దళితుడు.. ఉన్నత విద్యావంతుడైన గురుమూర్తి ఎంపీ కాకూడదా?

 వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ  డొక్కా మాణిక్య వరప్రసాద్‌ :

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కు మంచిపేరు వస్తోందని విపక్షాల నిరాధార ఆరోపణలు

 మంచి అన్నది మాల అయితే ఆ మాలను నేను అవుతా అన్న ఏకైక సీఎం వైయ‌స్ జగన్‌ మాత్రమే

సీఎం దళిత పక్షపాతి.. వారికి అండగా సీఎం ఉన్నారని దుగ్ధతో అసత్య ప్రచారం చేస్తున్నారు

ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ చేయని మేలు  వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రమే చేసింది
 
రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి యత్నించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు

తాడేపల్లి: దళితుడు.. ఉన్నత విద్యావంతుడైన డాక్ట‌ర్ గురుమూర్తి తిరుప‌తి ఎంపీ కాకూడదా అని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ విప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయ‌ని చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా సీఎం వైయ‌స్ జగన్‌ నాయకత్వంలో ముందుకు వెళ్తోంది. వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేద‌న్నారు. పేద వర్గాలను ఆదుకోవటానికి ఈ ప్రభుత్వం పది అడుగులు ముందుకు వేస్తోంద‌ని చెప్పారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడారు.  

నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు ప్రజలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అర్హులైన వారికి ప్రత్యక్షంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఫిబ్రవరి వరకు లెక్కలు తీసుకుంటే.. 1.35 కోట్ల మందికి నేరుగా ప్రభుత్వం ద్వారా లబ్ది అందింది. ఎలాంటి మధ్యవర్తి లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అర్హులకు లబ్ధి అందేలా కార్యక్రమాలు అందిస్తున్నారు. 

గతంలో ఎవ్వరూ ఆలోచించని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించే కార్యక్రమం శ్రీ జగన్‌ ప్రవేశపెట్టారు. చైనాలో మావో, రష్యాలో లెనిన్‌ చేశారో లేదో తెలీదు కానీ.. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన కార్యక్రమం ఈ ప్రభుత్వం మాత్రమే చేసింది. శ్రీ జగన్‌ కార్యక్రమాలు సాగుతుంటే.. చాలా ఆశ్చర్యం వేస్తోంది. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా బీసీల్లో  సుమారు 23 లక్షల మంది లబ్ది పొందితే.. రూ.6,471 కోట్లు బీసీ సామాజిక వర్గానికి అందాయి. ఎస్సీల్లో 88 లక్షల కుటుంబాలకు అర్హత ఉంటే.. దాంట్లో రూ.2,600 కోట్లు అందాయి. మైనార్టీలకు రూ.459 కోట్లు అందించటం జరిగింది. కాపులకు రూ.571 కోట్లు ఇతరులకు (ఓసీలకు) రూ.2,000 కోట్లు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా లబ్ది పొందారు. 

దళిత వర్గాలకు మేం ఉన్నామని ఆదుకున్న ప్రభుత్వం ఇదొక్కటే. అందువల్లే మనస్సున్న ప్రభుత్వమని అంటున్నాను. ప్రభుత్వం నుంచి నేరుగా ప్రజలకు లబ్ధి అందుతుంటే.. ఏమీ చేయలేక ప్రతిపక్షం నీచ రాజకీయాలు చేస్తోంది. ఎక్కడో దేవాయాలు జరిగితే.. దానిపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని దోషుల్ని శిక్షిస్తుంటే.. కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టాలని ప్రతిపక్షం వాడుకోవటం దిగజారుడు రాజకీయమే. 

 ఒక్కొక్క పథకం చూస్తుంటే.. వైయస్‌ఆర్‌ కాపునేస్తం, వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ పింఛను కానుక, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, మత్స్యకార భరోసా, జగనన్న వసతిదీవెన, జగనన్న విద్యాదీవెన, లా నేస్తం, జగనన్న చేదోడు, జగనన్న ఆసరా, ఇలా 28 కార్యక్రమాలు ద్వారా ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకుంది. 20 నెలల్లో సుమారుగా రూ.90 వేల కోట్లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. చరిత్రలో ఇలా చేసిన ఘనత శ్రీ జగన్‌ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. పేదవారికి సాయం జరుగుతుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం అండగా ఉందని భవిష్యత్‌లో మీకు దిక్కు ఉండదని ప్యూడల్‌ మనస్తత్వంతో ప్రతిపక్షానికి భయం కలుగుతుంది. మీలోని ఫ్యూడల్‌ మనస్తత్వం జెలసీ కలుగుతోందా? సామాన్యమైన కార్యకర్త ఫిజియోధెరిపిస్ట్‌ గురుమూర్తిని పట్టుకొని అవమానకరంగా మాట్లాడతారా? వృత్తులను అవమానించే ప్యూడల్‌ మనస్తత్వం నుంచి బయటపడింది. ఇలా వ్యక్తులను, వారి వృత్తులను అగౌరవపరుస్తూ మాట్లాడటం చాలా నీచం. 

హాస్పిటల్‌లో ఒక నర్సమ్మ కాన్పు జరిపి బిడ్డకు జన్మనిస్తే.. ఆమెను అవహేళన చేస్తారా? అది మానవతా దృక్పథంతో చేసి వృత్తి కాదా? డాక్టర్‌ తలనొప్పి వస్తే.. తల, చేయినొప్పి వస్తే.. చేయి పట్టుకుంటారు. అంత మాత్రాన డాక్టర్‌ను అవమానిస్తారా? మాదిగ కులంలో చెప్పులు కుడతారు. ఆత్మగౌరవంతో చేస్తారు. ఆ చెప్పులు కుట్టడం సమాజంలో మనిషికి నడక నేర్పిస్తున్నారు. పాదాల కందకుండా చెప్పులు కుట్టారు. ఎక్కడ ఉన్నాయి మీ ఆలోచనలు. ఏ శతాబ్ధాల క్రితం ఉన్నారు. గురుమూర్తి ఫిజియోధెరపీ చదువు చదువుకున్నారు. చేయి నొప్పి వస్తే.. చేతికి, కాలు నొప్పి వస్తే.. కాలికి వైద్యం చేస్తారు. మరి ఆ వృత్తిని అవహేళన చేస్తారా? శ్రీ జగన్‌ గారు మంచి అన్నది మాల అయితే.. ఆమాల నేను అవుతా అని చెప్పారు. అలాంటి హృదయం చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా? గురజాడ అప్పారావు చెప్పిన ఈ స్లోగన్‌ ఎప్పుడైనా చెప్పారా? మంచి అన్నది మాల అయితే.. ఆమాల నేను అవుతా అని శ్రీ జగన్‌ గారు ధైర్యంగా చెప్పారు. ఇంకా ప్యూడల్‌ సంస్కృతిలో ఉండి.. వృత్తులను అవహేళన చేస్తారా? దయచేసి ఫ్యూడల్‌ సంస్కృతి నుంచి బయటకు రండి. 

కరోనా సమయంలో ఆ కుటుంబాలను ఆదుకోవటం కోసం అనేక కార్యక్రమాలు శ్రీ జగన్‌ ప్రభుత్వం చేసింది. ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక తోడ్పాటు కల్పించి దయనీయ స్థితిని బయటపడేలా కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందించి. కరోనా పరిస్థితుల్లో బ్రాహ్మణ పూజారులు, అనేక మతాల్లోని మత పెద్దలను ఆదుకున్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరినీ ఆదుకున్నారు. వారికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి సీఎం  వైయ‌స్ జగన్‌ ఒక కుటుంబ పెద్దగా తోడున్నారు. 

దళితులు, పేదవర్గాలు నా ఆత్మబంధువు అని శ్రీ వైయ‌స్ జగన్‌ చెప్పారు. అలా పేద వర్గాలకు, దళిత వర్గాలకు ధైర్యం ఇచ్చే మాటలు ఎన్నడైనా చంద్రబాబు చెప్పారా. ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరిగితే.. పోలీసు అధికారులను అరెస్ట్‌ చేశారు. ఈ 70 ఏళ్లలో ఎప్పుడైనా పోలీసు అధికారిని అరెస్ట్‌ చేశారా. తప్పు చేస్తే.. పోలీసు అధికారులను అరెస్ట్‌ చేసిన సంఘటనలు చూశాం. ఏదో విదేశీ రిపోర్టులు పట్టుకొని ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతోందని చెబుతారా? రాష్ట్రంలో దళితులకు వేలాది సంవత్సరాలుగా అన్యాయం జరుగుతోంది. జ్యోతిరావుఫూలే, అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ వంటి మహానుభావులు కృషి చేశారు. మహాత్మాగాంధీ సేవలు చేశారు. అలాంటి వర్గాలు ఇంకా అస్పృశ్యులుగా ఉన్నారు. వారిని బయటవేయాలి. వారికి నేను అండగా ఉన్నానని సీఎం శ్రీ వైయ‌స్ జగన్‌ చెబితే.. మీకు కంటగింపుగా ఉందా. వారికి పనులు లేకపోతే ఆర్థికంగా ఉపాధి కల్పిస్తే.. మీకు రాజకీయంగా నష్టపోతామని భయమా? సంఘ సంస్కర్తగా సీఎం శ్రీ జగన్‌ వ్యవహరిస్తుంటే ప్రతిపక్షాలకు బాధకలుగుతోందా? దయచేసి వృత్తులను అవమానించేలా మాట్లాడవద్దు. ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడితే రాజకీయాల్లో వాంఛనీయం కాదు. ఇవన్నీ ఫ్యూడల్‌ ఆలోచనలే. తద్వారా వెనక్కి వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై కాకుండా మతాలను, కులాలను రెచ్చగొట్టడం సరికాదు. 

ఒక చదువుకున్న వ్యక్తి, డాక్టర్, ఫిజియోధెరపిస్ట్‌ గురుమూర్తి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఎంపీ టిక్కెట్‌ ఇస్తే మీకు ఎందుకు అంత బాధ? గురుమూర్తి దళిత కుటుంబంలో పుట్టి డాక్టర్‌ అయి వైద్యం అందిస్తుంటే మీకు ఎందుకు అంత బాధ. ప్రజాసేవ చేయటానికి పనికిరారా. దయచేసి ఫ్యూడల్‌ ఆలోచనల నుంచి ప్రతిపక్షాలు బయటకు రావాలి. ఫ్యాన్‌ గుర్తుపై  ఓటేసి గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లను మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ కోరారు. 

Back to Top