బాబు, యనమల దోపిడీ త్వరలో బయటపెడతాం

లూలూ గ్రూప్‌ ఓ షాపింగ్‌ మాల్‌ లాంటిది

ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా

తూర్పుగోదావరి: రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపీడి చేసి ఇప్పుడు యనమల రామకృష్ణుడు నీతులు చెబుతున్నాడని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ..  అమరావతిలో యనమలతో పాటుగా ఆయన సోదరుడు, అల్లుడు భూములు కొన్నారని, ప్రజాధనాన్ని యనమల, చంద్రబాబు కలిసి ఏలా దోచుకున్నారో త్వరలోనే బయటపెడతామన్నారు. విశాఖలో పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌ అని పెట్టి టీడీపీ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు బస చేసిన ఒక్కో హోటల్‌కు రూ. 250 నుంచి రూ.300 కోట్లు చెల్లించారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ ఎక్కడ వచ్చిందో యనమల చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేవలం ఫిషింగ్‌ సెక్టార్‌లో డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ వచ్చిందని, ఆ సెక్టార్‌లో వచ్చిన గ్రోత్‌ను అన్ని సెక్టార్లలో వచ్చినట్లు మీడియాతో ప్రచారం చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలూ గ్రూప్‌ అనేది ఓ షాపింగ్‌ మాల్‌ లాంటిదని, ఐదువందల మందికి కూడా ఆ కంపెనీలో ఉద్యోగాలు రావని రాజా విమర్శించారు. అటువంటి షాపింగ్‌ మాల్‌కు రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైజాగ్‌లో పర్యటిస్తే వేలాది మంది వచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబులా తాము పేయిడ్‌ ఆర్టిస్టులను తెచ్చుకోమని రాజా అన్నారు.

 

Back to Top