జ‌న‌వ‌రిలో ఉచిత రేష‌న్ బియ్యం పంపిణీ

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి: డిసెంబర్‌లో పంపిణీ చేయాల్సిన ఉచిత రేషన్‌ బియ్యాన్ని జనవరిలో అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. పీఎంజీకేఏవై కింద కేంద్రం ఉచిత బియ్యం పంపిణీని డిసెంబర్‌ (2021) నుంచి మార్చి( 2022) వరకు పొడిగించిందన్నారు. ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రతా పథకంలోని కార్డుదారులు ఒక్కొక్కరు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పొందనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం 89 లక్షల మందికి (జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు) సరిపడే 1,34,110.515 టన్నుల బియ్యాన్ని మాత్రమే కేటాయించిందన్నారు. అయితే ఏపీలో మొత్తం 144 లక్షల మంది లబ్ధిదారులకు 2,11,592.890 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సరిపడ నిల్వలు లేకపోవడంతో పంపిణీని వాయిదా వేసినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. పీఎంజీకేఏవై కింద రాష్ట్రంలోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 5,36,442.040 టన్నుల బియ్యాన్ని ఉచితంగా.. 3,27,120  టన్నుల బియ్యాన్ని బయట మార్కెట్‌ ద్వారా రాష్ట్రానికి విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 1న కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఇంత వరకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి స్పందనలేదని మంత్రి కొడాలి నాని తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top