ఫేక్‌ పట్టా భూములన్నీ స్వాధీనం చేసుకోవాల్సిందే..!

  కలెక్టర్‌ను  కోరిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  
 

అనంతపురం:  నగరం చుట్టూ వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఫేక్‌ పట్టాలతో గత అనేక సంవత్సరాలుగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సిందేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ గౌతమిని ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఫేక్‌ పట్టాలపై త్వరితగతిన విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేయించాలన్నారు. ఆన్‌లైన్‌  విధానం వచ్చిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెవెన్యూ వాళ్లను లోబరుచుకుని ప్రభుత్వ భూములను కబ్జా కోరులు చేతుల్లోకి తీసుకున్నారు. వాటన్నింటిపై విచారించాలని కోరాం. ప్రత్యేకంగా మిల్ట్రీ పట్టాల పేరుతో ఫేక్‌ డాక్యుమెంట్లను సృష్టించి భూములు కబ్జా చేశారు. 2012లో ఆన్‌లైన్‌ విధానం వస్తే అప్పుడెక్కడా ఈ భూములు ఆన్‌లైన్‌లో ఎక్కించలేదు. 2014 నుంచి 2018 మధ్య ఆన్‌లైన్‌లో ఎక్కించారు. రెవెన్యూ రికార్డుల్లో ఖాలీగా ఉన్నచోట్ల పదేళ్ల కిందట పట్టాలిచ్చినట్లు ఎక్కించడం, ఆ తర్వాత ఆన్‌లైన్‌ చేయడం ఆ వెంటనే అమ్ముకోవడం చేశారు. ఇలాంటి కేసులను 23 గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫేక్‌ పట్టాల పై విజిలెన్స్‌తో విచారించాలంటూ చివరకు అసెంబ్లీలో కూడా మాట్లాడాను. కక్కలపల్లి కాలనీ, పాపంపేట, కొడిమి, రాచానపల్లి, అక్కంపల్లి, కురుగుంట, చిన్మయానగర్, ప్రసన్నాయపల్లి, రాప్తాడు, ఆకుతోటపల్లి, సోములదొడ్డి ప్రాంతాల్లో వేలాదిమంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలోనూ అర్హత ఉన్నవారు వేలసంఖ్యలో ఉన్నా పట్టాలు లేని కారణంగా ఇళ్లు మంజూరైనా కట్టుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఇటీవల సీఎం నార్పల పర్యటనకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లా. 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరా. అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కు తీసుకుంటే పైసా ఖర్చు లేకుండా పేదలందరికీ ఇంటిపట్టాలు ఇవ్వొచ్చని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Back to Top