రాష్ట్రానికి చంద్రబాబు హానికరం

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌

 ప్రత్యేక హోదాను ఆనాడు తుంగలో తొక్కింది ఎవరు?

 క్యాన్సర్‌ గెడ్డ అయిన చంద్రబాబు కాదా?

 ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందెవ్వరు?

 అదీ అప్పటి సీఎం చంద్రబాబే కదా?

 10 ఏళ్లు అవకాశం ఉన్నా.. హైదరాబాద్‌ నుంచి వచ్చేసిందెవ్వరు?

 ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు కాదా?

సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

 రాష్ట్రానికి చంద్రబాబు వల్లే అన్ని సమస్యలు

 టీడీపీ గత 5 ఏళ్ల పాలనంతా అవినీతిమయం

 ప్రజల కోసం చేసిన ఒక్క పనీ చెప్పుకోలేని చంద్రబాబు

  చివరకు పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టో సైతం మాయం

గుర్తు చేసిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

 టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీతో చంద్రబాబు సెల్ఫ్‌ గోల్‌

 నాడు టిడ్కో ఇళ్లలోనూ అవినీతి. పనులూ పూర్తి చేయలేదు

 వాటి నిర్మాణాలు పూర్తి చేసి, లబ్ధిదారులకు అందిస్తున్నాం

 ఇప్పటికే 50 వేల ఇళ్లు ఇచ్చాం. 2 నెలల్లో మరో 40 వేల ఇళ్లిస్తాం

 మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ

 చరిత్రలో లేని విధంగా 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం

 దమ్ముంటే అక్కడ చంద్రబాబు సెల్ఫీ తీసుకోవాలి

ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పష్టీకరణ

  

విశాఖపట్నం: రాష్ట్రానికి చంద్రబాబు హానికరమ‌ని వైయ‌స్ఆర్ సీపీ మ‌హిళా విభాగం నాయ‌కురాలు,  ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమ‌ర్శించారు.     రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరూ సీఎం వైయస్‌ జగన్‌ను సొంత బిడ్డలా ఆదరిస్తుంటే, తట్టుకోలేకపోతున్న చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్యాన్సర్‌ గెడ్డ అంటూ పిచ్చి విమర్శలు చేస్తున్నారు.  నిజానికి చంద్రబాబు రాష్ట్రానికి హానికరం. ఆయన ఒక క్యాన్సర్‌. అయన వల్లే అనేక సమస్యలు వచ్చాయ‌న్నారు. విశాఖపట్నం వైయ‌స్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కిన క్యాన్సర్‌ గెడ్డ ఎవరు?
 ఆనాడు ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కిన క్యాన్సర్‌ గెడ్డ ఎవరు? చంద్రబాబు కాదా? ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను నాశనం చేసింది చంద్రబాబు కాదా? 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, రాత్రికి రాత్రి పారిపోయి వచ్చింది ఎవరు? చంద్రబాబు కాదా? అలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల లక్షల కోట్ల ఆస్తిని హైదరాబాద్‌లో వదిలి వచ్చిన క్యాన్సర్‌ గెడ్డ చంద్రబాబు.
    చంద్రబాబు రాష్ట్రానికి ఒక దరిద్రం. ఆయన అబద్ధాలకు ఒక అడ్డా. అందుకే చంద్రబాబు ఒక క్యాన్సర్‌. కరోనా కంటే హీనం. ఈ మాట ప్రజలే చెబుతున్నారు.

బాబు పాలనంతా అవినీతిమయం:
    చంద్రబాబు పాలనంతా అవినీతిమయం. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో యథేచ్ఛ దోపిడి. రాష్ట్రానికి చంద్రబాబు హానికరం. ఆయన వల్లే అన్ని సమస్యలు. ప్రజల కోసం చేసిన ఒక్క పని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న చంద్రబాబు, దిక్కు తోచక ప్రభుత్వంపైనా, సీఎంగారి పైనా రోజూ బురద చల్లుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన చంద్రబాబు, చివరకు పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోను కూడా మాయం చేశారు. 

ఆ సెల్ఫీతో చంద్రబాబు సెల్ఫ్‌ గోల్‌:
    టిడ్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జగనన్న పూర్తి చేసిన టిడ్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగడం ఏంటని ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు తన హయాంలో టిడ్కో ఇళ్లు 50% కూడా పూర్తి చేయలేదు. 3.13 లక్షల ఇళ్లు కట్టిస్తానన్న చంద్రబాబు, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. 
    అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాటి పనులు పూర్తి చేసి, ఇప్పటికే 50 వేల ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చాం. రెండు నెలల్లో మరో 40 వేల ఇళ్లు నిరుపేదలకు ఇవ్వబోతున్నాం. మొత్తంగా 1.30 లక్షల టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 
    ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా, 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈరోజు ఏకంగా 17 వేలకు పైగా జగనన్న కాలనీలు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా ఊళ్ల నిర్మాణమే జరుగుతోంది. అందుకే చంద్రబాబుకు ధైర్యం ఉంటే, గ్రామాలకు వెళ్లాలి. సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌ల వద్ద సెల్ఫీలు దిగాలి. ప్రభుత్వ పథకాలు అందుకున్న వారికి కలవాలి. వారితో సెల్ఫీ దిగాలి. అంతేతప్ప, జగనన్న ప్రభుత్వం పూర్తి చేసిన టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగడం కాదు. 

జగనన్నపై జనంలో అపార నమ్మకం:
    రాష్ట్రంలో ఇప్పుడు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. మా నమ్మకం జగనన్న అన్న నినాదంతో పార్టీ నాయకులు ఇల్లిల్లూ తిరుగుతూ, ప్రభుత్వం వారికి చేసిన పనులను వివరిస్తుండగా, వారు ఎంతో ఆదరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీకి చెందిన 7 లక్షల కేడర్‌ (మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, నాయకులు, కార్యకర్తలు) 14 రోజుల పాటు 1.60 కోట్ల ఇళ్లు సందర్శించనున్నారు.
    గతంలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో కార్యక్రమం చేపట్టలేదు. కేవలం మా పార్టీ సానుభూతిపరులే కాకుండా, అన్ని పార్టీల వారి వద్దకు కూడా వెళ్తూ మద్దతు కూడగడుతున్నాం. ప్రజలూ మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. సీఎంగారి స్టిక్కర్లు ఇళ్లపై అతికించుకుంటున్నారు.

ఆ దైర్యంతోనే వెళ్తున్నాం:
    ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 98.4 శాతం అమలు చేయడమే కాకుండా, అందులో చెప్పనివి కూడా చేశాం కాబట్టే.. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం. చేసింది చెబుతున్నాం. నమ్మితే మద్దతు ఇవ్వమని అడుగుతున్నాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా పలు పథకాల ద్వారా రూ.2 లక్షల కోట్లు నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అర్హుల ఖాతాల్లో జమ చేశాం. అది మా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రత్యేకత.

టీడీపీ ఆ పని చేయగలదా?:
    మరి అలా ప్రజల్లోకి వెళ్లగలిగే ధైర్యం చంద్రబాబుకు కానీ, ఆ పార్టీ వారికి కానీ ఉందా?. చేసింది ఒక్కటి కూడా చెప్పుకోవడానికి లేదు కాబట్టే, నిత్యం మా ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా చోట్ల అభ్యర్థులు కూడా లేరు.
    అందుకే మళ్లీ అడుగుతున్నాం. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ మొత్తం 175 చోట్ల పోటీ చేస్తుందా? అన్ని చోట్ల అభ్యర్థులను నిలబెడతారా? ఆ ధైర్యం మీకుందా? 

మద్యంపై దుష్ప్రచారం:
    గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 43 వేలకు పైగా బెల్టు షాప్‌లు, వైన్‌షాప్‌ల దగ్గర 4500 పర్మిట్‌రూమ్‌లు ఉంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ రద్దు చేసింది. మద్యం షాపులను కూడా మూడో వంతు తగ్గించడం జరిగింది. దాని వల్ల మద్యం విక్రయాలు కూడా తగ్గాయి. అయినా ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే, అందరూ నమ్ముతారని అనుకుంటున్న చంద్రబాబు, ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో మద్యం విక్రయాలపై అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి గతంలో కంటే మద్యం విక్రయాలు ఇప్పుడు తగ్గాయి. చంద్రబాబు హయాం నాటి 2018–19తో 2021–22 పోలిస్తే లిక్కర్‌ అమ్మకాలు 27.54%, బీర్ల అమ్మకాలు 70% తగ్గాయి.

మా భద్రత–మా ప్రభుత్వ ప్రాధాన్యత:
    జగనన్న ప్రభుత్వం మా (మహిళల) భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆ దిశలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం రూపొందించండంతో పాటు, 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఆపత్కాలంలో ఆదుకునే విధంగా రూపొందించిన దిశ యాప్, నిజంగా మహిళలకు ఒక వరం. అది ఒక వజ్రాయుధంలా పని చేస్తోంది.    
    అలాగే మహిళలపై నేరాల విచారణకు 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని వల్ల 3,143 కేసుల్లో వారం రోజుల్లోపే విచారణ పూర్తి కాగా.. 60 రోజుల లోపు విచారణ  పూరై్తన కేసులు చూస్తే.. 2021లో 91.69%, 2022లో 88.79%, 2023లో 94.74% కేసుల విచారణ 60 రోజుల్లో  పూరైంది. అదే చంద్రబాబు హయాంలో 60 రోజుల లోపు విచారణ పూర్తైన కేసులు 12.88% మాత్రమే.
    ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ప్రభుత్వంపై నిత్యం ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నా.. 2024 ఎన్నికలతో చంద్రబాబు రాజకీయాలు పరిసమాప్తం అవుతాయని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు

Back to Top