తాడేపల్లి: చంద్రబాబూ నీకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేసి నన్ను ఓడించు.. ఇదే నా సవాల్’.. అని మంత్రి కొడాలి నాని చాలెంజ్ చేశారు. రాష్ట్రంలో పగటి వేషగాళ్లలా.. పసుపురంగు వ్యాను, కండువాలు వేసుకొని పప్పు, తుప్పులు తిరుగుతున్నారని మండిపడ్డారు. పర్యటనల పేరుతో ప్రజలకు అబద్ధాలు చెబుతూ నోటికి ఇష్టమొచ్చినట్లు అడ్డూ అదుపూ లేకుండా పప్పు, తుప్పులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రసంగాలు చూస్తుంటే మద్యం బ్రాండ్‌లు ప్రమోట్ చేస్తానని డబ్బులు తీసుకొని వచ్చినట్లు ఉంది. తమ్ముళ్లూ.. ఈ బీర్, ఆ వైన్, ఈ విస్కీ, ఆ బ్రాందీ అని పేర్లు చంద్రబాబు చదువుతున్నట్లు ఉంది. ఆ బ్రాండ్లు ప్రమోట్ చేస్తానని ఆ కంపెనీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఉన్నారు. ఒట్టిపోయిన గేదెలా చంద్రబాబు ఆ మద్యం కంపెనీల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఉందని పేర్కొన్నారు. ఆదివారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. అంతులేని బెల్టు షాపులు: ‘అమ్మ ఒడి రూ.14 వేలు ఇస్తున్నారు నాన్న బుడ్డీ అని రూ.36 వేలు తీసుకుంటున్నారు. తద్వారా రూ.26 వేలు సంవత్సరానికి బాకీ అంట. బయట శ్రీ జగన్ అమ్మ ఒడి పెట్టి రూ.14వేలు ఇచ్చారని జనాలు మెచ్చుకుంటున్నారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం తెస్తే దాన్ని తుప్పు చంద్రబాబు ఎత్తేశారు. చంద్రం బుడ్డీ తెచ్చి ఇంటింటికీ బెల్ట్‌షాపులు పెట్టిన నిష్ట దరిద్రుడు చంద్రబాబే. రాష్ట్రానికి బాబు పీడ విరిగిపోయింది. కానీ ఇప్పుడు పప్పు, తుప్పులు కలిసి బ్రాండ్ల దగ్గర డబ్బులు కొట్టేసి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. సిగ్గూ, శరం లేదు. నీతి, జాతి లేదు. మద్యం బ్రాండ్ల అమ్మకాలకు ప్రమోటర్‌గా మారిన చంద్రబాబును ఏమి చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు’. ఆ అప్పులు ఎక్కడికి పోయాయి?: ‘సీఎం శ్రీ వైయస్ జగన్ లక్ష కోట్లు అప్పు తెచ్చి పేద ప్రజల నెత్తిన పెట్టారని చంద్రబాబు అంటున్నారు. లక్ష కోట్లను సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు.. అమ్మ ఒడి, వైయస్‌ఆర్ చేయూత, వైయస్‌ఆర్ భరోసా, స్కూల్ పిల్లలకు, స్కూల్స్ ఆధునీకరణ, పుస్తకాలకు, బూట్లకు, దుస్తులకు, పింఛన్లకు, ఆటోవాలాలకు, వివిధ వృత్తులలో ఉన్న వారికి రూ.90 వేల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా సహాయం చేశారు. కానీ చంద్రబాబు రూ.3.65 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారు?. చంద్రబాబు ఆయన కొడుకు పప్పు, బినామీలు పందికొక్కుల్లా రాష్ట్ర సంపదను లూటీ చేశారు. శ్రీ జగన్ లక్ష కోట్లు అప్పు తెచ్చి కరోనా సంక్షోభంలోనూ రూ.90 వేల కోట్లు ప్రజలకే ఇచ్చారు. అప్పులతో ప్రజలను ఆర్థికంగా పైకి తీసుకురావటానికి ఖర్చు పెట్టారు. రూ.3.65 లక్షల కోట్లు అప్పులు తెచ్చి చంద్రబాబు, ఆయన బినామీలు దోచుకొని తిన్న మాట వాస్తవం కాదా? దీనికి మేం సమాధానం చెప్పటం కాదు. చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’. పందికొక్కుల్లా తిన్నారు కాబట్టే..: ‘వెల్లంపల్లి కొబ్బరిచిప్పల మంత్రి అట. మరి చంద్రబాబు పక్కనే కొబ్బరిబిప్పలు ఎత్తుకువెళ్లిన వాడు, సైకిల్ బెల్ ఎత్తుకు వెళ్లిన వాడు ఉన్నారు. ఆ పని చేసేది చంద్రబాబు మనుషులే. విజయవాడ కనకదుర్గమ్మ సమక్షంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు క్షుద్రపూజలు చేశారు కాబట్టే మంగళగిరిలో పప్పును ఓడించి అనాథలా రోడ్డు మీద అమ్మవారు పడేశారు. ఆ కొండ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ తల్లి ఆశీస్సులతోనే వెల్లంపల్లి ఎమ్మెల్యే అయ్యారు. ఆ దుర్గమ్మ ఆశీస్సులతోనే దేవాదాయ శాఖ మంత్రి కూడా అయ్యారు. కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు చేసిన నీచాతినీచుడు కాబట్టే చంద్రబాబు, ఆయన కొడుకు చిత్తుచిత్తుగా ఓడారు. పైగా కృష్ణా పుష్కరాల పేరుతో ఏకంగా రూ.3 వేల కోట్లు పందికొక్కులా తిన్నారు కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడింది’. ఇప్పుడు ఆ దీక్ష ఏమైంది?: ‘పప్పు, తుప్పులకు నీతి, జాతి లేదు. నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. పైగా ఓటు అడగటానికి రాలేదు. ప్రజల్లో చైతన్యం తెస్తారట. గతంలో ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్ష అంటూ.. నల్ల బట్టలు వేసుకొని దేశం అంతా, రాష్ట్రం అంతా తిరిగారు. ఓడిపోయిన తర్వాత ఏమైంది ధర్మపోరాట దీక్ష. పులిని అని చెప్పుకున్న చంద్రబాబు మోదీ పేరు ఎత్తితే ఎక్కడ తంతారో అన్న భయంతో పిల్లిలా దాని గురించి మర్చిపోయాడు. చంద్రబాబు లాంటి తుప్పును నమ్ముకొని రాష్ట్ర ప్రజలు ముందుకు వస్తారా?’. అలా చెప్పడం హాస్యాస్పదం: ‘చంద్రబాబు ఏంటో, ఆయన బ్రతుకు ఏంటో.. రాష్ట్ర ప్రజలకు తెలీదా? మార్చి 28న కరోనా వస్తే.. ఎనిమిది నెలలు పాటు ఇంట్లో నుంచి బయటకే రాలేదు. ఈ రాష్ట్రంలో కూడా లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలకు పౌరుషం లేదా? మీరు మగాళ్లు కాదా? మీకు బాధ్యత లేదా? మీరు ఇంటికి ఒకరు బయటకు రమ్మని అనటం ఏంటి? చంద్రబాబే సన్నాసి. ఎనిమిది నెలలు ఇంట్లో దాక్కొని జూమ్ కెమెరాలు పెట్టుకొని సొల్లు కబుర్లు చెప్పాడు. ఈ ప్రాంతంలో పౌరుషం ఉంది కాబట్టే.. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా చంద్రబాబు మూతిపళ్లు రాలేలా కొట్టారు. ఎనిమిది నెలల తర్వాత ఎన్నికలు వచ్చాయని తుప్పు, పప్పులు బయటకు వచ్చారు. తాము ప్రజల కోసం పాటు పడుతున్నామని, అయినా వారు బయటకు రావటం లేదని అనటం హాస్యాస్పదం. ఇంట్లో దాక్కొన్న ముసలి నక్క చంద్రబాబే. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ పౌరుషం ఉంది. ప్రతి ఒక్కరిలో ఆలోచించే శక్తి ఉంది’. ఆయన్నే బయటకు పంపాలి: ‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు. ఎన్టీఆర్ పదవిని, ఆ దేవుడ్ని చంపిన దుర్మార్గుడు చంద్రబాబు. మా వాళ్లు అందరూ కృష్ణా జిల్లా నుంచి చంద్రబాబును బయటకు పంపాల్సిన అవసరం ఉంది. అందు కోసం ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలి’. దమ్ముంటే మోదీని ప్రశ్నించాలి: ‘డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి వ్యయం పెరగడానికి ఎవరు బాధ్యులు? కేంద్రం పరిధిలో అంశాలన్నీ తీసుకొచ్చి సీఎం శ్రీ వైయస్ జగన్ అందుకు కారణం అనడం ఏమిటి? చంద్రబాబుకు దమ్ము ఉంటే మోదీని ప్రశ్నించాలి. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని నిలదీయాలి. కానీ మోదీ పేరు ఎత్తే ధైర్యం లేని ఒక పిల్లి చంద్రబాబు. ప్రధానిని ప్రశ్నించలేని బాబు సీఎంపై నిందలు వేయటం సరి కాదు’. ఎవరికీ అర్ధం కాని బ్రతుకు!: ‘దివంగత వైయస్‌ఆర్ ఒక రాజు. ఆయన చాలా అదృష్టవంతుడు. చంద్రబాబును రెండుసార్లు చిత్తుగా ఓడించారు. వైయస్‌ఆర్ పేరుతో పార్టీ పెట్టి ఆయన కుమారుడు శ్రీ వైయస్ జగన్ కూడా చంద్రబాబును చిత్తు్తచిత్తుగా ఓడించారు. తండ్రీ కొడుకులు (వైయస్‌ఆర్, జగన్) ఇద్దరూ చంద్రబాబును గుడ్డలు ఊడ దీసి రోడ్డు మీద నిలబెడితే.. ఇంకా నావి పీకండని చంద్రబాబు అనటం ఏంటి? బాబుకే సిగ్గు, శరం లేదు. మొన్న కుప్పంలో కూడా రోడ్డు మీద వేశారు. సిగ్గు, శరం లేకుండా నావి పీకండని అంటున్నారు. ఏం పీకాలో చెప్పమనండి. ఎందుకు బ్రతుకుతున్నారో చంద్రబాబుకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? దరిద్రపు బ్రతుకు. వైయస్‌ఆర్ చేతిలో రెండుసార్లు, జగన్ గారి చేతిలో ఒకసారి ఓడిపోయిన చంద్రబాబుకు ఇంకా బుద్ది రాలేదు. ఇక, శ్రీ జగన్ పిల్లలు కూడా వచ్చి ఓడించాలా? ఎవ్వరికీ అర్థంకాని బ్రతుకు చంద్రబాబుదే’. చంద్రబాబును నమ్మితే..: ‘బీజేపీలోకి చంద్రబాబే తన నలుగురు ఎంపీలను పంపించారు. కేంద్రం కేసులు పెట్టకుండా.. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి చంద్రబాబే పంపాడు. పైగా బీజేపీ ప్రాపకం కోసం పాకులాడే చంద్రబాబు పోరాటాలు చేస్తాడట. ఈ దొంగను నమ్మి ప్రజలు అంతా వచ్చి వెనకాల నిలబడాలట. బాబును నమ్మితే కుక్కతోకను పట్టుకొని గోదావరి ఈదినటే’్ల. ‘ఓటుకు వెయ్యి రూపాయల నుంచి రూ.2 వేల వరకు సీఎం ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కానీ ఓటుకు రూ.5 కోట్ల సూట్ కేసు పంపిన దొంగను రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. అడ్డంగా వీడియో, ఆడియో టేపుల్లో దొరికిన దొంగ ఈ శని కాదా? ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో చంద్రబాబు పారిపోయి వచ్చి నది పక్కన గట్టున కూర్చున్నాడు. పైగా తెలంగాణలో అన్నీ వదిలేసుకొని కేసీఆర్‌తో రాజీ పడి పారిపోయి రాష్ట్రానికి వచ్చాడు’. పోటీ చేయడానికీ రావడం లేదు: ‘ఇప్పుడు ఏబీసీడీ అని కనిపెట్టారు. ఎనిమిది నెలలు ఇంట్లో ఉండి. ఎబీసీడీఈఎఫ్.. చంద్రం తాత టప్ అని మనవడు పాట పాడుకుంటూ తిరిగాడంట. అవి విని.. విని.. చంద్రబాబు మనవడు గుర్తుకు వచ్చి ఏబీసీడీ అంటున్నారు. 2019లోనే చంద్రం తాతకు పగిలిపోయిందని రాష్ట్రం అంతా తెల్సు. చంద్రబాబు మనవడుకు కూడా తెల్సు. ఏదిపడితే అది మాట్లాడతారు. పప్పు, తుప్పులే రాష్ట్రానికి పట్టిన శని. జామాతా దశమగ్రహ అని మహానుభావుడు ఎన్టీఆర్ మాటలను గుర్తు చేసుకోవాలి’. ‘కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే అయి ఇందిరాగాంధీకి శని పట్టించాడు. భవిష్యత్‌లో చంద్రబాబే రాష్ట్రానికి శనిలా పడతారని ఎన్టీఆర్ చెప్పారు. చంద్రబాబు తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం రెండు ముక్కలైంది. తెలంగాణలో టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరుపున పోటీ చేయటానికి అభ్యర్థులు నిలబడని పరిస్థితి తెచ్చారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఏకగ్రీవంగా వదిలేశారు. వ్యాపారం చేసే వారిని రాజకీయాల్లోకి తెచ్చారు. ఓడిపోయిన తర్వాత వారంతా చంద్రబాబును వదిలేసి పారిపోయారు. దీంతో బాబు పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయింది. టీడీపీ తరుపున పోటీ చేయటానికి వ్యక్తులే లేరు. దానికి శ్రీ జగన్ గారు, ఎస్‌ఈసీని మమ్మల్ని చంద్రబాబు తిడుతున్నారు. టీడీపీ తరుపున పోటీ చేస్తే డిపాజిట్లు రావని పారిపోతున్నారు. వారి పారిపోతే మేం ఏం చేస్తాం. దానికి చంద్రబాబే ఆలోచించుకోవాలి’. పనికి మాలిన మాటలు ఆపాలి: ‘ఏ మాత్రం బుద్ధీ జ్ఞానం లేకుండా పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడటం ఏంటి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిసారీ పెద్దిరెడ్డి గారు గెలిచారు. రెండుసార్లు నన్ను ఓడిస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. చంద్రబాబును పొగిడితే వైయస్‌ఆర్‌సీపీలో ఉన్నవారిని గెలిపిస్తారా? పనికిమాలిన మాటలు మాట్లాడటం చంద్రబాబు ఆపాలి. ఈరోజు చంద్రబాబు పిచ్చి ఎక్కి పిచ్చి పరాకాష్టకు చేరి ఏదిపడితే.. ఏ ఎండకు ఆ గొడుగు.. పగటి వేషగాడిలా మాట్లాడుతున్నారు’. ‘విశాఖలో పరిపాలన రాజధానికి చంద్రబాబు ఒప్పుకుంటున్నారా? వికేంద్రీకరణకు ఒప్పుకుంటున్నావా అంటే పిల్లిలా మాట్లాడకుండా వచ్చారు. పైగా విజయవాడకు వచ్చి మీకు పౌరుషం లేదా? అమరావతి అంటే ప్రేమ లేదా అనటం ఏంటి? చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో పందికొక్కుల్లా వేల ఎకరాలు దోచుకున్నారు. కోర్టులను ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్లు, స్టేలు తెచ్చారు. దమ్ముంటే ఆ స్టే లు ఎత్తేయించు. 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే రాజకీయాల నుంచి వెళ్లిపోతాను’. ఆ రోజు వస్తుంది: ‘ముఖ్యమంత్రిని వాడు, వీడు అనటం ఏంటి? ఇలాంటి పిచ్చిపిచ్చి మాటలు చంద్రబాబు కట్టిపెట్టాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదు. పప్పు, తుప్పులు 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల్లో ఒక్కటీ కైవసం చేసుకోలేరు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు జగన్ గారు. ప్రజల్ని నమ్ముకొని పార్టీని పెట్టిన నాయకుడు జగన్ గారు. ప్రజలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయిన నాయకుడు శ్రీ జగన్ గారు. ప్రజలకు ఏం కావాలో.. జగన్ గారికి.. జగన్ గారికి ఏం కావాలో ప్రజలకు తెల్సు. ప్రజలకు, జగన్ గారిని విడదీయలేని బంధం ఉంది. చంద్రబాబు లాంటి 420 చీటర్స్ చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వైయస్‌ఆర్ గారిపై చంద్రబాబు ఏడ్చారు. ఇప్పుడు శ్రీ జగన్ గారిపై పడి ఏడుస్తున్నారు. త్వరలోనే చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చే రోజు వస్తుంది’. దమ్ముంటే అక్కడ పోటీ చేయాలి: ‘మేం బూతుల మంత్రులం, అవినీతి మంత్రులం అట. పేకాట ఆడిస్తున్నామట. 1975లో ఎమ్మెల్యే అయినప్పుడు చంద్రగిరిలో చంద్రబాబే వ్యభిచార గృహాలు, పేకాట క్లబ్బులు నడిపారు. అందుకే 1983 ఎన్నికలప్పుడు చంద్రబాబును చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించారు. సిగ్గూశరం లేదు కాబట్టే ఎన్నిసార్లు గడ్డిపెట్టినా మారటం లేదు. పోటుగాడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు దమ్ముంటే.. గుడివాడ వచ్చి పోటీ చేయాలి. ఎవరు ఏమిటో... గుడివాడ ప్రజలే తీర్పు చెబుతారు’. హెరిటేజ్‌ను అడ్డం పెట్టుకుని!: ‘హెరిటేజ్ అడ్డంపెట్టుకొని దోచుకున్న డబ్బుతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారు. కుటుంబం అంతా దొంగ వ్యాపారంతో ప్రజల డబ్బును దోచుకున్న కుటుంబం చంద్రబాబుదే. ఇంకోసారి చంద్రబాబు పేకాట గురించి మాట్లాడితే బావుండదు. ప్రజల రక్తపు కూడు తిన్న కుటుంబం చంద్రబాబుదే. శ్రీ జగన్ గారు మంచివారు, పద్ధతి ఉన్నవ్యక్తి కాబట్టి చంద్రబాబును వదిలేస్తున్నారు’. కానీ నా జోలికి వస్తే.. పిచ్చి కుక్కల వ్యాన్‌లో పెట్టి కరెంట్ షాక్ ట్రీట్‌మెంట్ ఇప్పి మెదడు సక్రమంగా పని చేసేలా చేస్తాను’.. అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.