క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు భేష్‌

కరోనా అంటే భయం వద్దు ... ధైర్యంగా ఉండాలి..

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం: కరోనా మహమ్మారిని నివారించుటకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన చ‌ర్య‌లు అద్భుత‌మ‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని దేశంలోని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. బుధవారం త‌న‌ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. కరోనా అంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని, వాస్తవానికి కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదని, ఎవరు భయానక వాతావరణం సృష్టించవద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో భయపడేంత పరిస్థితులు లేవని ప్రసాదరావు స్పష్టం చేశారు. అందరూ సమష్టిగా పని చేయడం ద్వారా ఈ మహమ్మారిని పారద్రోల వచ్చుని పేర్కొన్నారు.
 ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు - అన్ని వర్గాలు ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు సాగడం ద్వారా మహమ్మారిని మట్టు పెట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఒకరి వైఫల్యాలను మరొకరు వేలెత్తి చూపడం ద్వారా ప్రయోజనం ఉండదని ఇటువంటి సందర్భంలో ఒకరికొకరు సహకరించుకోవాలని ఆయన హితవు పలికారు.  
 శ్రీకాకుళం జిల్లాలో సైతం జిల్లా యంత్రాంగం మంచి చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే ప్రశంసించారు. కరోనా బాధితులు తమ సహాయార్థం 104 నెంబర్ కు ఫోన్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 104 ఫోన్ చేయడం ద్వారా తక్షణ వైద్య సేవలు అందుబాటులోకి వస్తుందని, అవసరమైన సూచనలు సలహాలను వైద్యులు అందిస్తారని ఆయన పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి ఇంటివద్దకే మందుల పంపిణీ చేయడం జరుగుతుందని  తెలిపారు. 

ఆసుపత్రుల సమాచారం, కోవిడ్ బాధితులు తీసుకోవలసిన జాగ్రత్తలను 104 ఫోన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చ ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా భయపడి బ్లాక్ మార్కెట్ ల వైపు ఇంజక్షన్లు, మందుల కొరకు పరుగు పెట్టాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అవసరం మేరకు మాత్రమే మందులను, ఇంజెక్షన్లను వినియోగించాలని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. వేడుకలు, జాతులకు ప్రభుత్వం సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రులు, కోవిడ్ కేంద్రాల్లోనూ చికిత్స పొందుతున్న వారికి నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

వ్యాక్సినేషన్ ద్వారా కోవిడ్ కు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొంటూ వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్దఎత్తున జరుగుతోందని ఆయన తెలిపారు. ఆక్సిజన్ కొరత లేదని ఆయన పేర్కొంటూ ఆక్సిజన్ కొరత ఉందని భయానక పరిస్థితులు సృష్టించవద్దని ఆయన కోరారు. ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా కరోనా బాధితులు చర్యలు చేపట్టాలని, కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు. 

జిల్లాలో కోవిడ్ యాజమాన్యానికి ప్రతి విభాగానికి ఒక్కో అధికారిని నియమించడం జరిగిందని, కోవిడ్ ఆసుపత్రులలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి ఒక్కో అధికారిని బాధ్యులుగా నియమించారని ఆయన చెప్పారు. చికిత్స పొందుతున్న వారి వివరాలకు కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని ఆయన సూచించారు. జిల్లాలో 14 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సకు సిద్ధం చేసారని ఆయన పేర్కొన్నారు. 18 వందల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధం చేయగా, రెండు కోవిడ్ కేర్ కేంద్రాల్లో 2,758 పడకలు సిద్ధం చేసారని ఆయన వివరించారు. ఇప్పటికి 823 మంది వైద్యులు, సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లాలో 3,30,237 మంది మంగళ వారం నాటికి టీకా వేయించుకున్నారని  అందులో కోవాక్సిన్ మొదటి డోస్ 39,544 మంది, రెండవ డోస్ 8,261 మంది వెరసి 47,805 మంది వేయించుకోగా., కోవీషీల్డు టీకాను మొదటి డోస్ 2,26,260 మంది, రెండవ డోస్ 56,172 మంది వెరసి 2,82,432 మంది వేయించుకున్నారని ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వివరించారు.

Back to Top