తాడేపల్లి: దళిత ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేయించడం చంద్రబాబు ఆకృత్యాలకు, లోకేష్ పిల్ల చేష్టలకు పరాకాష్ట అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. దాడి వెనక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మొన్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నిన్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నేడు ఎంపీ నందిగం సురేష్.. రాజధాని ఉద్యమం పేరుతో అధికార పక్ష దళిత ప్రజాప్రతినిధులపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రికి వెళ్లి వస్తున్న ఎంపీ నందిగం సురేష్‌పై పెయిడ్ వర్కర్స్‌తో దాడి చేయించడం హేయమని, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మంగళగిరిలో ఓటమికి దళితులే కారణమనే నెపంతో లోకేష్ దాడులు చేయిస్తున్నాడన్నారు.
చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకుల ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు వైయస్‌ఆర్ సీపీ నాయకులు ఎవరూ భయపడరని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున హెచ్చరించారు. పోరాటం చేయడం మా నాయకుడు వైయస్ జగన్ నేర్పారని, పదేళ్ల ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశామని, పోరాటం మా నాయకుడు వైయస్ జగన్ నుంచి నేర్చుకున్నామన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన కోటరీ దళితుల అసైన్డ్ భూములను బెదిరించి లాక్కున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని, చట్టాలు కూడా తెలియని నీచమైన నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. దళితులకు సంబంధించిన చట్టాలు అసెంబ్లీలో వస్తుంటే చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయాడని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ విభజనపై చర్చ జరుగుతుంటే సభ నుంచి పారిపోయాడన్నారు. అంటరానితనం చంద్రబాబు మదిలో, ఆలోచనలో ఉందన్నారు. కుట్ర ప్రకారమే చంద్రబాబు, ఆయన గ్యాంగ్ దళితులను టార్గెట్ చేశారన్నారు.
రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎనిమిది నెలలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌జగన్ పాలన కుల, మత, ప్రాంత, వర్గ, చివరకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం వరకు 95 శాతం పెన్షన్లు అందజేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. ఎనిమిది నెలల్లోనే 2 కోట్ల మంది బడుగు, బలహీనవర్గాలకు ఉపయోగాలు జరుగుతున్నాయన్నారు. శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాలను పరిశీలించి, అనేక అధ్యయనాల తర్వాత సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజల బాగు కోసం సీఎం వైయస్ జగన్ పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం అమరావతిలో కొనుగోలు చేసిన భూముల కోసం పెయిడ్ ఉద్యమం చేస్తున్నాడన్నారు.