వినుకొండ: లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో రూ.2400 కోట్లతో వినుకొండను అభివృద్ధి చేశామని చెబుతున్నాడు.. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చుపెట్టాడో చెప్పాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండు చేశారు. అందులో లోకేష్ వాటా ఎంతో ప్రజలకు చెప్పాలన్నారు. లోకేష్‌కు దమ్ముంటే వినుకొండలో పోటీ చేసి తనపై గెలవాలంటూ బ్రహ్మనాయుడు సవాల్ చేశారు. లోకేష్ యువ గళం పాదయాత్ర పేరుతో అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నాడని.. యువతను రెచ్చగొట్టి పోలీస్ కేసులలో ఇరికిస్తున్నాడని ఆయన విమర్శించారు.
వినుకొండ ప్రజలకు తాగునీరు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజలకు తాగునీరు పేరుతో కోట్ల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు పెట్టామని దోచుకున్న లెక్కల వివరాలు చెప్పాలన్నారు. అడ్డదారిలో ముఖ్యమంత్రిగా, మంత్రిగా అవతరించిన చంద్రబాబు, లోకేష్‌లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు తన కుటుంబ సభ్యుల బినామీల పేరుతో వినుకొండ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించారని, వినుకొండ సమీపంలో సర్వే నంబరు 251, 253 ,249 నెంబర్లలో ఎన్ఎస్పీ పంటకాల్వను ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మించారని ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవీ అక్రమాలపై విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.