రాజమండ్రి: పవన్-చంద్రబాబుది ఇన్నాళ్లూ ప్యాకేజీ బంధం - ఇప్పుడు పొత్తు బంధమా..? అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రశ్నించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందంటూ పవన్‌కళ్యాణ్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎందుకంటే, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ఈ రోజు ఇలా కొత్తగా చెబుతున్నాడేంటని అందరూ నవ్వు కుంటున్నారు. ఆయన సొంత పుత్రుడు లోకేశ్ మీడియా ముందుకొచ్చి చంద్రబాబుకు నేను మద్ధతు పలుకుతున్నాను.. నా ఓటు తెలుగుదేశం పార్టీకే అని.. అంటే ఎంత కామెడీగా ఉంటుందో.. ఇప్పుడు దత్తపుత్రుడి మాటలూ అంతే జోక్‌గా ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమండ్రిలో గురువారం మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌మెయిలింగ్‌కు సరైన టైమ్ అని..ః పవన్‌కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత మాట్లాడిన మాటల్ని చూస్తే.. ఒక విషయం స్పష్టమైంది. తన ప్యాకేజీ పెంపునకు చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి ఇంతకన్నా సరైన సమయం దొరకదనకున్నాడు. అందుకే, రేపటి ఎన్నికల్లో నీకూ-నాకూ లాభం జరగాలంటే, ఇద్దరం కలిసి పోటీచేసే ప్రతిపాదనతో తన ప్యాకేజీ విలువను పెంచుకున్నాడు. ప్రశ్నిస్తానన్న ప్యాకేజీస్టార్‌ను ఆనాడే నమ్మలేదుః పవన్‌కళ్యాణ్ రాజకీయప్రస్థానం చూస్తే.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రత్యక్షంగా సపోర్టు చేసి ఆయనకు మేలు చేయడానికే ఉన్నానంటూ జనసేన పార్టీ పెట్టాడు. ఏ ఒక్కర్నీ జనసేన తరఫున ఎన్నికల్లో పోటీకి దించకుండా పూర్తిగా తాను, తన కేడర్ బాబు కోసం పనిచేసి అధికారం లోకి తెచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు తాను ప్రకటించిన ఎన్నికల వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్నీ అమలు చేయకుండా.. ఏకంగా టీడీపీ వెబ్‌సైట్ నుంచే మానిఫెస్టోను తొలగించారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌తో పాటు వారి కేబినెట్ లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సాధారణ పార్టీ కార్యకర్త వరకు ప్రభుత్వ ఖజానా సొమ్మును దోచుకుని పంచుకుని దాచుకున్న విషయం అందరం గమనించాం. అప్పట్లో బాబు అవినీతిని ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్ పూర్తి నిద్రమత్తులో జోగాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలొచ్చేసరికి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని.. ఆ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే వ్యూహం పన్నాడు. జనసేన అనేది టీడీపీకి వ్యతిరేకమన్నట్లు ఒక సూత్రీకరణతో ప్రజల్ని నమ్మించాలని చూశాడు. కానీ, ప్రజలు మాత్రం పవన్‌కళ్యాణ్ నిజస్వరూపాన్ని అప్పటికే గమనించి అర్ధం చేసుకోవడంతో ఆయన మాటల్ని ఎవరూ నమ్మలేదు. టీడీపీ, జనసేనను చిత్తుచిత్తుగా ఓడించాయి. వైఎస్‌ఆర్‌సీపీకి అనూహ్యమైన భారీ మెజార్టీ కల్పించి రాష్ట్రవ్యాప్తంగా 151 స్థానాల్లో విజయాన్ని అందించారు. దొంగలా బాబు జైలుకెళ్తే.. నీకెందుకు కడుపుమంట..?ః మరలా ఇప్పుడు 2024 ఎన్నికల వ్యూహంలో పవన్‌కళ్యాణ్ నోటివెంట జనసేన, టీడీపీ పొత్తు అనే మాట వినిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన్ను ఆత్మపరిశీలన చేసుకోవాలని చెబుతున్నాను. ఇన్నాళ్లూ ప్రజలు నీ సినిమాలు చూసి హీరోగా పవర్‌స్టార్ అని పిలుచుకున్నారు. ఇప్పుడేమో రాజకీయాల్లో నువ్వొక ప్యాకేజీ-పొత్తుస్టార్ అంటూ పొలిటికల్ కమెడియన్‌గా చూస్తున్నారు. అసలు చంద్రబాబు మీద నీకంత ప్రేమేంటి..? ఆయనకూ నీకూ ఉన్న లాలూచీ ఏంటి..? అవినీతి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకుని ఆధారాలతో సహా దొరికిన ఒక దొంగను నువ్వెలా సమర్ధిస్తావు..? ఆయన ఎమన్నా దేశం కోసం పోరాడి జైలుకు వెళ్లాడా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెడ్‌హేండెడ్‌గా దొరికిన ఒక అవినీతిపరుడ్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేస్తే ప్రభుత్వంపై నీకంత కడుపుమంటేంటి.? ఎందుకు ప్రభుత్వం మీద పడి అంత ఊగిపోతున్నావని అడుగుతున్నాను. ఏదో దేశభక్తుడ్ని జైల్లో పెడితే.. ఆయనకు మద్ధతుపలికేందుకు వచ్చినట్టు నువ్వు బిల్డప్ ఇవ్వడం అవసరమా..? చంద్రబాబు కుంభకోణాలకు బాధ్యుడు కనుకే జైలుకొచ్చాడని అర్ధం చేసుకోకుండా.. నువ్వెందుకు దిగజారి మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు సమాధానం చెప్పాలి. కాపులకు ద్రోహం తలపెట్టే కుట్రః పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకొచ్చి చంద్రబాబుకు దఫదఫాలుగా సపోర్టు చేయడంలో యువతకు మేలు చేసే లక్ష్యం కనిపించడంలేదు. సమాజానికి మంచి చేసే సిద్ధాంతం కూడా ఆయన పార్టీ జనసేనలో లేదు. ఇక, కాపుల్ని పూర్తిగా ద్రోహం చేసేందుకే, బాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేందుకే ఆయన పనిచేస్తున్నాడనే కుట్ర కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడి పొత్తులో రాష్ట్రమొత్తం పర్యటించారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి రూ.5 కోట్లు చొప్పున కాపులకు సంక్షేమాన్ని అందిస్తామని చంద్రబాబు హామీనిచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోలేదని ప్రశ్నించిన పాపానికి ఆనాడు ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని బూతులు తిడుతూ బూటు కాళ్లతో తన్నుతూ శారీరకంగా, మానసికంగా వేధించి చిత్రహింసలకు గురిచేసి రోడ్డుమీద నిలబెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. మరి, ఆ సమయంలో చంద్రబాబును నువ్వెందుకు నిలదీయలేదు..? ఇవన్నీ పక్కనబెట్టి మరలా ఆయనతోనే కలిసి ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచన ఎలా కలిగిందని ప్రతీ ఒక్క కాపు సోదరుడు నిన్ను నిలదీసే పరిస్థితి ఉంది. జనసేన నాయకులు, కార్యకర్తల్లోనూ ఈరోజు నీ మాటలతో కళ్లుతెరుచుకున్నాయి. నీలాంటి దుర్మార్గమైన వ్యక్తిని ఇన్నాళ్లూ మా నాయకుడిగా భావించామా..? జనసేన జెండాను ఎందుకు మోశామని వాళ్లంతా బాధపడుతున్నారు. పార్టనర్‌గా పవన్‌కళ్యాణ్ ఆందోళనా..?ః 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పార్టనర్‌గా పవన్‌కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడేమో అప్పట్లో జరిగిన కుంభకోణాలకు సంబంధించే చంద్రబాబు జైలుపాలయ్యాడు. మరి, ఆయన దోచుకున్న అవినీతి సొమ్ములో పవన్‌కళ్యాణ్‌కు కూడా వాటాలున్నాయని.. తనకేమైనా జరగరానిది జరుగుతుందనే ఆందోళనలో పవన్‌కళ్యాణ్ ఉన్నాడేమో. రాజకీయాలంటే సినిమా షూటింగులు కాదని ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఆయన పిలుపునిస్తే ఉన్నపళంగా ఏదో జరిగిపోతుందని.. ఈ ప్రభుత్వం పడిపోతుందనే భ్రమల్ని వీడి నేలమీద నిలబడి మాట్లాడితే మంచిదని చెబుతున్నాను.