విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, రానున్న 20 -30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డే కొనసాగుతారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు 11 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ నుంచి ధర్మసాగరం వరకు 2 కోట్ల 50 లక్షలు రూపాయలతో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మంజూరు చేశారన్నారు. ఇప్పటికే కొన్ని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయని, మరికొన్ని పనులు ఈ నెల 10వ తేదీన టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ నుండి ధర్మసాగరం వరకు ఆరు కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రెండు కోట్ల యాభై లక్షలు, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ నుండి గబ్బాడ వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు, నర్సీపట్నం నుండి బెన్నవరం వరకు 4.4 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి కోటి యాభై ఒక్క లక్షలు, బుచ్చింపేట నుండి కె ఆర్ సి పురం వరకు రోడ్డు అభివృద్ధికి 65 లక్షలు, నర్సీపట్నం సి బి ఎం కాంపౌండ్ నుండి డిగ్రీ కాలేజీ వరకు ఒక కిలోమీటరు రోడ్డు అభివృద్ధికి ఒక కోటి 50 లక్షలు, భయపురెడ్డి పాలెం వంతెన నుండి ఎరకన్నపాలెం వరకు 6.6 కిలోమీటర్లకు కోటి అరవై ఎనిమిది లక్షలు, ఎరకన్నపాలెం నుండి బంగారయ్య పేట వరకు మూడు కిలోమీటర్లు రోడ్డు అభివృద్ధికి ఒక కోటి పది లక్షలు, మంజూరయ్యాయని, కొన్ని పనులు ప్రారంభించారని, కొన్ని పనులు టెండర్లు పూర్తి కాగానే ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. పదిహేను కోట్ల రూపాయల విలువైన ఎన్ఆర్ఈజీఎస్ పనులు ఈ నెలలో పూర్తవుతాయని ఆయన తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల పాలనలో ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికే సుమారు 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందన్నారు.