చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో డిపాజిట్‌లు కూడా రావు

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

పుంగ‌నూరు:  ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో డిపాజిట్‌లు కూడా రావని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి జోస్యం చెప్పారు.  కక్షపూరితంగా చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లి.. ప్రాజెక్ట్ నిర్మాణాలపై స్టే తెచ్చారని వ్యాఖ్యానించారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో తాగు సాగు నీటిని అందించాలని మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామని.. ఇప్పటికే రెండు రిజర్వాయర్ల నిర్మాణ పనుల్ని దాదాపు పూర్తి చేశామని తెలియజేశారు. ఆ నిర్మాణాలు పూర్తయితే.. రైతులకు, ప్రతి ఇంటికి నీరు అందుతుందని అన్నారు. కానీ.. ఇంతలోనే చంద్రబాబు ఆ నిర్మాణాల్ని ఆపేందుకు సుప్రీంకోర్టుకి వెళ్లి, స్టే తీసుకొచ్చారని మండిపడ్డారు.

గతంలో రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తే, దానిని ఒకటిన్నర సంవత్సరం పాటు కోర్టులో అడ్డుకున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని.. చంద్రబాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా.. ప్రతిపక్షాలు అభివృద్ధి లేదని విమర్శలు చేస్తున్నాయని, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి జరుగుతున్న వారికి అది కనపడదని ఎద్దేవా చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా.. వైయ‌స్ఆర్‌ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.  టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే వైయ‌స్ఆర్‌ సీపీ భయపడదని.. రాజకీయంగా తాము టీడీపీలాగా ఊతకర్ర పట్టుకుని నడిచే పరిస్ధితుల్లో లేమని చురకలంటించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే ముందు.. ఆయన గెలుస్తారో లేదో ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబును సీఎంను చేసేందుకే పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేర్కొన్నారు.

Back to Top