నిమ్మగడ్డ మౌనం బాబు కుట్రలో భాగమేనా..?

లేఖపై ఈసీ రమేష్‌కుమార్‌ ఎందుకు స్పందించడం లేదు

రాజ్యాంగ వ్యవస్థలో ఉండి ఇలా వ్యవహరించడం దారుణం

మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలు జరపడం రాక్షసత్వ ఆర్డినెన్సా..?

ధృవీకరణ లేకపోయినా పత్రికలు ప్రచురిస్తాయా..?

ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే బాబు, రమేష్‌కుమార్‌ల కుట్ర

ఈసీ రమేష్‌కుమార్‌కు రెండంచెల భద్రత పెంచాం

లేఖపై నిజానిజాలు తేల్చాలని డీజీపీని కోరాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

 

తాడేపల్లి: ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇలా డ్రామాలు ఆడడం ధర్మమేనా..? రక్షణ కల్పించాలని ఈసీ రమేష్‌కుమార్‌ పేరుతో నిన్నటి నుంచి లెటర్‌ చక్కర్లు కొడుతుంటే దానిపై స్పందించాల్సిన బాధ్యత ఆయనకు లేదా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. లెటర్‌పై నిజానిజాలు తేల్చాలని డీజీపీని కోరామని వివరించారు. నిమ్మగడ్డ మౌనం చంద్రబాబు కుట్రలో భాగమేనా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే చంద్రబాబు, రమేష్‌కుమార్‌ల కుట్రగా భావిస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో డీజీపీని కలిసిన ఎమ్మెల్యేల బృందం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ..
 
సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన తరువాత కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే స్టేట్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు ఐదు పేజీల లేఖ రాశారని, అది వారికి చేరిందని మీడియాలో, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఆ తరువాత అదే మీడియా ఫేక్‌ లెటర్‌ అని మళ్లీ ప్రచారం చేసింది. తరువాత పత్రికా విలేకర్లు కొంతమంది రమేష్‌కుమార్‌ ఆఫీస్‌ నుంచి బయటకు వస్తున్న తరుణంలో లేఖ గురించి అడిగితే.. తాను రాయలేదని చెప్పినట్లుగా తెలిసింది.

నిన్నటి నుంచి దీన్ని పూర్తిగా పరిశీలన చేస్తూ వచ్చాం. ఇదొక పెద్ద కుట్రలో భాగంగానే అర్థం అవుతుంది. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఓటమి పాలైన తరువాత ప్రభుత్వం మీద ఏదో విధంగా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే దుర్బుద్ధితో ప్రతిక్షణం అడ్డుతగులుతున్నారు.

ఏ కార్యక్రమం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏదో విధంగా అడ్డుకోవాలనే తాపత్రయంతో రాజ్యాంగ వ్యవస్థలను సైతం ఉపయోగించుకుంటున్నాడు. నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా..? లేక చంద్రబాబు లాంటి దుర్మార్గపు నాయకుడు చేసే పనులకు ప్రజాస్వామ్యమే తలవంచాలా అనిపిస్తుంది. అధికారం కోసం ఎంతటికైనా బాబు దిగజారుతాడని చరిత్రే చెబుతుంది.

ఈ రోజు ఈసీ లేఖపై డీజీపీని కలిశాం. ప్రజలు, ప్రభుత్వం చాలా సందిగ్ధంలో ఉన్నారు. నిమ్మగడ్డ రాశారా.. లేదా..? ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో మొదటి పేజీల్లోనే అంతా రాశారు. చివర్లో ఆ పత్రికలు ఇది ఇంకా రమేష్‌కుమార్‌ ధృవపర్చలేదని చిన్నగా వేసింది.

తెలియని లెటర్‌ను ఫ్రంట్‌ పేజీలో ముద్రించి ప్రభుత్వాన్ని, సీఎం వైయస్‌ జగన్‌ను, పోలీసులను అబాసుపాలు చేయడం కాదా..? పచ్చి రాజకీయం లేఖలో ఇముడజింపజేశారు. రమేష్‌బాబు లెటర్‌లో రాక్షసత్వంతో కూడిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఉంది. మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలు జరపడం రాక్షసత్వంతో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ అని ఎన్నికల కమిషన్‌ ఎలా చెబుతుంది. ఇది రాజకీయ నాయకుడు రాసిన లేఖ అని స్పష్టంగా అర్థం అవుతుంది.

రాష్ట్రంలో ఇంత గందరగోళం జరుగుతుంటే రమేష్‌కుమార్‌ విమానం ఎక్కి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. లేఖ రాశారో.. లేదో.. ఎందుకు చెప్పడం లేదు. ఎందుకు మౌనం. చంద్రబాబు వేసిన కుట్రలో ఈ మౌనం ఒక భాగం కాదా..? ఏమిటీ డ్రామా..? ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తి ఇలా డ్రామాలు ఆడడం ధర్మమేనా..? ఇది దారుణమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కించపర్చాలనే దుర్బుద్ధి చంద్రబాబుకు ఉంది. ఆ దుర్బుద్ధిని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మోస్తున్నారు. ఇప్పటికైనా ఎందుకు నోరు విప్పడం లేదు.

ఈసీ రమేష్‌కుమార్‌కు, ఆయన కుటుంబానికి ప్రాణహని ఉందని లెటర్‌లో ఉంది. రాష్ట్రంలో ఏమైనా సంఘటనలు జరిగాయా..? ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టుకు వెళ్లాం. తీర్పు వచ్చిన తరువాత నుంచి చంద్రబాబు, రమేష్‌కుమార్‌ గందరగోళానికి గురవుతున్నారు. తీర్పు వచ్చిన తరువాతే లెటర్‌ రాసినట్లుగా అనిపిస్తుంది. అందుకని లెటర్‌పై వాస్తవాల కోసం డీజీపీని కలిసి వివరించాం. ఫోర్జరీ లెటర్‌ అయితే ఇది చాలా పెద్ద నేరం అవుతుంది. దీనిపై విచారణ జరిపించాలని కోరాం. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాసి ఉంటే కచ్చితంగా ఎదుర్కొంటాం.

నాకు సెక్యూరిటీ లేదని లేఖలో ఉంటే వెంటనే ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సెక్యూరిటీ పెంచింది. కావాల్సిన రక్షణ కల్పించింది. తెలంగాణ డీజీపీకి కూడా ఫోన్‌ చేసి రమేష్‌కుమార్‌కు రక్షణ కల్పించాలని ఏపీ డీజీపీ కోరారు. అధికారులపై దౌర్జన్యం చేసే అలవాటు, లక్షణం వైయస్‌ఆర్‌ సీపీకి లేదు. ఐపీఎస్‌ అధికారుల చొక్కాలు పట్టుకున్న నీచమైన చరిత్ర చంద్రబాబు పార్టీ నాయకులది.

Back to Top