మాయల మార్తాండ చంద్రబాబు

టీడీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్‌ కంటే హీనమైంది

చంద్రబాబు ఒక్క బీసీ నాయకుడినైనా రాజ్యసభకు పంపించాడా..?

నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

బాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఏం చేశాడు..?

మాయమాటలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తావు బాబూ..? నీ ఆటలు ఇక సాగవు

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేశారు

వైయస్‌ జగన్‌ పాలన పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు

పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, బడుగు, బలహీనవర్గాలు తల ఎత్తుకొని తిరిగేలా పరిపాలన సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పరిపాలనలో సీఎం వైయస్‌ జగన్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. అక్కచెల్లెమ్మలు గడప దాటకుండా వలంటీర్ల చేత ప్రతీ సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. రైతులను ఆదుకున్నారు.. బీసీల అభ్యున్నతి కోసం మూడున్నరేళ్లలో రూ.85 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో టిష్యూ పేపర్‌ కంటే హీనమైందని, తుడిచి పారేయడానికి తప్ప దేనికీ పనికిరాదన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి కారుమూరి ఏం మాట్లాడారంటే..
బీసీల కోసం రూ.85 వేల కోట్లు సీఎం వైయస్‌ జగన్‌ ఖర్చు చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రూ.35 వేల కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించాడా..? ఇవాళ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అట్టడుగున ఉన్న కులాల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. 56 కార్పొరేషన్‌ చైర్మన్లు ఇచ్చి బీసీల అభ్యున్నతికి సీఎం వైయస్‌ జగన్‌ పాటుపడ్డారు. ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తున్న సీఎం వైయస్‌ జగనే కావాలని బీసీలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. 

చంద్రబాబు ఎప్పుడూ బీసీలను మోసమే చేశారు. తోక కత్తిరిస్తా.. తాటతీస్తా.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా బడుగు, బలహీనవర్గాలను అవమానించేలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంక్‌గానే చూశారు. 

సీఎం వైయస్‌ జగన్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయినా.. అద్భుతమైన పాలన అందిస్తున్నారు. మహిళలు గడప దాటకుండా వలంటీర్ల చేత ప్రతీ సంక్షేమాన్ని అందిస్తున్నారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇచ్చారు. 25 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. నాలుగేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీకి ఛాలెంజ్‌ విసురుతున్నా.. వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను అమలు చేశాం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాగితం మీద చూడకుండా చెబితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కలెక్టర్లు, మా నాయకులు, ఎవరైనా కాగితం చూడకుండా పథకాలు వరుసగా చెబితే రూ.10 లక్షలు ఇస్తా.. 

చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 650 వాగ్దానాలతో మేనిఫెస్టో ఇచ్చాడు. దాంట్లో డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ అని మాయమాటలు చెప్పి మోసం చేశాడు. 2019 ఎన్నికల సమయం దగ్గరపడుతుందని సివిల్‌ సప్లయ్‌ డిపార్టుమెంట్‌ నుంచి రూ.4,900 కోట్లు పసుపు కుంకుమకు మళ్లించాడు. అప్పుడు బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టాడు. ఎన్నికలు మరో నెలలో ఉన్నాయనగా రూ.1000 చొప్పున కొంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నాడు. 

సీఎం వైయస్‌ జగన్‌ నాలుగేళ్ల తన పాలనతో ప్రతి కుటుంబంలో ఒక కొడుకులా, తమ్ముడిలా, అన్నలా, మనవడిలా, మామయ్యగా పెనవేసుకున్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని పిల్లిమంత్రాలు వేసినా సీఎం వైయస్‌ జగన్‌ను ప్రజల నుంచి వేరు చేయలేడు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ జమ చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయం, ఫ్యామిలీ డాక్టర్, ఆర్బీకేలు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గానికో మెడికల్‌ కాలేజీ తీసుకొచ్చారు. 

చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఏం చేశాడు..? ఎల్లో మీడియాను అడ్డుకొని పచ్చి ప్రగల్భాలతో ప్రజలను మాయ చేయడం తప్ప.. ఏం చేశావ్‌..? ఈ మధ్య కాలంలో ఆయన కొడుకు లోకేష్‌ అరటిపండు మా నాన్నే కనిపెట్టాడని మాట్లాడుతున్నాడు.. ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తావు చంద్రబాబూ..? నీ ఆటలు సాగవు. 

తల్లికి అన్నం పెట్టని వాడు.. పినతల్లికి బంగారు గాజులు చేపిస్తానన్న చందంగా చంద్రబాబు తీరు ఉంటుందని ఆనాడు అసెంబ్లీలో మహానేత వైయస్‌ఆర్‌ చెప్పారు. చంద్రబాబు ఏది చేస్తానని చెప్పినా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో టిష్యూ పేపర్‌ కంటే హీనమైంది. తుడిచి పారేయడానికి తప్ప దేనికీ పనికిరాదు. 

మొన్నటి వరకు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు మాట్లాడాడు. చంద్రబాబు అధికారంలో ఉండగా రూ.2,71,450 కోట్ల అప్పు చేశాడు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.1.30 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశారు.  జవాబుదారీతనంతో సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారు. యూపీ రూ.8 లక్షల కోట్లు, తమిళనాడు రూ.5.5 లక్షల కోట్లు, కర్నాటక రూ.5 లక్షల కోట్లు, గుజరాత్‌ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఏపీకి రూ.3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంది. దాంట్లో 70 శాతం చంద్రబాబు చేసిందే. కానీ, చంద్రబాబు మాత్రం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురదజల్లుతూనే ఉన్నాడు. చంద్రబాబు మాయలఫకీర్‌ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ. మాయల ఫకీర్‌ మార్తాండ చంద్రబాబు. చంద్రబాబు నిజం చెబితే ఆయన తలకాయ వెయ్యి ముక్కలు అవుతుంది. అందుకే అన్నీ అబద్ధాలే చెబుతాడు’ అని మంత్రి కారుమూరి అన్నారు.
 

Back to Top