‘నారా డిజాస్టర్‌ అలయెన్స్‌’గా ఏపీ ఎన్డీఏ

మీడియా స‌మావేశంలో వైయ‌స్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి  

2014 –19లో కూటమి మోసాల్ని ప్రజలింకా మరిచిపోలేదు

650 హామీల్ని ఎగొట్టిన క్రెడిబుల్టీ లేని అట్టర్‌ఫ్లాప్‌ కూటమి అది..

చెప్పుకోవడానికి చేసిందేమీ లేకనే కూటమి నేతలు జగనన్నపై విషం చిమ్ముతున్నారు

కాలకూట విష కూటములెన్ని వచ్చినా.. 2024 జగనన్న వన్స్‌మోర్‌గా ప్రజలు డిసైడై అయ్యారు 

శాసనమండలి సభ్యురాలు శ్రీమతి వరుదు కళ్యాణి స్పష్టీకరణ

విశాఖ‌:   ‘నారా డిజాస్టర్‌ అలయెన్స్‌’గా ఏపీ ఎన్డీఏ మానింద‌పి వైయ‌స్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అభివ‌ర్ణించారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరిల కాలకూట విష కూటమి అది అని చెబుతున్నారని తెలిపారు. విశాఖపట్టణంలోని తన కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర‌ అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. 

2024 వన్స్‌మోర్‌ అని ప్రజలు డిసైడ్ః
ఎన్నికలు జరుగుతున్న తరుణమిది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలంతా జగనన్నకు మళ్లీ ఓట్లేసి.. ఆయన్నే మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఇప్పటికే డిసైడ్‌ అయి ఉన్నారు. ఎవరెన్ని కూటములు కట్టినా ప్రజలు మాత్రం 2024 వన్స్‌మోర్‌ అంటూ.. జగనన్న వైపే ఉన్నారు. దానికి నిదర్శనంగా మనం జగనన్న బస్సుయాత్రకు వస్తోన్న స్పందనను చూస్తున్నాం. మండుటెండ లను సైతం లెక్కచేయకుండా కాళ్లు కాలుతున్నప్పటికీ ప్రజలు తండోప తండాలుగా జగనన్నకు ఎదురొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న గుంటూరులో వర్షంలో తడుస్తూ కూడా జనం బారులు తీరి మరీ.. జగనన్న బస్సు యాత్రకు మద్ధతుపలికారు. ఐదేళ్ల పరిపాలనలో జనం మేలు కోరిన జగనన్నను చూడాలని.. ఆయనకు తమ మద్ధతు ప్రకటించాలని మహిళలు, వృద్ధులు, చిన్నారులతో సహా అందరూ ఊరూరా తరలిరావడం చూస్తున్నాం. 

ప్రజలే మా స్టార్‌క్యాంపెయినర్లు..ః
మంచి చేసిన ప్రభుత్వానికి ఇంత పెద్ద స్థాయిలో పాజిటివ్‌ ఉంటుందా..? అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలనగానే, సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధినేత ఒక్కరే స్టార్‌క్యాంపెయిన్‌ చేస్తూ ఉంటారు. అలాంటిది, ఇవాళ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌ మా పార్టీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఒక్కరే కాదు. రాష్ట్రంలోని దాదాపు 86 శాతం కుటుంబాలన్నీ మా పార్టీ స్టార్‌క్యాంపెయినర్లుగా ఉన్నారు. ఈ విషయం మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. వాళ్లంతా కూడా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రిగా రావాలని.. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే మళ్లీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 

2014 –19లో కూటమి మోసాలే.. జగనన్న ప్రజాదరణకు బలంః
ఇంతగా మరోసారి జగనన్న గారి ప్రభుత్వమే మళ్లీ రావాలని రాష్ట్ర ప్రజలంతా ఎందుకు కోరుకుంటున్నారన్నది మనం చెప్పుకోవాలి.  చంద్రబాబు ఇప్పుడు ఏయే పార్టీలతో కూటమి కట్టారో.. అవే పార్టీలతో జట్టుకట్టి 2014 నుంచి 2019 మధ్య ఇచ్చిన హమీలు అమలు చేయలేదు. అందర్నీ నిట్టనిలువునా మోసం చేశాడు. ముఖ్యంగా మహిళల్ని, రైతుల్ని, నిరుద్యోగుల్ని యువతతో సహా నమ్మించి మోసం చేశాడు. మరి, ఇప్పుడు ఎన్నికలకు అదే కూటమి ఎలా వచ్చింది..? ఆనాడు వాళ్లు ఏం చెప్పారో.. ఏం చేశారో అనేది చెప్పి ఎన్నికలకు రావడం లేదు. ఎంతసేపు జగనన్నను ఆడిపోసుకోవడం.. ఆయనపై ఉన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక అలా తిడుతూ ఉండటమే కూటమి సభల్లో కనిపిస్తుంది తప్ప ఏమీలేదు.   

ఫ్యాన్‌ ఇంట్లో.. జగనన్న మా గుండెల్లో ఉన్నాడంటూ..ః
2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది..? సామాన్య మధ్యతరగతి కుటుంబానికి మేలు జరిగిన ఒక్క మంచి పథకాన్నైనా అమలు చేయగలిగారా..? అలా చేసి ఉంటే, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒక్కటైనా చెప్పుకోవడం లేదేం..? మీలో నిజాయితీ లేకుండా.. ఎంతసేపూ మా జగన్‌ గారి ప్రభుత్వంపై విషం కక్కడం.. ప్రజలు ఆదరిస్తున్నందుకు వాళ్లపై పడి ఏడ్వడం తప్ప కూటమి ఈ ఎన్నికల్లో చేస్తుందేమీలేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి మ్యానిఫెస్టోలోని 650 హామీల్ని నెరవేర్చకుండా అందర్నీ నిట్టనిలువునా మోసం చేసినందునే ప్రజలు ఇప్పుడు ఒకటే చెబుతున్నారు.  సైకిల్‌ ఇంటి బయటనే ఉండాలి. గ్లాస్‌ సింకులో ఉండాలి. కమలం బురదలోనే ఉందని.. ఫ్యాన్‌ ఒక్కటే ఇంట్లో ఉంది. జగనన్న మా గుండెల్లో ఉన్నాడని ప్రజలంతా గర్వంగా ధైర్యంగా ఆనందంగా చెబుతున్నారు.   

ఏపీలో ఎన్డీఏ అంటే ‘నారా డిజాస్టర్‌ అలయెన్స్‌’
ఇక, కూటమి పరిస్థితిపై ప్రజల అభిప్రాయంలో.. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరిల కాలకూట విష కూటమి అది అని చెబుతున్నారు. ఎన్డీఏ అంటే.. నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌గా గతంలో అనేవాళ్లు. అయితే, ఇవాళ ఏపీలో ఎన్డీఏను ‘నారా డిజాస్టర్‌ అలయెన్స్‌’ అని.. ‘నారా డిస్ట్రక్టివ్‌ అలయెన్స్‌’ అని కూడా  ప్రజలంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ పరిస్థితి మరీ అంత ఘోరంగా తయారైంది. 

జగనన్న తుఫానుకు మీరు ఆరిపోవడం ఖాయంః
కూటమి గురించి చంద్రబాబు బహిరంగ సభల్లో ఏవేవో చెప్పుకుంటున్నారు. ఆయనేమో అగ్ని అంట. పవన్‌కళ్యాణ్‌ వాయువు అంట. అగ్నికి వాయువు తోడైందని చెప్పుకుంటున్నారు. మీరిద్దరూ అగ్ని, వాయువు అయితే.. మా జగనన్న గారు తుఫాను. అంటే, తుఫానులో వచ్చే వర్షానికి ఈ అగ్ని, వాయువు ఆరిపోవడం ఖాయం. 2024 మే 13న ఎన్నికల్లో ఖచ్చితంగా అదే జరుగబోతుంది. బాబు చెప్పినట్టు.. ఆయన నిజంగా అగ్ని అయితే.. అది ఎలాంటిదంటే, 2014 నుంచి 2019 వరకు ప్రజల జీవితాల్ని బుగ్గి చేసిన అగ్ని అని చెప్పాలి. అంతేతప్ప ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అగ్ని మీరు కాదని చంద్రబాబుకు ప్రజలే చెబుతున్నారు. 

 650 హామీల్ని ఎగ్గొట్టిన దొంగల కూటమి అదిః
కూటమి సభలను చూస్తే.. వాళ్లు ఒకరికొకరు జెండాలు మార్చుకోవడం.. గుర్తులు మార్చుకుంటూ ఉండటాన్ని చూస్తే ప్రజలకు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అదేమంటే, అప్పట్లో అలీబాబా అరడజను దొంగలుంటే.. ఇప్పుడు 650 హామీల్ని ఎగ్గొట్టిన దొంగలుగా ఈ కూటమి కనిపిస్తుందని చెప్పాలి. 

క్రెడిబుల్టీ లేని కూటమి అట్టర్‌ఫ్లాప్ః
 అంతేతప్ప ఇలాంటి కాలకూట విష కూటమిలు ఎన్ని జతగట్టినా ప్రజల్ని మాత్రం మోసం చేయలేరు. మీ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే, కూటమిలోని పార్టీలు గానీ.. ఆ పార్టీల నేతలు గానీ క్రెడిబుల్టీ లేనివి. అదే క్రెడిబుల్టీకి కేరాఫ్‌ అడ్రస్‌ మా జగనన్న. మా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం. ఈ విషయంలో ప్రజలకు చాలా స్పష్టత ఉంది. కాబట్టే.. కూటమి సభలన్నీ ఫ్లాప్‌ అవుతున్నాయి. కూటమి కూడా అట్టర్‌ఫ్లాప్‌ అవుతుంది. కూటమి తరఫున మీరెన్ని హామీలిచ్చినా .. వాటిని నెరవేర్చే కూటమి కాదని ప్రజలు నిర్ణయానికొచ్చారు. రేపు జరిగే ఎన్నికల్లో కూటమి ఓటమితో అట్టర్‌ఫ్లాప్‌ అని తేలుతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యాలయాలకు మూత తప్పదు. 

ఉండవల్లిలో నారావారి కబ్జా ప్యాలెస్‌ బద్ధలవకతప్పదుః
ఎన్నికల్లో ప్రజాతీర్పుతో ఉండవల్లి కరకట్టమీద ఉన్న నారా వారి కబ్జా ప్యాలెస్‌ బద్దలవ్వబోతుంది. ఆ విషయాన్ని వదిలేసి.. చంద్రబాబు తాడేపల్లి ప్యాలెస్‌ అంటూ ఏవేవో కారుకూతలు కూస్తున్నాడు. తాడేపల్లి భవనాన్ని టచ్‌ చేసే దమ్మూధైర్యం కూటమిలో ఏ ఒక్క నాయకుడికీ లేదు. ఎవరికీ చేతగాని వ్యవహారమది. అసలు, 2019లోనే కబ్జా కరకట్ట ప్యాలెస్‌ కృష్ణానదిలో మునిగితే చంద్రబాబు హైదరాబాద్‌లో తేలాడు. రేపు 2024 ఎన్నికల్లో ఆ ప్యాలెస్‌ కృష్ణానదిలో నిండా మునిగితే మీరు ఏ సింగపూర్‌నో.. మలేసియా, దుబాయ్‌లోనే తేలుతారేమో.. 

మేమేం చేశామో చెప్పాం.. మీరేం చేశారో చెప్పాలన్నది ప్రజాసవాల్ః
ఎన్నికల ప్రచారంలో ఉన్న కూటమికి ప్రజల నుంచి ఒకటే ప్రశ్న.. మీరు గతంలో 2014 నుంచి 2019 వరకు 650 హామీల్లో ఎన్ని నెరవేర్చారు..? అని ప్రతీఒక్కరూ సవాల్‌ విసురుతున్నారు. దీనిపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి సమాధానం చెప్పాలి. అదే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గడచిన 58 నెలల కాలంలో దాదాపు రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా వివిధ పథకాల రూపంలో లబ్ధిదారులకు నేరుగా సంక్షేమాన్ని జమ చేశాం. ఇవన్నీ ఆధారాలతో సహా మా దగ్గర జాబితాలు సిద్ధంగా ఉన్నాయి. మరి, మీరు కూటమి తరఫున మీ అధికారంలో ఎవరికెంత లబ్ధి చేకూర్చారు..? గతంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారు..? భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో.. అనేది చెప్పుకుని ప్రజల్లోకి వెళ్లాలి.

జగనన్న చేసేవే చెబితే.. కొత్తగా నువ్వుచేసేందేంటి బాబూ..?ః
స్మశానంలో ముగ్గుండదు. చంద్రబాబుకు సిగ్గుండదనే సామెత ప్రజల నోళ్లల్లో వినిపిస్తుంది. జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను చంద్రబాబు కొనసాగిస్తామంటున్నాడు. పింఛన్లు కూడా జగనన్న ప్రభుత్వం మాదిరిగానే ఇంటికి తీసుకొచ్చి ఇస్తానంటూ హామీనిస్తున్నాడు. ఈ విషయంలో ప్రజలంతా చంద్రబాబుకు చెబుతుందేమంటే, నువ్వు చేస్తానన్న ప్రతీ పనీ ప్రస్తుతం ఐదేళ్లల్లో మా జగనన్న చేసి చూపారు కదా..? మరి, నువ్వింకా కొత్తగా చేసేదేముంది..? అని నిలదీస్తున్నారు. ఇదే వాలంటీర్‌ వ్యవస్థ గురించి గతంలో చంద్రబాబు ఏమన్నాడు..? వాళ్లు మూటలు, సంచులు మోసేవాళ్లు. మగవాళ్లు ఇళ్లల్లో లేనప్పుడు తలుపులు కొడుతూ ఉన్నారని చెప్పారుకదా.? వాళ్లు దొంగలని, గంజాయి వ్యాపారం చేసేవాళ్లంటూ మీరు అభాండాలు వేశారు. మీ పార్ట్‌నర్‌ పవన్‌కళ్యాణ్‌ ఒక అడుగు ముందుకేసి.. వాలంటీర్లు అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ నోరుపారేసుకున్నాడు. అదే నోళ్లతో మీరు వాలంటీర్ల వ్యవ్యస్థను కొనసాగిస్తాం.. జీతం రూ.10 వేలు చేస్తామంటారా..? సచివాలయ వ్యవస్థను రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకే పెట్టారంటూ జగనన్నను ఆడిపోసుకున్నారు. ఇవే వ్యవస్థలపై మీరు అన్న మాటలన్నీ అబద్ధాలేననే కదా అర్ధం. అంటే, ప్రజలు ఏదిబడితే అది వినేస్తారు. నమ్మేస్తారనేది మీ అభిప్రాయమా..? మీరన్న ప్రతీ మాటా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు గజినీలు కాదు. రేపటి ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా వారు బుద్ధిచెబుతారు. 

చంద్రబాబుకు జైలు తప్పదని పవన్‌ గ్రహించాలిః
పవన్‌కళ్యాణ్‌ నిన్న మోదీ గ్యారెంటీ పేరిట ఒక ట్వీట్‌ చేశారు. అవినీతిపరుల్ని జైలుకు పంపడంలో మోదీ గ్యారెంటీ ప్రకారం.. చంద్రబాబు ఖచ్చితంగా జైలుకు పోతాడు. ఎందుకంటే, గతంలో ఇదే మోదీగారు ఏపీకొచ్చినప్పుడు చంద్రబాబు కరపక్షన్‌ కింగ్‌ అని.. పోలవరంను ఏటీఎంగా చేసుకుని కేంద్రం పంపిన సొమ్మంతా దోచుకున్న దొంగగా చెప్పారు. మరి, ఆనాడు ఆయన అన్న మాటల ప్రకారం అవినీతికి పాల్పడిన చంద్రబాబును ముందుగా జైలుకు పంపుతారని పవన్‌కళ్యాణ్‌ అర్ధం చేసుకోవాలి. ఇదే పవన్‌కళ్యాణ్‌ కూడా గత ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ పెద్దదొంగలని, మద్యం, ఇసుకలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి రూ. కోట్లు దోపిడీచేశారని చెప్పారు కదా..? మరి, బాబూకొడుకుల్ని ఎప్పుడు జైల్లో పెడతారని మోదీని అడగండి.

జగనన్న విజన్‌ ఒప్పుకున్నందుకు థాంక్స్ః
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆవిర్భవించిన సచివాలయ, వాలంటరీ వ్యవస్థలపై జగన్‌మోహన్‌రెడ్డి గారి విజన్‌ను కూటమి నేతలు ఇప్పటికైనా అంగీకరించడం మంచి పరిణామం. సచివాలయ వ్యవస్థను, వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని.. జీతాలు పెంచుతామని, ప్రభుత్వ పథకాలు, పింఛన్లు కూడా ఇంటింటీకీ పంపిణీ చేస్తామంటున్నారంటే..జగనన్న విజన్‌ను మీరు ఒప్పుకున్నట్టే కదా..?  గతంలో ఆయా వ్యవస్థలపై నోటికొచ్చిందల్లా వాగి.. నేడు వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో చూసి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి తమ మనసులోని మాటలు ప్రజలకు వినిపించినందుకు మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చేసిన తప్పులు ఒప్పుకుని క్షమించాలని వేడుకున్నా కూడా ప్రజలు మాత్రం కూటమి నేతల్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసి.. మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్లంతా ఇప్పటికే డిసైడ్‌ అయ్యారు. 

Back to Top