తాడేపల్లి: మిర్చి అమ్మకాలు ప్రారంభమైన రెండు నెలల తర్వాత వ్యాపారులను వివరాలు అడగడం చూస్తుంటే కాలయాపన చేసి దళారులకు లాభం చేకూర్చాలన్నది ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్టుగా రూ.11,781 మద్దతు ధరకు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క టిక్కీ మిర్చి అయినా కొన్నారా? అని ప్రశ్నించిన ఆయన, మిర్చి రైతులకు మద్దతు ధర ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వైయస్ జగన్ చొరవ చూపకపోయి ఉంటే చంద్రబాబు కనీసం కేంద్రానికి లేఖ కూడా రాసే వాడు కాదని గుర్తు చేశారు. గత ఏడాది రూ. 27వేల వరకు పలికిన మిర్చికి ఇప్పుడు కనీసం రూ.10 వేల కూడా పలకడం లేదని, రైతులు అప్పుల బాధలు భరించలేక కల్లాల వద్దే తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్న పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నా చంద్రబాబు మనసు కరగడం లేదని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోంది? అన్న విషయం అర్ధం కావడం లేదన్న లేళ్ల అప్పిరెడ్డి, మిర్చి ధరలు దారుణంగా పతనమై రైతులు అల్లాడుతున్నారని, అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడం హేయమని అన్నారు. రైతు సమస్యలపై రాజకీయాలు చేయడం ప్రభుత్వానికి తగదని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి తేల్చి చెప్పారు. అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: వైయస్ జగన్‌గారు కదిలాకే..: రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయ్యాక తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కాక రైతులు దీనావస్థలోకి వెళ్లిపోయారు. తరతరాలుగా సాగు మీద ఆధారపడిన కుటుంబాలు కాడె వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మిర్చి రైతులు పడుతున్న కష్టాలు శతృవులకు కూడా కన్నీళ్లు తెప్పించేలా ఉంటే చంద్రబాబు మాత్రం వారిని ఆదుకోవాలన్న ఆలోచన చేయకపోవడం దుర్మార్గం. రైతాంగాన్ని ఆదుకోవడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించక పోవడంతో అప్పులు తీర్చడానికి దళారులు చెప్పిన ధరకి పంటను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.22 వేల నుంచి రూ.27 వేల వరకు అమ్మితే, ఇప్పుడు కనీసం రూ.10 వేలు కూడా పలకడం లేదు. రైతుల సమస్యలు పట్టించుకోకుండా మొద్దు నిద్రలో తూగుతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పి రైతుల్లో మనోధైర్యం నింపేందుకు మా నాయకుడు వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించి నేరుగా రైతులతో మాట్లాడారు. అప్పుడు కానీ చంద్రబాబులో చలనం రాలేదు. మద్దతు ధర పేరుతో సమీక్షలంటూ చంద్రబాబు కాలక్షేపం చేశారు. కేంద్ర మంత్రికి లేఖ, ఢిల్లీ టూర్‌తో హడావుడి చేశారు తప్ప, మిర్చి రైతులకు నిజంగా న్యాయం చేసే దిశలో ఏ చర్యా తీసుకోలేదు. ధరల స్థిరీకరణ నిధి పదో వంతు: మార్కెట్‌లో పంటల ధరలు పతనమైతే, రైతులను ఆదుకోవడం కోసం గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు రైతులకు అండగా నిల్చింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధిగా కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించడం, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ధరల స్థిరీకరణ నిధి కింద వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కేటాయించిన దాంట్లో పదో వంతు ఇప్పుడు కేటాయించడం అత్యంత దారుణం. లెక్కలు లేవనడం సిగ్గుచేటు: ప్రభుత్వం వద్ద భారీ యంత్రాంగం ఉంచుకుని, కొనుగోలు చేసిన సరకుకు సంబంధించిన వివరాలు కావాలని వ్యాపారులను అడగడం కన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉండదు. ఈక్రాప్ లెక్కలు ఏమయ్యాయి? చెక్ పోస్టుల దగ్గర నమోదు చేసిన వివరాలు ఏమయ్యాయి? ఇంకా సరుకు అమ్మకం కోసం వచ్చినప్పుడు మిర్చి యార్డు గేటు దగ్గర వివరాలు నమోదు చేస్తారు. రైతులు సరుకు అమ్మిన తర్వాత పేమెంట్ కాపీలిస్తారు. ఈ సమాచారం మొత్తం ప్రభుత్వం దగ్గర లేనట్టు వ్యాపారులను వివరాలు అడగడం కాలయాపన పేరుతో మిర్చి రైతుల్ని వంచించడమే అవుతుంది. జనవరి నుంచి మిర్చి సీజన్ ప్రారంభమై రోజూ లక్షన్నరకు పైగా బస్తాలు గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటుంటే రెండు నెలల తర్వాత లెక్కలు అడగడం.. దళారులకు లాభం చేకూర్చడానికి కాదా? రైతు సమస్యలపై రాజకీయం వద్దు: మిర్చి ధరలపై చర్చకు శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చాం. అయితే ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం సిగ్గుచేటు. రైతు సమస్యలనూ రాజకీయం చేయడం ఏ మాత్రం సరికాదు. గుంటూరు మిర్చి యార్డులో ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 150 కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయి. వాటిల్లో 1.30 కోట్ల బస్తాలున్నాయి. ఇంత గొప్ప చరిత్ర ఉన్న గుంటూరు మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం దారుణమని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.