారికి మెరుగైన ప్రతిఫలాలు అందించేందుకు, ప్రతి సంక్షేమ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేస్తూ, ముఖ్యమంత్రిగారు నిర్ణయాలు తీసుకుంటుంటే విమర్శలు చేయడం విడ్డూరం. 
- మత్స్యకారులకు అమలు చేస్తున్న పథకాలుగానీ, రాష్ట్రంలో అమలవుతున్న మిగతా సంక్షేమ పథకాలు గానీ  టీడీపీ హయాంలో ఎందుకు అమలు చేయలేకపోయారు? 
-  చిన్న చిన్న కులాలకు కూడా రాజకీయ గౌరవం అందించేందుకు, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి సముచిత స్థానం కల్పిస్తూ  బీసీ వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత, గుర్తింపు ఇచ్చారు.

  ఇంతకాలం బీసీలంటే కేవలం ఓటు బ్యాంక్‌ రాజకీయాలకే పరిమితం అయ్యారు. టీడీపీ బీసీలను అదే విధంగా చూసింది.  జగన్ మోహన్ రెడ్డిగారి హయాంలో బడుగు, బలహీన వర్గాలకు అత్యంత రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. కార్పొరేషన్‌లకు చైర్మన్ల నియామకం చేయడంతో పాటు,  మాలాంటి వారిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసి,  గౌరవం, గుర్తింపు ఇస్తుంటే... రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎలాపడితే అలా మాట్లాడటం సరికాదు. 
- బీసీలకు, మత్స్యకారుల సంక్షేమానికి టీడీపీ హయాంలో ఏం చేశారు, ఈ రెండేళ్ళ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనే అంశంపై..  చర్చకు వస్తే వాస్తవాలు వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నామ‌ని మోపిదేవి  వెంక‌ట‌ర‌మ‌ణ పేర్కొన్నారు.

Back to Top