మాఫియాకు కళ్లెం వేసేందుకే నూతన ఇసుక పాలసీ

పంచాయతీ రాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

నందిగామ: ప్రజలందరికీ ఇసుక ధరలు అందుబాటులో ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారని పంచాయతీ రాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నందిగామ నియోజకవర్గం చెవిటికల్లు ప్రాంతంలో ఇసుక రీచ్, ఇసుక నిల్వ అమ్మక కేంద్రాన్ని ఎమ్మెల్యేలు జగన్‌మోహన్‌రావు, సామినేని ఉదయభానులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే సీఎం నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చారన్నారు. గత పాలకులు ఏ విధంగా ఇసుకను దోచుకున్నారో ప్రజలంతా గమనించారన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఇసుక మాఫియాకు చంద్రబాబే లీడర్‌గా వ్యవహరించారని గుర్తుచేశారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా కూడా విధించిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఇసుక అందుబాటు ధరలో ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ కొత్త పాలసీ తీసుకువచ్చారన్నారు. ఎవరైనా ఇసుక కావాల్సిన వారు తహసీల్దార్‌ కార్యాలయం, మీ సేవా, ఇసుక రీచ్‌ల వద్ద అధికారులను సంప్రదించవచ్చన్నారు.

Back to Top