2024 ఎన్నికల్లో కుప్పం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే.. 

పులివెందులకు నీళ్లిచ్చాననే బాబు.. కుప్పానికి ఎందుకివ్వలేదు

చిత్తూరు: 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 16 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. తనను 30 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలకు చేసిందేమీ లేదని, చివరకు కుప్పంను మున్సిపాలిటీగా కూడా చేసుకోలేకపోయాడని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ చేయూత పథకంలో భాగంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.  

'కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది. అభివృద్ధి ఎలా ఉందో కుప్పం ప్రజలే ఆలోచన చేసుకోవాలి. 30 సంవత్సరాలుగా చంద్రబాబు కుప్పం ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకువచ్చాడో ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏ రాష్ట్రంలో ఎవరూ, ఎప్పుడూ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల సాయం  డీబీటీ ద్వారా, నాన్‌ డీబీటీ ద్వారా 5 కోట్ల 30 లక్షల ఒక వెయ్యి 22 మందికి ఇప్పటి వరకు లబ్ధి చేకూర్చారు. మహిళలందరూ సీఎం వైయస్‌ జగన్‌ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు డైరెక్టర్‌గా బటన్‌ నొక్కి 23 సంక్షేమ పథకాల ద్వారా సాయం అందించారు. నాన్‌ డీబీటీ కింద 6, మొత్తం కలిసి 29 పథకాలను ప్రారంభించారు. 

ఇప్పటి వరకు కుప్పం పట్టణంలో 6వేల ఇళ్లు ఇచ్చాం, మరో 4 వేలు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 10వేల ఇళ్లు ఇస్తున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్ని ఇళ్లు ఇచ్చారో ఆలోచన చేయాలి. చంద్రబాబు పులివెందులకు నీరు ఇచ్చి ఉంటే.. కుప్పంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాను. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన హంద్రీనీవా కాల్వను కుప్పం వరకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నాను. సీఎం వైయస్‌ జగన్‌ యుద్ధప్రాతిపదికన హంద్రీనీవా పూర్తిచేయిస్తున్నారు. నాడు–నేడు కింద స్కూల్స్, ఆస్పత్రులు అభివృద్ధి చెందాయి.. పేద పిల్లలు చదువుకునేందుకు సీబీఎస్‌ఈ తీసుకువచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 93 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు మంజూరు చేశాం. 81 సచివాలయాలు పూర్తిచేసుకున్నాం. 

పేదలు, బీసీలు వీరందరినీ మోసం చేసి.. సులువుగా గెలవొచ్చు అని చంద్రబాబు కుప్పంను ఎంచుకున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ కుప్పం నియోజకవర్గానికి వస్తే చంద్రబాబుకు ఎందుకు బాధ అని ప్రశ్నిస్తున్నాను. రంగస్వామినాయుడు అనే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉంటే.. ఆయన్ను బలవంతంగా రాజీనామా చేయించి కుప్పంలో చంద్రబాబు పాతుకుపోయాడు. 30 ఏళ్లుగా కుప్పం ప్రజలను మోసం చేస్తున్నాడు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాం.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేస్తాం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 

Back to Top