పేదలకు మంచి చేస్తుంటే ఓర్వలేరా?

సంక్షేమాన్ని అడ్డుకుంటున్న చంద్రబాబు

ఎన్నికల్లో ఓడించినా బుద్ధి రాలేదా?

మౌనంగా ఉంటే మరింత రెచ్చిపోతారు

టీడీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి

సీఎంగా వైయస్ జగన్‌ ఉన్నంత వరకు సంక్షేమం ఆగదు

 ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టీకరణ

 వైయస్‌ఆర్‌ ఆసరా లబ్ధిదారులకు మెగా చెక్‌ పంపిణీ

అనంతపురం : పేద ప్రజలకు మంచి జరుగుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ ఎందుకు ఓర్వలేకపోతున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ప్రశ్నించారు. ప్రజలు సంతోషంగా ఉండడం వారికి ఇష్టం లేదా? అని అన్నారు. అనంతపురం నియోజకవర్గ పరిధిలోని ఎ.నారాయణపురం పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం ఎంపీ రంగయ్యతో కలిసి రెండో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా లబ్ధిదారులకు మెగా చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ 2014లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అంతా భావించారని, కానీ ఐదేళ్లు అస్తవ్యస్త పాలన చేశారన్నారు. ఎన్నికల సమయంలో మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తీరా ముఖ్యమంత్రి అయ్యాక మహిళలను మోసం చేశారని తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సమయంలో ఎన్నికల నాటికి ఉన్న రుణాలను నాలుగు విడతల్లో ఇస్తామని మాట ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు రెండు విడతలుగా ‘వైయస్‌ఆర్‌ ఆసరా’ అందించినట్లు చెప్పారు. రెండో విడతలో జిల్లాలో రూ.455 కోట్లను వైఎస్‌ఆర్‌ ఆసరా కింద అందజేస్తే.. ఎ.నారాయణపురం, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ, రూరల్‌ పంచాయతీల్లోని 558 సంఘాలకు రూ.5 కోట్ల 13 లక్షల 68 వేలను అందజేసినట్లు చెప్పారు. మొదటి, రెండు విడతల్లో రూ.10 కోట్ల 27 లక్షలకు పైగా అందజేశామన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత కింద ఏటా రూ.17,500 అందజేస్తూ మహిళల జీవితాల్లో వెలుగు నింపుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగితే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని గ్రహించి అడుగడుగునా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను సృష్టించుకున్నారని, ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకుని సైంధవుడిలా అడ్డుపుడుతున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను తల్లుల ఖాతాల్లో వేస్తున్నా కోర్టులకు వెళ్తున్నారన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేశామని తెలిపారు. అనంతపురం నియోజకవర్గంలో 28 వేల మందికి పట్టాలు ఇచ్చామని, ఇంకా అర్హులుంటే 90 రోజుల్లోనే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రూ.1.80 లక్షలు ఇవ్వడమే కాకుండా రుణ సదుపాయం కల్పించామని, పేదల కోసం ఇంత చేస్తుంటే వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబు కుట్రలను గమనించాలని కోరారు. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని, తమకు ఓటు చేయని వాళ్లకు సంక్షేమం ఎందుకు అందాలి? అనే భావన చంద్రబాబులో ఉందన్నారు. ప్రజలు మౌనం వహిస్తే ఇంకా రెచ్చిపోతారని, వారి కుట్రలను మీరే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు.

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
వైఎస్‌ఆర్‌ ఆసరాకు తోడు చేయూత పథకాల కింద ఇస్తున్న డబ్బుతో మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే అనంత  అన్నారు. గేదెలు పెట్టుకుని పాల వ్యాపారం చేసుకోవాలని, ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. దుస్తులు, కిరాణా వ్యాపారం చేసుకోవాలని.. డబ్బును వృథా చేసుకోవద్దని తెలిపారు. ‘‘కేవలం సంక్షేమమేనా? అభివృద్ధి ఏదీ? అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతి ఊరిలో స్కూళ్లు బాగుపడ్డాయి.. ఆస్పత్రులు అభివృద్ధి చేస్తున్నాం. సచివాలయాలు అందుబాటులోకి తెచ్చి 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం. అనంతపురం ప్రభుత్వ సర్వజన్పాత్రి విస్తరణ చేస్తున్నాం. మాతాశిశువుకు మెరుగైన వైద్యం కోసం ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా? ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశీస్సులతో నాలుగు పంచాయతీల్లోనే రెండేళ్లలో రూ.20 కోట్లకు పైగా నిధులతో రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర పనులు చేశాం. ఇది అభివృద్ధి కాదా?’’ అని ఎమ్మెల్యే అనంత ప్రశ్నించారు. ఏదైతే చేయగలమో అది మాత్రమే చెప్పాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ తరచూ చెబుతుంటారని, అందుకు అనుగుణంగానే తామిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. ప్రజలు మరింత చైతన్యవంతులై ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడుతూ పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు, ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.

Back to Top